ముందుంది మూడో ముప్పు.. ఎదుర్కొనేందుకు సిద్ధం!

ABN , First Publish Date - 2021-07-14T15:45:22+05:30 IST

‘‘నిబంధనలను ఖచ్చితంగా..

ముందుంది మూడో ముప్పు.. ఎదుర్కొనేందుకు సిద్ధం!

పాత జీజీహెచ్‌లో పిల్లల కోసం 100 పడకలు

మచిలీపట్నంలోనూ ప్రత్యేక పడకలు

పిల్లలకు చికిత్సపై డాక్టర్లు, నర్సులకు శిక్షణ

కఠిన నిబంధనల అమలుకే అవగాహనలు 

విస్తృతంగా కొవిడ్‌ పరీక్షలు.. వేగంగా వ్యాక్సినేషన్‌ 

విలేకరులతో కలెక్టర్‌ నివాస్‌


విజయవాడ(ఆంధ్రజ్యోతి):

‘‘నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తాం.. అతిక్రమిస్తే జరిమానాలు తప్పవు.. రద్దీ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు.. వ్యాక్సినేషన్‌ ముమ్మరం.. విరివిగా కొవిడ్‌ టెస్ట్‌లు.. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రజల్లో అవగాహనతో పాటు బాధ్యతగా ఉండేందుకు వారంలో మూడు రోజుల పాటు విస్తృత అవగాహనలు, స్పెషల్‌ డ్రైవ్స్‌ పకడ్బందీగా నిర్వహిస్తాం... కొవిడ్‌ నిబంధనలను పాటించటం వల్లే వైరస్‌ వ్యాప్తిని అరికట్టగలం’’

- కలెక్టర్‌ నివాస్‌


‘కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్‌ జే నివాస్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రస్తుత కొవిడ్‌ స్థితి, రాబోయే థర్డ్‌వేవ్‌ అంశాలు తక్షణ కార్యాచరణపై అనేక విషయాలను వెల్లడించారు. ఈసారి పిల్లలపై ప్రభావం ఉంటుందని వస్తున్న వార్తలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేపట్టామని అన్నారు. 


అవగాహన కార్యక్రమాలు

కొవిడ్‌ పట్ల ప్రజలను మరింత చైతన్యం చేసేందుకు వారంలో 3 రోజుల పాటు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం. ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల వద్ద మాస్క్‌ లేనిదే - ప్రవేశం లేదు, మంగళవారం నో మాస్క్‌ - నో రైడ్‌, బుధవారం రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, మాల్స్‌ వద్ద నో మాస్క్‌ - నో సేల్‌ నినాదాలతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం. ఇదే సందర్భంలో డ్రైవ్స్‌ కూడా జరుగుతాయి.


చిన్నపిల్లల వైద్యానికి ప్రత్యేక ఏర్పాట్లు

థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. పాత జీజీహెచ్‌లో 100 పడకలు, మచిలీపట్నంలో ప్రత్యేక పడకలతో ఏర్పాట్లు చేశాం. అన్ని వైద్య సదుపాయాలతో పాటు, చిన్నపిల్లల మాస్కులు సిద్ధం చేశాం. డాక్టర్లు, నర్సులకు చిన్నపిల్లల వైద్యానికి సంబంధించి శిక్షణ ఇచ్చాం. 


విస్తృతంగా కొవిడ్‌ టెస్ట్‌లు

జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 18,79,652 మందికి టెస్ట్‌లు చేయగా 1,04,163 మందికి పాజిటివ్‌ వచ్చింది. 2,753 యాక్టివ్‌ కేసులున్నాయి. రోజూ 8వేలకు తగ్గ కుండా కొవిడ్‌ టెస్ట్‌లు చేస్తున్నాం. తెలంగాణా సరిహద్దు మండలాల్లో కేసుల సంఖ్య ఎక్కువుగా ఉన్నాయి. ఈ మండలాల్లో తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలను అధికారులకు నిర్దేశించాం. ఇంటింటా సర్వే చేసి టెస్ట్‌లు చేయించి అవసరమైనవారికి వైద్యసేవలు అందిస్తున్నాం. 


వేగవంతంగా వ్యాక్సినేషన్‌ 

జిల్లాలో 16,40,705 మందికి కొవిడ్‌ టీకాలు వేశాం. వీరిలో 13,03,217 మంది కోవిషీల్ట్‌, మిగిలిన 3,37,488 మంది కోవాక్సిన్‌ వేశాం. ఉపాధ్యాయులకు వ్యాక్సిన్‌ వేసేందుకు నిర్ణయించాం. ఐదేళ్లలోపు పిల్లలున్న 1,74,089 మంది తల్లులకు కొవిడ్‌ టీకాలు వేయించాం. ప్రత్యేకంగా 36,918 మంది గర్భిణులను గుర్తించి వారికీ టీకాలు అందించాం. 


నిబంధనలు కఠినతరం..

జిల్లాలో కొవిడ్‌ నిబంధనలను అమలు చేయటం వల్లనే వైరస్‌ వ్యాప్తిని అరికట్టగలిగాం. రానున్న రోజుల్లో ఒక యజ్ఞంగా నిబంధనలు కఠినంగా అమలు చేస్తాం. ప్రస్తుతం కొవిడ్‌ తీవ్రత తగ్గినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రద్దీ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తాం. మాస్క్‌ తప్పనిసరి చేశాం. లేకుంటే జరిమానాలు విధించమని పోలీసు శాఖకు ఆదేశాలిచ్చాం. 

Updated Date - 2021-07-14T15:45:22+05:30 IST