కుటుంబాల్లో కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2021-04-22T10:19:27+05:30 IST

కరోనా మహమ్మారి కుటుంబాల్లో కల్లోలం రేపుతోంది. కుటుంబ బంధాలను తెంచేస్తూ పిల్లలను అనాథలను చేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన దంపతులు భవాని, చిట్టిబాబు కరోనాకు బలవడంతో వీరి పిల్లలు అనాథలయ్యారు. కృష్ణా జిల్లా నున్న పవర్‌గ్రిడ్‌ సమీపంలో వీరు నివాసం ఉండేవారు.

కుటుంబాల్లో కరోనా కల్లోలం

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌)

కరోనా మహమ్మారి కుటుంబాల్లో కల్లోలం రేపుతోంది. కుటుంబ బంధాలను తెంచేస్తూ పిల్లలను అనాథలను చేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన దంపతులు భవాని, చిట్టిబాబు కరోనాకు బలవడంతో వీరి పిల్లలు అనాథలయ్యారు. కృష్ణా జిల్లా నున్న పవర్‌గ్రిడ్‌ సమీపంలో వీరు నివాసం ఉండేవారు. ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడులో భవాని టీచర్‌గా పనిచేసేవారు. చిట్టిబాబు విజయవాడలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేసేవారు. చిట్టిబాబుకు 10 రోజుల క్రితం జ్వరం సోకడం తో కొవిడ్‌ పరీక్ష చేయించగా నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. టైఫాయిడ్‌గా నిర్ధారించుకుని మందులు వాడారు. పిల్లలను బంధువుల ఇంటికి పంపి వీరిద్దరే ఇంట్లో ఉన్నారు. ఈ నెల 14న చిట్టిబాబు ఆయాసంతో బాధపడుతుండగా చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. ఆస్పత్రివద్ద అంబులెన్స్‌ నుంచి చిట్టిబాబును దించుతుండగానే తుదిశ్వాస విడిచారు. అదే అంబులెన్స్‌లో ఉన్న భార్య కోమాలోకి వెళ్లారు. బుధవారం భవాని కన్నుమూశారు. వీరికి ఒక కుమారుడు తరుణ్‌ , కుమార్తె నందిని ఉన్నారు.


మంటగలిసినమానవత్వం

అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలికి చికిత్స అందించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె మృతి చెందింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరూ రాకపోవడంతో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు దహన సంస్కారాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా కొల్లూరులో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. కొల్లూరులో రెవెన్యూ కార్యాలయం ఎదుట నివసించే విశ్రాంత ఉపాధ్యాయురాలు నాగేంద్రమ్మ అనారోగ్యం బారినపడ్డారు. మంగళవారం ఆమె పరిస్థితి మరింత క్షీణించడంతో బంధువులు.. రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయం తమ శాఖ పరిధిలోనిది కాదంటూ వారు పట్టించుకోలేదు. పీహెచ్‌సీ వైద్యుడు డి.రవిబాబు సిబ్బందిని పంపించగా ఆమె తలుపులు తీయలేదంటూ వెనుదిరిగి వెళ్లారు. కుటుంబ సభ్యులు, బంధువులు సైతం తమకేమి పట్టనట్లు వ్యవహరించడంతో ఆమె మృతి చెందారు. దహన సంస్కారాలు చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో తెనాలికి చెందిన శ్రీశివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులు అంత్యక్రియలు చేశారు. 

Updated Date - 2021-04-22T10:19:27+05:30 IST