అందరి భయం ఆక్సిజనే!!

ABN , First Publish Date - 2021-05-08T04:23:45+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపఽథ్యంలో అందరిలోనూ ఆందోళన కల్గిస్తున్న అంశం ఆక్సిజన్‌. జ్వరం, ఒళ్లునొప్పులు, దగ్గు, జలుబు వంటి లక్షణాలను తగ్గించుకోవడానికి మందులు లభ్యమవుతున్నాయి.

అందరి భయం ఆక్సిజనే!!

అప్రమత్తత అవసరం


ముత్తుకూరు, మే7: కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపఽథ్యంలో అందరిలోనూ ఆందోళన కల్గిస్తున్న అంశం ఆక్సిజన్‌. జ్వరం, ఒళ్లునొప్పులు, దగ్గు, జలుబు వంటి లక్షణాలను తగ్గించుకోవడానికి మందులు లభ్యమవుతున్నాయి. అయితే కరోనా తీవ్రత ఎక్కువైతే ఊపిరితిత్తులపై ప్రభావం చూపి, శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోతాయి. ఈ దశలోనే కరోనా బాధితుల్లో ఆక్సిజన్‌ భయం ఎక్కువవుతోంది. సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. కరోనా సోకిన ఐదు రోజుల్లోపు చికిత్స పొందగలిగితే కోలుకోవడం తేలికని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే, మందుల దుకాణంలో టాబ్లెట్లు తెచ్చుకుని వాడుకోవడం, తగ్గకపోతే కరోనా పరీక్షలు చేయించుకుందాములే అనే ఉదాసీనతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిందన్న భరోసాతో ఉండడం కూడా ప్రమాదానికి దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. టెస్టులో నెగిటివ్‌ వచ్చినా లక్షణాలు ఉంటే తక్షణం వైద్యసాయం పొందడం శ్రేయస్కరమని వైద్యులు చెబుతున్నారు. 


ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గితే అపస్మారక స్థితి..

కొన్ని పరిస్థితుల్లో ఆక్సిజన్‌ లెవల్స్‌ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో, అపస్మారక స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా శరీరంలో ఆక్సిజన్‌ 98శాతం పైగా ఉంటుంది. పల్స్‌ ఆక్సీమీటర్‌లో ఈ లెవల్‌ 94 వరకు ఉండవచ్చు. ఒకవేళ 94 నుంచి 92కు చేరుకున్నా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, ఆయాసం వంటి లక్షణాలు లేకపోతే ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆక్సిజన్‌ లెవల్స్‌ 92శాతం కంటే తక్కువైతే వైద్యుల పర్యవేక్షణలో ఆక్సిజన్‌ పొందాల్సి ఉంటుంది. ఇంట్లో ఉంటూ ఆక్సిజన్‌ పెట్టుకునేందుకు ఆక్సిజన్‌ సిలిండర్లు దొరకడం లేదు. గృహ వినియోగానికి ఆక్సిజన్‌ ఉపకరణాలను అందించే వారు లేకపోవడంతో, కచ్చితంగా ఆసుపత్రిలో చేరాల్సి వస్తోంది. కరోనా లక్షణాలు కన్పించిన వెంటనే అందుబాటులో ఉన్న వైద్యుల సహకారంతో చికిత్స పొందుతూ, హోం ఐసోలేషన్‌లో ఉండడం మంచిది. ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ లెవల్స్‌ పరిశీలించుకుంటూ, ఇబ్బందికర పరిస్థితుల్లో వైద్యశాలలో చేరి, చికిత్స పొందడం మేలు.   

Updated Date - 2021-05-08T04:23:45+05:30 IST