టచ్‌ చేసి పోతోంది...

ABN , First Publish Date - 2022-01-20T05:40:10+05:30 IST

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రెండోవిడతలో కన్నా ఈ మూడో విడతలో వేగంగా విస్తరిస్తోంది. కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఒక్క హనుమకొండ జిల్లాలో 13 రోజుల్లో 1,237 కేసులు నమోదయ్యాయి. అయితే మరణాలేవీ సంభవించలేదు.

టచ్‌ చేసి పోతోంది...

అందరినీ చుట్టేస్తున్న కరోనా వైరస్‌
ప్రతీ పది మందిలో ఒకరికి పాజిటివ్‌
ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు సైతం..
భయపడాల్సిన పనిలేదంటున్న డాక్టర్లు
ఐసోలేషన్‌ కిట్లలోని మందులు వాడితే చాలు
ఆస్పత్రుల్లో చేరికలు అతి తక్కువ..
ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరి


హనుమకొండ అర్బన్‌, జనవరి 19:
కరోనా  మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రెండోవిడతలో కన్నా ఈ మూడో విడతలో వేగంగా విస్తరిస్తోంది. కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఒక్క హనుమకొండ జిల్లాలో 13 రోజుల్లో 1,237 కేసులు నమోదయ్యాయి. అయితే మరణాలేవీ సంభవించలేదు.   భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నా దాని తీవ్రత గతంతో పోల్చితే చాలా తక్కువగా ఉందంటున్నారు. ఇది వరకు కరోనా బారిన పడినవారిలో ఎక్కువమంది ఆస్పత్రుల్లో చేరాల్సివచ్చేది. వెంటలేటర్‌ వరకు వెళ్లాల్సి వచ్చేది. మరణాలు కూడా ఎక్కువగా సంభవించేవి. ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు. కరోనా బారిన పడిన వారిలో  ఎక్కువ మంది సాధారణ స్థాయిలో స్వల్ప జ్వరం, జలుబు, గొంతు నొప్పి తదితర స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారు. మూడునాలుగు రోజుల తర్వాత కోలుకుంటున్నారు. కరోనాకు గతంలో వాడిన మందులనే వాడితే ఉపశమనం లభిస్తోంది. డాక్టర్లు పీహెచ్‌సీలో పంపిణీ చేస్తున్న ఐసోలేషన్‌ కిట్లలోని మందులను వాడితే సరిపోతుందంటున్నారు.

సామూహికంగా..
వ్యాప్తి తీవ్రత దృష్ట్యా జాగ్రత్తగా ఉండడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. కుటుంబంలో ఒకరి పాజిటివ్‌ వస్తే ఆ వెంటనే మిగతా కుటుంబ సభ్యులందరికీ వేగంగా అం టుకుంటోంది. దీనితో ప్రస్తుతం కుటుంబాలకు కుటుంబా లు సామూహికంగా వైరస్‌ బారిన పడుతున్నారు. పల్లె ల్లో కన్నా పట్టణంలోనే ప్రతీ పది మందిలో ఒకరికి పాజిటివ్‌ వస్తోంది. గతంలో ఒకసారి కరోనా బారిన పడినవారికి ఈ వైరస్‌ సోకుతోంది. రెండు, మూడు సార్లు కరోనా తో బాధపడ్డవారు సైతం ఈ మహమ్మారి అంటుకుంటోం ది. ఇప్పటివరకు అసలే టీకా తీసుకోనివారు వేగంగా ఈ వ్యాధి బారినపడుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. అటువంటి వారు వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలోనే ఎక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయంటున్నారు.

ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా..

ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోవడంతో ప్రతీ ఒక్కరు భయపడుతున్నారు.  విందులు, వినోదాలకు హాజరుకావాలంటే జంకుతున్నారు. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లాంటేనే జంకుతున్నారు. డాక్టర్లు, వైద్య విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, పోలీసులు.. ఒక్కరేమిటి జనసమూహం మధ్య పనిచేసే ప్రతీవారు కరోనా నుంచి తప్పించుకోలేక పోతున్నారు. సభలు, సమావేశాలకు హాజరైన వారిలో అనేక మందికి అమర్నాడే కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో పరీక్షలు చేయించుకునేందుకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. జ్వరం, దగ్గు జలుబుతో ఒకటీ రెండు రోజులు బాధపడుతున్నవారు వెంటనే రాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేయించుకుంటున్నారు. ఈ  పరిస్థితి ఈ నెలాఖరు వరకు లేదా వచ్చే నెల రెండోవారం వరకు ఉండవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు.  

కరోనా బారిన ప్రజాప్రతినిధులు
ప్రజాప్రతినిధులు సైతం వరుసగా కరోనాబారిన పడుతున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ పలుకార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను వైరస్‌ వెంటాడుతోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్‌నాయక్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, మేయర్‌ గుండు సుధారాణి కరోనా బారిన పడ్డారు. కేఎంసీలో వైద్యవిద్యార్థులు, వరంగల్‌ నిట్‌లోని విద్యార్థులకు సైతం కరోనా అంటుకున్నది.

ఎంజీఎం ఆస్పత్రిలో పని చేసే డాక్టర్లను సైతం కరోనా విడిచిపెట్టలేదు. పోలీ్‌సస్టేషన్లలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు.

అప్రమత్తం
కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండడంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సినేషన్‌ వేగాన్ని పెంచింది. రెండోడోసు వ్యాక్సిన్‌ తీసుకోని వారిని గుర్తించి వారికి టీకాలు వేస్తున్నారు. జిల్లాలో లక్ష్యాన్ని మించి 106 శాతం వ్యాక్సినేషన్‌ చేశారు. 8,40,560 మందికి టీకాలు వేయాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 9,18,930 మందికి మొదటి విడత టీకాలు వేశారు. 7,19,784 మందికి రెండోవిడత టీకాలు వేయడం పూర్తయింది. 60 యేళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న (కోమార్డిటీస్‌) వారికి బూస్టర్‌ డోస్‌లు వేయడం కొనసాగుతోంది. అలాగే 15 నుంచి 18 యేళ్ల మధ్య వయసువారికి కూడా టీకాలు ఇస్తున్నారు. 26 వ్యాక్సినేషన్‌ సెంటర్లు, 160 పీహెచ్‌సీలు, అర్బన్‌ పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది.

ఈ నెల కేసులు
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈనెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,006 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. హనుమకొండ జిల్లాలో 1,235, వరంగల్‌ జిల్లాలో 770, మహబూబాబాద్‌ జిల్లాలో 817, జనగామ జిల్లాలో 700, ములుగు జిల్లాలో 279, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 205 కేసులు నమోదయ్యాయి.

భయపడాల్సిన పనిలేదు..
డాక్టర్‌ కె.లలితాదేవి, డీఎంహెచ్‌వో, హనుమకొండ

ప్రస్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం అంతగా లేదు. వైరస్‌ తీవ్రత మునుపటంతటి తీవ్రత లేదు. కరోనా సోకినవారిలో ఇప్పటి వరకు పది మాత్ర మే ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో అయిదుగు ఎంజీఎంలో, మిగతా అయిదుగురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. జ్వరం, దగ్గు, జలుబుతో ఒకటి, రెండు రోజులకు మించి బాధపడుతున్నవారు పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్‌ అని తేలితే హోం ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం పాజిటివ్‌ వచ్చినవారిలో 95 శాతం సురక్షితంగానే ఉన్నారు. రోగులు పీహెచ్‌సీలో అందచేస్తున్న ఐసోలేషన్‌ కిట్లలోని మందులను వాడితే సరిపోతుంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అన్ని పీహెచ్‌సీలు, అర్బన్‌ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచాం.

పాజిటివ్‌ కేసులను గుర్తించేందుకు ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వే చేయిస్తున్నాం. ప్రతీ మండల కేంద్రంలో ఒక క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం. కమలాపూర్‌, వేలేరు, హసన్‌పర్తి మండల కేంద్రాల్లో క్వారంటైన్‌ సెంటర్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వంగరలో ఇప్పటికే పని చేస్తోంది. అన్ని పీహెచ్‌సీలో రోజుకు 5,500 రాపిడ్‌ టెస్టులు, 350 ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నాం.  అన్ని పీహెచ్‌సీలో ఒకటి చొప్పున, అర్బన్‌ పీహెచ్‌సీలో 2కాన్‌సంట్రేటర్లను అందుబాటులో ఉంచాం. మెడికల్‌  క్యాంపులను కూడా నిర్వహిస్తున్నాం. ఎవరైనా కరోనాతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరితే సాధారణ చికిత్సకైతే రూ.4500, ఐసీయూలో చేరితే రూ.7000, ఐసీయూ వెంటిలేషన్‌కైతే రూ.9500కు మించి చెల్లించాల్సిన అవసరం లేదు. అంతకన్నా ఎక్కవ ఫీజు తీసుకునే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం.
- హనుమకొండ అర్బన్‌

నత్తనడకన కరోనా నిర్ధారణ పరీక్షలు
వరంగల్‌ కలెక్టరేట్‌, జనవరి 19: కరోనా పరీక్షల నిర్వహణ నత్తనడకన సాగుతోంది. రోజుకు కనీసం మూడు వేలకు పైగా కొవిడ్‌ టెస్టులు నిర్వహించాల్సి ఉండగా అందులో సగం కూడా చేయడం లేదని తెలుస్తోంది. దీంతో కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా బయట సంచరిస్తున్నారు. ఫలితంగా వైరస్‌ అతివేగంగా వ్యాప్తి చెందుతోంది. వైద్యఆరోగ్యశాఖ సిబ్బందిలో ఎక్కువ మందిని కొవిడ్‌ వాక్సినేషన్‌కు కేటాయించడంతో టెస్టుల నిర్వహణకు సిబ్బంది సరిపోవడం లేదు.  ఒక్కసారిగా చలి పెరగడంతో పాటు అకాల వర్షాలు కురవడంతో చాలామంది జలుబు, జ్వరాల బారిన పడుతున్నారు. మరోవైపు సంక్రాంతి పర్వదినం సందర్భంగా జాతరలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో కొవిడ్‌ ఎక్కువగా వ్యాపించినట్లు భావిస్తున్నారు. కాగా జనవరి 10 నుంచి 19 వరకు వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 33,952 టెస్టులు నిర్వహించగా 770 మందికి పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో వెంకటరమణ వెల్లడించారు.

ఆందోళనలో పోలీసు సిబ్బంది
కరోనా బారిన పడుతున్న వారిలో వీరే ఎక్కువ


నర్సంపేట టౌన్‌, జనవరి 19 : గత పది రోజుల నుంచి పోలీస్‌ స్టేషన్లలో పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజల మధ్య విధులు నిర్వర్తించడం, ప్రజాప్రతినిధులు చేపట్టే కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుండటంతో పోలీసు అధికారులు, సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఈ వైరస్‌ బారినపడుతున్నారు. ఒక్కో పోలీ్‌సస్టేషన్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. నర్సంపేట పోలీ్‌సస్టేషన్‌లో ఇప్పటి వరకు 11 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, ఐదుగురు కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డులు ఉన్నారు. దుగ్గొండి  పోలీ్‌సస్టేషన్‌లో ఎస్సైకి, ముగ్గురు హోంగార్డులకు, చెన్నారావుపేటలో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు, అలాగే నెక్కొండ పోలీ్‌సస్టేషన్‌లో ఒక కానిస్టేబుల్‌, ఒక హోంగార్డు కరోనా బారినపడ్డారు.

వరంగల్‌లోని మట్టెవాడ పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు, పర్వతగిరి పోలీ్‌సస్టేషన్‌లో ఒకరు కరోనాతో బాధపడుతున్నారు. పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సైలకు పాజిటివ్‌ వస్తుండడంతో ఆయా స్టేషన్‌లోని సిబ్బంది వణికిపోతున్నారు. ఎస్సైతో పాటు సిబ్బందికి పాజిటివ్‌ నిర్ధారణ అవుతుండడంతో ఠాణాలు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇప్పటివరకు దుగ్గొండి ఎస్సైకి, నర్సంపేటలో పనిచేస్తున్న ఓ ఎస్సైకి కొవిడ్‌ నిర్ధారణ అయింది.

ఇటీవల జరిగిన ఐనవోలు, కొమురవెల్లి జాతరల్లో బందోబస్తుకు వెళ్లిన పోలీసు సిబ్బంది పెద్దసంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు ప్రతీరోజు కొవిడ్‌ టెస్టులు చేయిస్తున్నారు.   నర్సంపేట సబ్‌ డివిజన్‌ పరిధిలో 30 మంది వరకు జాతర బందోబస్తు వెళ్లగా వీరిలో లక్షణాలు ఉన్నవారు మాత్రమే టెస్టులు చేసుకోగా వారికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని, మరికొందరు భయంతో టెస్టులకు ముందుకు రావడం లేదని తెలిసింది.


మరో ముగ్గురు ప్రముఖులకు కొవిడ్‌
భూపాలపల్లి/, మహబూబాబాద్‌ టౌన్‌, జనవరి 19: మరో ముగ్గురు ప్రముఖులు బుధవారం కొవిడ్‌ బారిన పడ్డారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతిలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రేగొండ మండలం చెన్నాపూర్‌లో పంట నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మంగళవారం పర్యటించగా వారి వెంట గండ్ర దంపతులు ఉన్నారు. తిరుగు ప్రయాణంలో మంత్రులతో హెలీకాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్లారు. అయితే దగ్గు, జలుబు, జ్వరం ఉండటంతో బుధవారం ఉదయం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇద్దరికీ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో హైదరాబాద్‌లోని తమ నివాసంలో హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
కాగా, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు కూడా కరోనా పాజిటివ్‌ ని ర్ధారణ అయింది. మంగళవారం ఆయన కూడా మంత్రుల పర్యటనలో పాల్గొన్నా రు.  కరోనా లక్షణాలున్నట్లు అనుమానం రావడంతో వెంటనే పరీక్షలు నిర్వహించ గా కొవిడ్‌ నిర్ధారణ అయింది. ఆరోగ్యం నిలకడగా ఉందని, తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. శంకర్‌నాయక్‌కు గతంలో కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయనకు రెండో సారి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 
 

Updated Date - 2022-01-20T05:40:10+05:30 IST