Advertisement

కరోనా వ్యాక్సినేషన్‌ను పకడ్బందీగా నిర్వహించాలి

Mar 5 2021 @ 23:29PM
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డి టౌన్‌, మార్చి 5: జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో కరోనా వ్యాక్సినేషన్‌, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో చెత్తసేకరణ, నర్సరీల ఏర్పాటు, ట్రీ పార్కులు, వైకుంఠధామాలు, టాయిలెట్స్‌ నిర్మాణాలు, పదో తరగతి పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధత, సంక్షేమ హాస్టళ్ల పనితీరు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్‌ పకడ్బందీగా  నిర్వహించాలని, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌, హెల్త్‌ వర్కర్స్‌ ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని, వారి కుటుంబసభ్యుల పేర్లు నమోదు చేయాలని తెలిపారు. నిర్ణయించిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహణలో యాక్షన్‌ప్లాన్‌ ప్రకారం ముందుకు సాగాలని, ప్రతీరోజు వ్యాక్సినేషన్‌ వివరాలను సాయంత్రం 5లోగా సమర్పించాలని ఆదేశించారు. పట్టణ, గ్రామాల్లో చెత్తసేకరణ వాహనాలలో తడిచెత్త, పొడిచెత్త సేకరణ, కరోనాపై జాగ్రత్తలు, రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ రూల్స్‌, చేతుల శుభ్రతపై జాగ్రత్తలు తెలియజేసే ఆడియో సిస్టమ్‌ ద్వారా ప్రచారం తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 25లోగా వందశాతం పన్ను వసూళ్లు చేయాలని మున్సిపల్‌, పంచాయతీ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలలో సిబ్బంది అవసరమున్న చోట నియమించుకోవాలని కమిషనర్‌లకు సూచించారు. పట్టణ వార్డులలో ట్రీపార్కుల ఏర్పాటుకు స్థల సేకరణ వెంటనే పూర్తి చేయాలని, ప్రజలకు అవసరమున్న చోట స్థలాల గుర్తింపు చేపట్టాలని, ఈ నెల 31లోగా నర్సరీల ఏర్పాట్లకు అన్ని చర్యలు తీసుకోవాలని, టీఎస్‌ బీపాస్‌ అనుమతులను పెండింగ్‌ లేకుండా వెంటనే క్లియర్‌ చేయాలని, పట్టణాల్లో పురోగతిలో ఉన్న వైకుంఠధామాలు, పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌ ఈ నెల చివరిలోగా పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని కమిషనర్‌లను ఆదేశించారు. రాబోయే 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరిగేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని డీఈవోను ఆదేశించారు. అలాగే సంక్షేమ వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలు రాకూడదని, మెనూ పాటించాలని, కరోనా కారణంగా భౌతికదూరం, మాస్క్‌ధారణపై శ్రద్ధ కనబరచాలని సంక్షేమశాఖ అఽఽధికారులను ఆదేశించారు. ధరణి రిజిస్ట్రేషన్‌ పెండింగ్‌ లేకుండా చూడాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని, తహసీల్దార్లు కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ దరఖాస్తులు పెండింగ్‌ లేకుండా చూడాలని, అవసరమైన బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపాలని ఆర్‌డీవోలకు సూచించారు. సంక్షేమ వసతి గృహాలకు సంబంధించిన స్ర్కాప్‌ను జిల్లా కమిటీ డిస్పోజ్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంక్షేమ శాఖల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌, ఆర్‌డీఓలు శ్రీను, రాజాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన జాతీయ మానవహక్కుల సంఘం నేతలు
కామారెడ్డి : జాతీయ మానవహక్కుల సంఘం జిల్లా నేతలు దాస్‌ ఎల్లం, రత్నయ్య, ఫిరంగి రాజేశ్వర్‌, గౌస్‌బాబాలు శుక్రవారం కలెక్టర్‌ శరత్‌తో పాటు జిల్లా అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సామాజిక సేవలో ముందుండాలని సూచించారు.

Follow Us on:
Advertisement