ఊరు దాటని కట్టు

ABN , First Publish Date - 2021-06-16T07:19:18+05:30 IST

వాల్మీకిపురం మండలం నగరిమడుగు పంచాయతీ పరిధిలో కొండగుట్టల్లో ఒదిగినట్టు కనిపించే చిన్న పల్లె షికారిపాలెం. 50 గడపలున్న ఇక్కడ 160 మంది షికారీలు నివాసముంటున్నారు. గతేడాది మార్చి మొదలు ఇప్పటి వరకూ ఒక్కరికి కూడా షికారిపాలెంలో కరోనా వైరస్‌ సోకలేదు.

ఊరు దాటని కట్టు
వాల్మీకిపురం మండలంలోని షికారిపాలెం గ్రామం

 కరోనా సోకని పల్లె : షికారిపాలెం

కంటికైనా ఆనని ఒక నిర్జీవ క్రిమి ముందు ప్రపంచమే తల వంచింది. కరోనా సృష్టిస్తున్న మృత్యువిలయానికి గడగడలాడుతోంది. నగరం, పట్టణం, పల్లె... కొవిడ్‌ వైరస్‌ తాకని తావులేదు. బాధితులు కాని కుటుంబం లేదు. మరణాలు సంభవించని ఊరు లేదు. ఏడాదిన్నర కిందట తొలి అలలో 90వేల మందిని జిల్లాలో తాకిన వైరస్‌, రెండో అలలో ఇప్పటికే 1.16 లక్షల మందికి సోకింది. అధికారిక లెక్కల ప్రకారమే 1400 మందిని బలితీసుకుంది. లెక్కల్లోకి ఎక్కని మరణాలు ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువ.  ఇంత బీభత్సకాలంలోనూ కరోనా క్రిమి దరిచేరని గ్రామాలు అక్కడక్కడా జిల్లాలో కనిపిస్తున్నాయి. కొండలకిందా, అడవి అంచునా ఉండడమే ఒక ప్రత్యేక లక్షణంగా ఉన్న ఈ పల్లెల్లో మనుషుల ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ బహుశా వీరిని వైరస్‌కు దూరంగా ఉంచుతున్నాయని అనిపిస్తోంది. ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే కరోనాకు అంత దూరంగా ఉండడం సాధ్యమేనని ఈ పల్లె జీవనాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది. నక్కలవాళ్లు, యానాదులు వంటి వారు వైరస్‌ బారిన పడడం దాదాపుగా కనిపించడం లేదు. ఈ పల్లెల్ని, ఇక్కడి జనజీవనశైలినీ అధ్యయనం చేస్తే భవిష్యత్తు తరాలను అయినా విషక్రిముల విపత్తుల నుంచి కాపాడ వచ్చు. ఈ ఆలోచనతోనే కరోనాకు తలవంచని పల్లెల కథలు వరుసగా ప్రచురిస్తున్నాం...


వాల్మీకిపురం, జూన్‌15: వాల్మీకిపురం మండలం నగరిమడుగు పంచాయతీ పరిధిలో కొండగుట్టల్లో ఒదిగినట్టు కనిపించే చిన్న పల్లె షికారిపాలెం. 50 గడపలున్న ఇక్కడ 160 మంది షికారీలు నివాసముంటున్నారు. గతేడాది మార్చి మొదలు ఇప్పటి వరకూ ఒక్కరికి కూడా షికారిపాలెంలో కరోనా వైరస్‌ సోకలేదు.

సంచార జీవులైన షికారీలు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడ్డారు. తొలినాళ్ళలో వేట ప్రధాన వృత్తిగా ఉండేది. చుట్టుపక్కల ఆడవుల్లో పక్షులు, చిన్నపాటి జంతువులూ వేటాడి వాటిని వాల్మీకిపురంలో అమ్ముకునేవారు. ప్రభుత్వం భూములు ఇవ్వడంతో వ్యవసాయంలోకి దిగారు.  చుట్టుపక్కల రైతుల పొలాల్లో నూ కూలిపనులకు వెళ్ళడం మొదలు పెట్టారు. కొన్ని రకాలైన ఫ్యాన్సీ వస్తువులు తయారు చేసి మహరాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు వెళ్ళి అమ్ముకునేవాళ్ళు కూడా ఉన్నారు. వ్యవసాయానికి సాగునీటి కొరత ఏర్పడడంతో సమీప ప్రాంతాల్లో ఫ్యాన్సీ వస్తువుల వ్యాపారమే వీరి జీవనాధారమైంది. అయితే కరోనా మొదలైనాక వీరి వ్యాపారం కుంటుపడింది.   చుట్టుపక్కల కూలిపనులు కూడా పరిమితంగానే దొరుకుతున్నాయి.  వారానికి మూడు నాలుగు రోజులు  మాత్రమే పనులు దొరుకుతున్నాయి. పని దొరకని రోజున పల్లె దాటరు. రాగి సంగటి ప్రధానంగా తింటారు. సమీపంలో దొరికే  అనేక రకాల ఆకులతో సంగటిలోకి కూరలు చేసుకుంటారు. వేటాడిన పక్షో, జంతువో వండుకుని తింటారు. పెద్దగా అనారోగ్యాలు కూడా ఎప్పుడూ వీరి దరి చేరవు. చిన్నా చితకా ఆరోగ్య సమస్యలు వచ్చినా సంప్రదాయంగా పెద్దలనుంచి అనుసరించే పద్ధతులే పాటిస్తారు. ఆసుపత్రులకు పరుగులు తీయరు. ఆడవిలో దొరికే వేర్లు, ఆకుపసర్లే వాడుతారు.  పల్లె దాటే అవసరం చాలా తక్కువగా ఉంటుంది. అట్లాగే ఇతరులు కూడా షికారిపాలెంలోకి వచ్చే అవసరం దాదాపుగా ఉండదు. పనులకు మనుషులు అవసరం అయినా ఊళ్లో ఒక చోట నిలబడి పిలుస్తారు.  ఊళ్లో ఉన్నా ఇళ్లలోనే బందించినట్లుగా ఉండరు. పొలాల్లో, చెట్ల కిందా  తిరుగుతూ ఉంటారు.  పల్లె దాటకపోవడం, ఇతర ప్రాంతాలతో సంబంధాలు పెద్దగా ఉండకపోవడం, పౌష్టికాహారం, శారీరక శ్రమ...బహుశా కరోనా వైరస్‌ నుంచి షికారిపాలెం ప్రజలను కాపాడుతున్న కారణాలు కావచ్చు. విశేషం ఏమిటంటే..కరోనా సోకకపోయినా షికారిపాలెం ప్రజలు గడప దాటితే తప్పనిసరిగా మాస్క్‌ పెట్టుకుంటూ ఉండడం.


ఊరు దాటద్దనుకున్నాం

పల్లెలో దేనికైనా అందరం ఒక్క మాట మీదనే వుంటాం. కరోనా పొయ్యే వరకూ ఎవరూ ఊరు దాటద్దని అనుకున్నాం. కట్టుబడే ఉన్నాం. మరీ మూడు నెలలుగా బయటకి పోవడం లేదు. ఎవరి చేతుల్లోనూ డబ్బు లేదు. అందరికీ ఇబ్బందిగానే వుంది. అయినా ఓర్చుకుని చుట్టుపక్కల దొరికిన పనులు చేసుకుంటున్నాం.

-రమణ, షికారిపాలెం


కష్టమే కాపాడుతోంది

మేము ఊరు దాటేది లేదు. వ్యాపారం మీద బయటకి పొయిన మా వాళ్ళను కూడా రావద్దనేసినాం. కరోనా తగ్గినాకనే రమ్మని చెప్పినాం. కష్టం చేసుకునేవాళ్లం కరోనా మాకు రాదు. 

-మల్లిక, షికారిపాలెం





Updated Date - 2021-06-16T07:19:18+05:30 IST