కరోనా వేళ.. అక్రమార్కుల లీల

ABN , First Publish Date - 2021-05-11T04:46:32+05:30 IST

కరోనా విజృంభణతో జనం అల్లాడిపోతుంటే రెవెన్యూ యంత్రాంగం కొవిడ్‌ విధుల్లో బిజీగా ఉంది. ఈ తరుణంలో అక్రమార్కులు ప్రభుత్వ భూముల్లో దర్జాగా నిర్మాణాలు చేపడుతున్నారు.

కరోనా వేళ.. అక్రమార్కుల లీల
అసకపల్లి సర్వే నంబరు 2 ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలు

అసకపల్లిలోని ప్రభుత్వ భూమిలో దర్జాగా అక్రమ నిర్మాణాలు

రెవెన్యూ అధికారులు కొవిడ్‌ విధుల్లో ఉండడంతో బరితెగింపు

రూ.కోట్ల విలువైన భూమికి ఎసరు


సబ్బవరం, మే 10 : కరోనా విజృంభణతో జనం అల్లాడిపోతుంటే రెవెన్యూ యంత్రాంగం కొవిడ్‌ విధుల్లో బిజీగా ఉంది. ఈ తరుణంలో అక్రమార్కులు ప్రభుత్వ భూముల్లో దర్జాగా నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు కొవిడ్‌ విధుల్లో ఉండడంతో పాటు సెలవు రోజులైన శని, ఆదివారాల్లో చకచకా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.  

మండలంలోని అసకపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబరు 2లో 45.60 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమి ఉంది. ఆ భూమిలో గతంలో కొంత మందికి డీ పట్టా ఇచ్చారు. సర్వే నంబరు 2/6లో 2.52 ఎకరాలు, 2/7లో 3.02 ఎకరాలు, 2/8లో 4.99 ఎకరాలు.. మొత్తం 10.53 ఎకరాలు డి.పట్టా రద్దు చేసి అప్పట్లో దామోదరం సంజీవయ్య జాతీయ విశ్వవిద్యాలయం నిర్మాణానికి కేటాయించారు. లా వర్సిటీకి  ఆనుకుని సర్వే నంబర్లు 2/9లో 5.02 ఎకరాలు, 2/10లో 2.37 ఎకరాలు, 2/11లో 4.05 ఎకరాలు, 2/12లో 1.59 ఎకరాలు, 2/13లో 0.46(గెడ్డవాగు) ఎకరాలు, 2/14లో 1.10 ఎకరాలు, 1/15లో 1 ఎకరం ప్రభుత్వ భూమి.. మొత్తం సుమారు 15 ఎకరాలు ఉంది. అయితే ఈ భూమిపై గొటివాడ, అసకపల్లి, సబ్బవరానికి చెందిన కొంత మంది కన్ను పడింది. 

ప్రభుత్వ భూమిని ఆనుకుని సర్వే నంబరు 3, 4, 5లో జిరాయితీ భూమి ఉంది. జిరాయితీని ఆనుకుని ఈ ప్రభుత్వ భూమి ఉండడంతో అక్రమార్కులకు బాగా కలిసి వచ్చింది. జిరాయితీతో పాటు ప్రభుత్వ భూమిని కలిపేసి ప్లాట్లు వేసేశారు. వీటిని విక్రయించి సొమ్ము చేసుకోవాలని గత కొన్నేళ్లుగా విశ్వప్రయత్నం చేస్తున్నారు. మండల కేంద్రం సబ్బవరానికి, లా వర్సిటీకి ఆనుకుని ఉండడంతో ఈ భూమికి మంచి డిమాండ్‌ ఉంది. జిరాయితీ భూమి గజం ధర రూ.14 వేలు నుంచి 16 వేలు పలుకుతోంది. ప్రభుత్వ భూమి కావడంతో గజం రూ.6 నుంచి 8 వేలు.. అంటే సెంటు రూ.3 లక్షల నుంచి 4 లక్షల వరకు విక్రయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన ఎకరం ధర ఎలా చూసినా  రూ.40 కోట్లు నుంచి రూ.50 కోట్లు ఉంటుంది. అక్కడ ప్లాట్లు కొన్నవారు ప్రస్తుతం గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. లా వర్సిటీని ఆనుకుని ఉన్న సర్వే నంబరు 6/1లో ఉన్న 5.11 ప్రభుత్వ భూమి గెడ్డవాగుపైన కూడా కొంత మంది కన్నేసినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. 

గతంలో ఆక్రమణల కూల్చివేత 

అసకపల్లి సర్వే నంబరు 2లో అక్రమాలు గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయి. ప్లాట్లు కొనుకున్నవారు నిర్మాణాలు ప్రారంభిస్తే అప్పటి అధికారులు అడ్డుకుని కూల్చివేశారు. నిర్మాణం చేపట్టిన వారు స్టే కూడా తెచ్చారు. అప్పటి నుంచి తహసీల్దార్‌, ఆర్‌ఐలు, వీఆర్‌ఏ, వీఆర్వోలను అప్రమత్తం చేసి నిఘా పెట్టారు. దీంతో వెనక్కి తగ్గిన ఆక్రమణదారులు ఇటీవల రెవెన్యూ అధికారులు కరోనా విధుల్లో బిజీగా ఉండడం, కొంత మంది కరోనా బారిన పడడంతో మళ్లీ విజృంభించారు. గత శని, ఆదివారాల్లో  కొంత మంది గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణాలు చేపట్టారు. కరోనా సమయంలో కూడా తమకు నిద్రాహారాలు ఉండడం లేదని, ఇక్కడ విధులు నిర్వహించడం కష్టంగా ఉందని, ఆక్రమణలను  అడ్డుకోవడం తమ తరం కావడం లేదని రెవెన్యూ అధికారులు వాపోతున్నట్టు తెలిసింది. గతంలో ఆక్రమణలను అడ్డుకోవడానికి వెళితే రెవెన్యూ అధికారులపై అక్రమార్కులు ఎదురుతిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

గ్రామస్థుల ఫిర్యాదు 

అసకపల్లి సర్వే నంబరు 2 ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకుని ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప సర్పంచ్‌ కరణం సురేశ్‌బాబు ఆధ్వర్యంలో గ్రామస్థులు కర్రి హరికృష్ణ, అప్పారావు, పంచదార్ల రమణ, మాజీ ఉప సర్పంచ్‌ మొల్లి చిన్నారావు, నక్కా గుణశేఖర్‌ సోమవారం ఆర్‌ఐ రమణకు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌, జేసీ, ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయనున్నామని వారు పేర్కొన్నారు. 

కఠిన చర్యలు తీసుకుంటాం

గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదును తహసీల్దార్‌ రమాదేవికి నివేదించి మంగళవారం దర్యాప్తు చేపడతాం. ఎవరు ఆక్రమణలకు పాల్పడిందీ దర్యాప్తు చేసి నిర్మాణాలను తొలగించి, ఆ వ్యక్తులపై డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్టు 188 ప్రకారం చర్యలు తీసుకుంటాం.

- ఐ.రమణ, మండల రెవెన్యూ అధికారి, సబ్బవరం


Updated Date - 2021-05-11T04:46:32+05:30 IST