Advertisement

కరోనా కార్చిచ్చు!

Mar 29 2020 @ 03:58AM

పంటలన్నీ కోతలకు వచ్చాయి. వైరస్‌ సోకుతుందన్న భయంతో కూలీలు కోతలకు రావడం లేదు. పంటలు కోయడానికి మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వలస కూలీలు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక జిల్లా వారు ఇంకో జిల్లాకు వలస వెళుతుంటారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా కూలీలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. దీంతో పండిన పంటలను ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. పండ్ల తోటల రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రైతుల సమస్యలను పరిష్కరించడానికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రంగంలోకి దిగని పక్షంలో మున్ముందు ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. కరోనా మహమ్మారి మరో నెల రోజుల్లో అదుపులోకి రాకపోతే ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు కూడా వేయలేని పరిస్థితి ఎదురవుతుంది. అదే జరిగితే తిండి గింజలకు కూడా అలమటించాల్సి వస్తుంది.


మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడిని చంపడంతో ఆగ్రహోదగ్రుడైన ఆయన కుమారుడు అశ్వత్థామ నారాయణ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు వెంటనే ఆయుధాలను వదిలి.. చేతులు ముడుచుకుని ఉండిపోవలసిందిగా పాండవ సైన్యానికి సూచించారు. చేతిలో ఆయుధం ఉన్నా, మనసులో యుద్ధం చేయాలన్న ఆలోచన కలిగినా నారాయణ అస్త్రం నుంచి తప్పించుకోజాలరని శ్రీకృష్ణుడు చేసిన హెచ్చరికతో పాండవ పక్షం ప్రాణాలు కాపాడుకుంది. చివరకు శక్తి నశించిన నారాయణ అస్త్రం నేల కూలింది. కరోనా వైరస్‌ విషయంలో కూడా లాక్‌డౌన్‌ అవసరాన్ని గుర్తించి ఇళ్లకే పరిమితం అవడం మినహా మానవాళి ముందు మరో ప్రత్యామ్నాయం లేదు. ‘బతికి ఉంటే బలుసాకు తిని అయినా గడిపేయవచ్చు’ అని పెద్దలు అనేవారు. సరదాలు, వినోదాలు అన్నీ ఇప్పటికి మరిచిపోండి. కరోనా మహమ్మారి మనల్ని వదిలిపోయాక ఏమి చేయాలో అప్పుడు ఆలోచిద్దాం!


కరోనా ఎంత పనిచేస్తున్నావు..? ఎక్కడో చైనాలో పుట్టి యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు మానవ జాతి మనుగడకే ప్రమాదంగా మారింది. మన దేశం విషయానికి వస్తే కర్ఫ్యూ గురించి తెలుసు గానీ లాక్‌డౌన్‌ గురించి ఇప్పుడే వింటున్నాం. స్వేచ్ఛా జీవితానికి అలవాటుపడిన భారతీయులకు లాక్‌డౌన్‌ దుర్భరంగానే ఉంటుంది. కానీ ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు కనుక మెజారిటీ ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారు. గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయిందని విర్రవీగిన మానవ జాతిపై కరోనా రూపంలో ప్రకృతి పగ తీర్చుకుంటోంది. ఇంతకీ ఇది మానవ తప్పిదమా? ప్రకృతి శాపమా? అంటే.. ఏమి చెబుతాం. చైనాలో వర్షం పడితే మన దేశంలో కమ్యూనిస్టులు గొడుగు పట్టుకుంటారు అని ఒకప్పుడు కాంగ్రెస్‌ నాయకులు ఎగతాళి చేసేవారు. ఇప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గినా ప్రపంచానిది కూడా అదే దారి! చైనాలో జలుబు చేస్తే యావత్‌ ప్రపంచం తుమ్ముతోంది. చైనావాడు ఏదో తింటే.. అన్ని దేశాలవారు చేతులు కడుక్కోవాల్సి వస్తోంది. గతంలో కూడా ఎన్నో వైరస్‌లు మానవాళిపై దాడి చేశాయి. అప్పటి పరిస్థితి వేరు! ఇప్పటి పరిస్థితి వేరు! కరోనా పుణ్యమా అని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవ్వడమే కాకుండా మనుషుల తలరాతలే మారిపోతున్నాయి.


అగ్రరాజ్యంగా ప్రపంచ దేశాలపై పెత్తనం చేస్తూ.. ఎవరు ఎలా బతకాలో నిర్దేశిస్తూ వచ్చిన అమెరికా ఇప్పుడు కరోనా దెబ్బకు అల్లాడిపోతోంది. ఆ దేశం వద్ద ఉన్న సంపద గానీ, ఆయుధ సంపత్తి గానీ.. అమెరికన్లను కరోనా నుంచి రక్షించలేకపోతున్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ఇంగ్లండ్‌లో ఇప్పుడు ప్రధానమంత్రితోపాటు ఆ దేశ యువరాజు సైతం కరోనా బారినపడ్డారు. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాల మధ్య చెరిగిపోయిన సరిహద్దుల్లో ఇప్పుడు సరిహద్దు గోడలు నిర్మించుకోవలసిన దుస్థితి! నిన్నటి తరం, నేటి తరం చూడని, రేపటి తరం చూస్తుందో లేదో తెలియని దూరం మన మధ్య ప్రవేశించింది. మన దేశంలో ఒక రాష్ట్రం వాళ్లు మరో రాష్ట్రంలోకి ప్రవేశించలేని పరిస్థితి వస్తుందని ఊహించామా? తెలంగాణ వాళ్లు ఆంధ్రాకు, ఆంధ్రావాళ్లు తెలంగాణకు రాలేని దుస్థితి దాపురించింది. చివరకు గ్రామాల మధ్య కంచెలు ఏర్పడ్డాయి. నగరాల్లో కాలనీల వాళ్లు తమకు తాము ప్రపంచానికి దూరం అవుతున్నారు. ప్రకృతిని విచ్చలవిడిగా విధ్వంసం చేసుకుంటూ పోవడం వల్లనే కరోనా వైరస్‌ వంటివి పుట్టుకువస్తాయని ఇప్పటికైనా మానవ జాతి గుర్తించడం మంచిది. సృష్టిలో ఇన్ని ప్రాణులు ఉన్నప్పటికీ మానవులను మాత్రమే కరోనా వైరస్‌ వెంటాడుతోంది. ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో వాయుకాలుష్యం, నీటి కాలుష్యం తగ్గాయని నివేదికలు వస్తున్నాయి. వన్య ప్రాణులు, ఇతర పశుపక్ష్యాదులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. తిరుమలలో జింకలు వంటివి భయం లేకుండా రోడ్లపై సంచరించడం ఊహించామా? సమస్త ప్రకృతిని తమ స్వార్థం కోసం వాడుకున్న మానవులు ‘ప్రకృతి కోసం ఏమి చేస్తున్నాం’ అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని కరోనా వైరస్‌ మనకు గుర్తుచేయడం లేదా? సృష్టిలోని ప్రతి ప్రాణి ప్రకృతి కోసం ఎంతో కొంత, ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుండగా.. మనుషులు మాత్రం ప్రకృతిని చెరబట్టారు. చైనావాళ్లు గబ్బిలాలను కూడా వదలకుండా తినడం వల్లనే కరోనా వైరస్‌ మనుషులకు సోకిందని సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


సృష్టిలోని మనుషులను తప్ప ప్రతి ప్రాణిని జీర్ణించుకోగల గొప్పవాళ్లు చైనీయులు. అదే నిజమైతే చైనీయుల ఆహారపు అలవాట్లకు యావత్‌ ప్రపంచం బలవుతోంది. అభివృద్ధి చెందిన దేశాలు, సంపన్న దేశాలు అని తేడా లేకుండా అన్ని దేశాలు కూడా కరోనా ముందు తలవంచుకోక, తలదించుకోక తప్పని పరిస్థితి. వివిధ దేశాల్లో వైద్య రంగం ఎంత బేలగా ఉందో ఇప్పుడు బయటపడుతోంది. వైరస్‌ సోకిన వారికి చికిత్స కోసం తగినన్ని బెడ్లు లేకపోవడంతోపాటు వైద్య సిబ్బంది కొరతతో ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. వైరస్‌ సోకిన వారిని చికిత్స కోసం తరలిస్తున్న ప్రత్యేక వార్డుల్లో సౌకర్యాలు దారుణంగా ఉంటున్నాయి. ఈ కారణంగా క్వారంటైన్‌లోకి వెళ్లడానికి ప్రజలు భయపడిపోతున్నారు. చైనా మినహా మిగతా దేశాలన్నీ కరోనా వైరస్‌ను ఆషామాషీగా తీసుకోవడంతో ఇప్పుడు యావత్‌ మాన


వాళిని కబళించడానికి ఆ వైరస్‌ అర్రులు చాస్తోంది. ఈ లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని ఫిబ్రవరి చివరి వారం నుంచే అమలుచేసి విదేశాల నుంచి వచ్చే వారిని నేరుగా క్వారంటైన్‌కు తరలించి ఉంటే ఇప్పుడు ఈ మహమ్మారి ఇంతలా వ్యాపించి ఉండేది కాదు. మన దేశం కూడా ప్రారంభంలో నిర్లక్ష్యం వహించింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి ప్రారంభంలో కరోనాను సీరియస్‌గా తీసుకోలేదు. ‘‘కరోనాది ఏముంది.. పారాసిటమాల్‌ వేసుకుంటే తగ్గిపోతుంది..’’ అని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం వారం గడిచేసరికి పరిస్థితి తీవ్రతను అంచనా వేసి విరుగుడు చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనకు ముందే భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని గుర్తించారు. కరోనా వైరస్‌కు మందే లేదని ప్రకటించడంతోపాటు లాక్‌డౌన్‌ను ప్రజలంతా విధిగా పాటించేలా చర్యలు తీసుకున్నారు. తన సహజ స్వభావానికి భిన్నంగా 15 రోజుల వ్యవధిలో మూడు నాలుగుసార్లు విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి ప్రజలకు జాగ్రత్తలు సూచించడంతోపాటు ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. అయితే విదేశాల నుంచి వచ్చే వారిని ట్రాక్‌ చేయడంలో జాప్యం జరిగిపోవడం, విమానాశ్రయాల్లో ఏర్పాటుచేసిన థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్ష ఒక ఫార్స్‌గా మారడంతో కరోనా మహమ్మారి తెలంగాణలోకి ప్రవేశించింది. వైరస్‌ను నివారించే ప్రక్రియలో భాగంగా లాక్‌డౌన్‌ వంటి చర్యలు ఎంత ముఖ్యమో.. వైరస్‌ సోకిన వారిని, సోకే అవకాశం ఉన్నవారిని గుర్తించి ఐసోలేషన్‌ వార్డులకు తరలించడం అంతే ముఖ్యం అన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికను ప్రభుత్వ యంత్రాంగం పటిష్ఠంగా అమలుచేయలేకపోవడం వల్ల తెలంగాణలో ఈ వైరస్‌ కోరలు చాస్తోంది.


ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విషయానికి వస్తే.. ఆయన కరోనా వైరస్‌ అనేది ఒక మహమ్మారి అని గుర్తించడానికి కూడా ప్రారంభంలో అంగీకరించలేదు. ఇప్పటికీ ఆయన ఈ వైరస్‌ ప్రమాదాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. కరోనా వైరస్‌ విజృంభించే ప్రమాదం ఉందన్న కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించగానే ఆయనకు కులాన్ని ఆపాదించి తిట్టిపోశారు. ‘‘కరోనా వైరస్సా.. కాకరకాయా..’’ అన్న రీతిలో అవాకులు– చవాకులు పేలారు. జగన్మోహన్‌రెడ్డి తన సొంత మీడియాలో రమేశ్‌కుమార్‌పై దుమ్మెత్తి పోయించారు. ‘‘కరోనా వైరస్‌తో ఇప్పటివరకు ప్రపంచంలో నలుగురే చనిపోయారనీ, రహదారి ప్రమాదాల్లో, క్యాన్సర్‌ వంటి వ్యాధుల వల్ల యేటా లక్షల మంది చనిపోతున్నారనీ, దాంతో పోలిస్తే కరోనా ఎంత? ఇదంతా కుట్ర..’’ అని పిచ్చి వాగుడు వాగించారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడం కంటే స్థానిక ఎన్నికలు జరిపించడమే ముఖ్యం అన్నట్టు మూర్ఖంగా ప్రవర్తించారు. చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగంలోకి దిగి జన సమూహాలను కట్టడి చేయడానికై థియేటర్లు, బార్లు, షాపింగ్‌ మాల్స్‌, విద్యాసంస్థలు వంటివి మూసివేయించడంతో తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కూడా జగన్మోహన్‌రెడ్డి అదే పనిచేశారు. అన్యమనస్కంగానైనా కేసీఆర్‌ అడుగుజాడల్లో కొన్ని చర్యలు తీసుకున్నారు. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే కరోనా వైరస్‌ చచ్చిపోతుందన్న జ్ఞానగుళికను జనంలోకి వదిలిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. ఆరోగ్య శాఖకు మాత్రం తగినన్ని నిధులు మంజూరు చేయలేదు. పలు జిల్లాల్లో అధికారులకు పంపిణీ కోసం మాస్క్‌లను కూడా సరఫరా చేయలేదు. కొన్నిచోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు కూడా మాస్క్‌లు అందుబాటులో లేవు. మందుల కొరత తీవ్రంగా ఉంది. ఈ ముప్పును గుర్తించడానికి ఇష్టపడని వారి నుంచి ఇంతకంటే మెరుగైన చర్యలను ఆశించలేం.


ఏపీ ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ మధ్య వ్యంగ్యాస్త్రాలు సంధించినట్టు తెలిసింది. ‘‘అతడు ఎవరి మాటా వినడు. సమస్యను అర్థం చేసుకోడు. ఉత్తర కొరియా అధినేత కిమ్‌ మాదిరిగా వ్యవహరిస్తున్నాడు..’’ అన్న వ్యాఖ్యలు కేసీఆర్‌ తన సన్నిహితుల వద్ద చేశారని చెబుతున్నారు. తెలంగాణకు చెందిన మంత్రులు కూడా జగన్మోహన్‌రెడ్డి వైఖరిని ఆక్షేపిస్తున్నారు. ఏది ఏమైనా పాలకులను, అధికార యంత్రాంగాన్ని విమర్శించడానికి ఇది సరైన సమయం కాదు. అందరూ కలిసి ఏకోన్ముఖంగా ఈ వైరస్‌ మహమ్మారిని ఎదుర్కోవాల్సిన తరుణం ఇది. గతంలో మనకు అనుభవం లేని లాక్‌డౌన్‌ వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ముందుకు పోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నారు. ఏప్రిల్‌ 14 తర్వాత కూడా లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉన్నందున నిత్యావసర వస్తువులకు కొరత రాకుండా చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. నిత్యావసర సరుకులను డోర్‌ డెలివరీ చేయాలి. దీనివల్ల రోడ్లపై జన సంచారాన్ని అరికట్టవచ్చు. పంటలన్నీ కోతలకు వచ్చాయి. వైరస్‌ సోకుతుందన్న భయంతో కూలీలు కోతలకు ముందుకు రావడం లేదు. పంటలు కోయడానికి మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వలస కూలీలు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక జిల్లా వారు ఇంకో జిల్లాకు వలస వెళుతుంటారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా కూలీలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. దీంతో పండిన పంటలను ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. పండ్ల తోటల రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉభయ రాష్ట్రాలకు చెందిన పండ్ల తోటల రైతులు తమ పంటను హైదరాబాద్‌, బెంగళూరులకు తరలిస్తుంటారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా హోల్‌సేల్‌ వ్యాపార మార్కెట్లు మూతబడ్డాయి. దీంతో కమీషన్‌ ఏజెంట్లు తోటల వద్ద పండ్లు కొనడానికి ముందుకు రావడం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా పండ్ల వినియోగం కూడా తగ్గిపోయింది. వెరసి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో సరుకు రవాణా వాహనాలు ఎక్కడికక్కడ రహదారులపై నిలిచిపోయాయి.


పేద ప్రజలు ఆకలితో అలమటించకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ లాక్‌డౌన్‌ వల్ల ఉత్పన్నమవుతున్న ఇతర సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికై రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవలసిన అవసరముంది. రైతుల సమస్యలను పరిష్కరించడానికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రంగంలోకి దిగని పక్షంలో మున్ముందు ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. కరోనా మహమ్మారి మరో నెల రోజుల్లో అదుపులోకి రాకపోతే ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు కూడా వేయలేని పరిస్థితి ఎదురవుతుంది. అదే జరిగితే తిండి గింజలకు కూడా అలమటించాల్సి వస్తుంది.


ఆర్థికం.. అతలాకుతలం!

కరోనా నిరోధానికై విధించుకున్న లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తాత్కాలికమే గానీ, ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. కరోనా మహమ్మారి కంటే రానున్న ఆర్థిక ఉత్పాతం మానవాళిపై మరింత తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచీకరణ పుణ్యమా అని ఇతర దేశాలపై ఆధారపడకుండా ఏ దేశం కూడా మనుగడ సాగించలేని పరిస్థితి ఏర్పడింది. కలరా, ప్లేగు వంటి మహమ్మారులు విజృంభించినప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు ఎవరి బతుకు వారిది. ఇప్పుడు ఎగుమతులు, దిగుమతులు ఆగిపోతే ఉత్పన్నమయ్యే పరిస్థితి భయంకరంగా ఉంటుంది. కేవలం మూడు వారాల లాక్‌డౌన్‌కే వివిధ రంగాలు, కంపెనీల ఆర్థిక పరిస్థితి తలకిందులు అవుతోంది. ‘ఫలానా కంపెనీ నెట్‌వర్త్‌ ఇంత! ఫలానా పారిశ్రామికవేత్త సంపద విలువ అంత!’ అంటూ లెక్కలు కట్టాం. స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలడంతో ఈ లెక్కలన్నీ వెలవెలబోతున్నాయి. కరోనా ప్రభావం పడని రంగం అంటూ ఏదీ మిగలలేదంటే అతిశయోక్తి కాదు. ఆసుపత్రులలో సైతం రోగుల సంఖ్య 70 శాతం వరకూ పడిపోయిందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. మొదటగా కుదేలైనవి విమానయాన, పర్యాటక రంగాలు కాగా, రెండవ స్థానంలో మీడియా ఉంది. లాక్‌డౌన్‌ పర్యవసానం వల్ల వివిధ రంగాలలో కోట్ల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. ప్రభుత్వాలు ఎన్ని ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించినా ప్రత్యామ్నాయాలు కాజాలవు. ఉత్పత్తి, కొనుగోలు నిలిచిపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం కూడా గణనీయంగా పడిపోతోంది. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన రాకపోకలను నిషేధించడంతో విమానయాన రంగంలో లక్షల మంది ఉపాధి కోల్పోతారు. పర్యాటకుల రాక నిలిచిపోవడంతో హోటళ్లు మూతపడబోతున్నాయి.


లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపార ప్రకటనలు నిలిచిపోయి మీడియా.. ముఖ్యంగా పత్రికల మనుగడే ప్రశ్నార్థకం అవుతోంది. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో పేజీల సంఖ్యను కుదించుకోవడం మినహా పత్రికలకు మరో ప్రత్యామ్నాయం లేదు. మరో రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో పలు పత్రికలు మూతపడినా ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. అదే జరిగితే లక్షల మంది ఉపాధి కోల్పోతారు. ఈ రంగం, ఆ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలు కుదేలవ్వడం వల్ల దాని ప్రభావం ఐటీ రంగంపై కూడా పడుతుంది. అదే జరిగితే దేశంలో నిరుద్యోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న జీఎస్‌టీ రాబడి పడిపోతున్నది. వివిధ సంస్థలు ప్రకటించిన అంచనాల ప్రకారం దాదాపు ఐదు కోట్ల మంది ఉపాధి కోల్పోతారు. నిర్మాణ రంగంపై కరోనా ప్రభావం ఇప్పటికే పడింది. హైదరాబాద్‌ వంటి మహా నగరాల్లోనే అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తిగా మందగించాయి. దీంతో లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడే ప్రమాదం పొంచి ఉంది. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా పరిస్థితి భయంకరంగా మారబోతోంది. ఈ ఆర్థిక విపత్తుని ఎదుర్కోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పెను సవాలే! ఒక్క మాటలో చెప్పాలంటే కరోనా వైరస్‌ను తరిమికొట్టిన తర్వాత అసలైన కష్టాలు మొదలవుతాయి. ప్రజల జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. ఇవ్వాళ అవసరంగా భావిస్తున్నవన్నీ భవిష్యత్తులో లగ్జరీగా మారతాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను వీలైనంత త్వరగా తరిమికొట్టడమే మానవాళి ముందు ప్రస్తుతం ఉన్న ఏకైక కర్తవ్యం. ప్రజలలో ప్రాణభీతి తొలగిపోనంత వరకు పరిస్థితులు కుదుటపడవు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలు ఎక్కాలంటే ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి! దీన్ని ప్రకృతి చేపట్టిన దిద్దుబాటు చర్య అనుకోవాలా? లేకపోతే ప్రపంచమే ఒక జైలుగా మారిపోవడం ఏమిటి? ప్రపంచంలో ఏ దేశం వద్దా లేనన్ని ఆయుధాలు అమెరికా వద్ద ఉన్నాయి.


కరోనా వైరస్‌ను ఏ ఆయుధం కూడా నిరోధించలేకపోయింది కదా? ఆర్థిక శక్తిగా, ఆయుధ శక్తిగా ప్రకటించుకుంటూ విర్రవీగిన దేశాలకు ప్రకృతి నేర్పిన పాఠం ఇది. అభివృద్ధి పేరిట ప్రపంచీకరణ మోజులో పడిపోయిన మిగతా దేశాలు కూడా శిక్షను అనుభవిస్తున్నాయి. ‘ప్రకృతిని నువ్వు ప్రేమిస్తే.. అది నిన్ను ప్రేమిస్తుంది’ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న, ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ కనుగొనే ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుందాం. అందాకా లాక్‌డౌన్‌లో ఉండిపోదాం. మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడిని చంపడంతో ఆగ్రహోదగ్రుడైన ఆయన కుమారుడు అశ్వత్థామ నారాయణ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు వెంటనే ఆయుధాలను వదిలి.. చేతులు ముడుచుకుని ఉండిపోవలసిందిగా పాండవ సైన్యానికి సూచించారు. చేతిలో ఆయుధం ఉన్నా, మనసులో యుద్ధం చేయాలన్న ఆలోచన కలిగినా నారాయణ అస్త్రం నుంచి తప్పించుకోజాలరని శ్రీకృష్ణుడు చేసిన హెచ్చరికతో పాండవ పక్షం ప్రాణాలు కాపాడుకుంది. చివరకు శక్తి నశించిన నారాయణ అస్త్రం నేల కూలింది. కరోనా వైరస్‌ విషయంలో కూడా లాక్‌డౌన్‌ అవసరాన్ని గుర్తించి ఇళ్లకే పరిమితం అవడం మినహా మానవాళి ముందు మరో ప్రత్యామ్నాయం లేదు. ‘బతికి ఉంటే బలుసాకు తిని అయినా గడిపేయవచ్చు’ అని పెద్దలు అనేవారు. సరదాలు, వినోదాలు అన్నీ ఇప్పటికి మరిచిపోండి. కరోనా మహమ్మారి మనల్ని వదిలిపోయాక ఏమి చేయాలో అప్పుడు ఆలోచిద్దాం!

ఆర్కే

 

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.