చాపకిందనీరులా కరోనా

ABN , First Publish Date - 2021-05-11T04:56:53+05:30 IST

జిల్లాలో చాపకిందనీరులా కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. అధికారిక బాధితుల సంఖ్య కంటే అనధికారిక బాధితులే ఎక్కువ. దీనికి కారణం ప్రజల్లో ఉన్న అభద్రతాభావమే. కరోనా వచ్చిందంటే అదో అవమానంగా భావిస్తున్నారు. రెండో కంటికి తెలియకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

చాపకిందనీరులా కరోనా
స్టేట్‌బ్యాంకు వద్ద బారులుదీరిన ఖాతాదారులు

అనధికార కేసులే ఎక్కువ 

కానరాని భౌతిక దూరం

గజపతినగరం, మే10: జిల్లాలో చాపకిందనీరులా కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. అధికారిక బాధితుల సంఖ్య కంటే అనధికారిక బాధితులే ఎక్కువ. దీనికి కారణం ప్రజల్లో ఉన్న అభద్రతాభావమే. కరోనా వచ్చిందంటే అదో అవమానంగా భావిస్తున్నారు. రెండో కంటికి తెలియకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కరోనా ఉన్నట్లు కనీసం చుట్టు పక్కల వారికి కూడా తెలియడం లేదు. ఎవరికైనా ఆరోగ్యంపై అనుమానం వస్తే గుట్టుచప్పుడు కాకుండా మెడికల్‌ షాపులకు వెళ్లి మందుల కిట్లు తెచ్చుకొని వాడుతున్నారు. ఈలోగా విషయం తెలిసి ఎవరైనా ప్రశ్నిస్తే  జ్వరం అని చెబుతున్నారే తప్పా కరోనా లక్షణాలు ఉన్నట్లు అంగీకరించడం లేదు. కరోనా సోకిందని తెలిస్తే.. చుట్టు పక్కలవారు, బంధువులు, ఆఖరికి రక్త సంబంధీకులు కూడా దగ్గరకు రారనే భావనతోపాటు చులకనగా చూస్తారనే అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. తీరా ఇంట్లో జబ్బు ముదిరిన తరువాత ఆసుపత్రికి పరుగులు తీసి టెస్టులు, సిటీస్కాన్‌లు చేయిస్తున్నారు. వీటిలో పాజిటివ్‌ అని రిపోర్టు రాగానే క్వారంటైన్‌ సెంటర్లకు వెళ్తున్నారు. అక్కడ నాలుగైదు రోజుల తరువాత వైరస్‌ ముదిరితే ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. అక్కడికి వెళ్లాక బెడ్‌లు ఉంటాయో? లేవో తెలియదు. ఆక్సిజన్‌ అందుబాటులో ఉంటుందో...లేదో... భరోసా ఉండదు. ఒకే గదిలో ఎక్కువ మంది బాధితులు ఉండడంతో సిబ్బంది అందరినీ ఒకేలా చూడలేని పరిస్థితి ఉంటోంది. స్వల్ప లక్షణాలు కనబడగానే  పరీక్షలు చేయించుకోవాలనే ఆలోచన ప్రజల్లో రేకెత్తించాలి. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ మొక్కుబడిగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫీవర్‌ టెస్టులు, ఇంటింటి సర్వేలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. నిత్యం ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి ఇంటినీ మెడికల్‌ సిబ్బంది సందర్శించి పూర్తి స్థాయి నివేదికను తయారుచేయాలని భావిస్తున్నారు. ప్రజలు కూడా అనుమానాల్ని వీడి కరోనా లక్షణాలు ఉన్నాయని పసిగట్టినప్పుడే చుట్టు పక్కలవారికి.. బంధువులకు తెలియజేస్తే వారు తగిన సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏ లక్షణం కనిపించినా ముందుగా పరీక్షలు చేయించుకోవడం  మంచిదని  వైద్యులు సూచిస్తున్నారు.

కానరాని భౌతిక దూరం 

మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రజల్లో  మార్పు కానరావడం లేదు. ఎక్కడ పడితే అక్కడే జనాలు గుమిగూడి ఉంటున్నారు. బ్యాంకులు, కూరగాయల మార్కెట్లు , ప్రభుత్వ కార్యాలయాలు, వైన్‌షాపులు ఇలా అన్నిచోట్లా ప్రజలు భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా తిరగడంతో కరోనా వైరస్‌ మరింతగా విస్తరిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు స్వయంగా జాగ్రత్తలు పాటించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తేనే కరోనాకు అడ్డుకట్ట వేయగలమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 



Updated Date - 2021-05-11T04:56:53+05:30 IST