కరోనా వ్యాక్సీన్ తయారీ.. ఆటంబాంబుతో పోల్చిన ప్రొఫెసర్!

ABN , First Publish Date - 2020-11-13T14:25:22+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి వ్యాక్సీన్ తయారుచేయడానికి చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. బడా బడా ఫార్మా కంపెనీలు ఈ ప్రయోగాల్లో తలమునకలవుతున్నాయి.

కరోనా వ్యాక్సీన్ తయారీ.. ఆటంబాంబుతో పోల్చిన ప్రొఫెసర్!

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి వ్యాక్సీన్ తయారుచేయడానికి చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. బడా బడా ఫార్మా కంపెనీలు ఈ ప్రయోగాల్లో తలమునకలవుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఫార్మా కంపెనీ తయారుచేసిన వ్యాక్సీన్ 90శాతం సత్ఫలితాలిచ్చింది. ఈ వార్త ప్రపంచం మొత్తాన్ని ఊపేసింది. వ్యాక్సీన్ ప్రయోగ దశలో ఉండగానే భారీ మొత్తాల్లో కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్న దేశాలు ఈ వార్తపై హర్షం వ్యక్తంచేశాయి.


జర్మనీకి చెందిన బయాన్‌టెక్, అమెరికాకు చెందిన ఫైజర్ ఫార్మా కంపెనీలు సంయుక్తంగా కరోనా వ్యాక్సీన్ తయారుచేశాయి, ప్రయోగ సమయంలో ఈ వ్యాక్సీన్ 90శాతం సత్ఫలితాలిచ్చినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ వార్త ప్రపంచం మొత్తం దావానంలా వ్యాపించింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కరోనాకు మందు లభించినట్లేనని అందరూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిశోధన చేసిన శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  కరోనా వ్యాక్సీన్ వార్తతో యూరోపియన్ స్టాక్ మార్కెట్లు, ఆయిల్ ధరలు నూతనోత్తేజాన్ని పొందాయి.



ప్రయోగాల్లో భాగంగా కరోనా పేషెంట్లకు రెండు సార్లు వ్యాక్సీన్ ఇచ్చారు. తొలి ఇంజెక్షన్ చేసిన 21 రోజుల తర్వాత రెండోసారి వ్యాక్సీన్ ఇచ్చారు. ఈ రెండో డోస్ ఇచ్చిన వారం రోజుల్లోనే పేషెంట్ ఆరోగ్యపరిస్థితి చాలా మెరుగైనట్లు వైద్యులు గుర్తించారు. ‘‘కరోనా వ్యాక్సీన్ ఫేజ్-3 ప్రయోగాల్లో మంచి ఫలితాలు కనిపించాయి. కరోనాను మా వ్యాక్సీన్ నిలువరించగలదని దాదాపు తేలిపోయింది’’ అని ఫైజర్ కంపెనీ సీఈవో, చైర్మన్ ఆల్బర్ట్ బోర్లా వెల్లడించారు. ఈ వార్తలు విన్న బ్రిటన్ బ్యాక్టీరియాలజీ ప్రొఫెసర్ హఫ్ పెన్నింగ్టన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



వ్యాక్సీన్ ప్రయోగం సక్సెస్ అవ్వడం చరిత్రలో చాలా కీలక ఘట్టమని, ఈ వార్త వినగానే తనకు మానవాళి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన మరో ప్రయోగం గుర్తొచ్చిందని పెన్నింగ్టన్ చెప్పారు. ఇంతకీ ఆయనకు గుర్తొచ్చిన ప్రయోగం ఏదో తెలుసా? ది మ్యాన్‌హాటన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో భాగంగానే మానవ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఆటంబాంబులను తయారుచేశారు.  జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై ఈ బాంబు వేసినప్పుడు కనీసం 2లక్షలమంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. ఇంతటి ఘోరకలికి కారణమైన ఆటంబాంబుతో కరోనా వ్యాక్సీన్ ప్రయోగాన్ని పోల్చడమేంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. వీరికి పెన్నింగ్టన్ చక్కగా వివరణ ఇచ్చారు.



‘మ్యాన్‌హాటన్ ప్రాజెక్టు జరగకుండా ఉండుంటే ఆటంబాంబులు తయారవయ్యేవి కాదు. అవి గనుక తయారుచేయకపోయుంటే రెండో ప్రపంచ యుద్ధం ముగిసేది కాదు’ అని ఈ బ్యాక్టీరియాలజీ ప్రొఫెసర్ చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం గనుక ముగింపునకు రాకుంటే.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభాగ్యులు రోడ్డుపాలయ్యేవారని, ఎంతోమంది కష్టాలు పడాల్సి వచ్చేదని వివరించారు. ప్రపంచం మొత్తం దుఃఖంలో మునిగిపోయే ప్రమాదాన్ని ఆటంబాంబులు నిలువరించాయని తెలిపారు. ‘కరోనా వ్యాక్సీన్ కూడా ప్రంపంచాన్ని దుఃఖం నుంచి కాపాడుతుంది కదా. ఈ లెక్కన రెండు ప్రయోగాల మధ్య పోలిక లేదూ?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓ సైంటిఫిక్ జర్నల్‌లో పెన్నింగ్టన్ ఈ కామెంట్స్ చేసినట్లు సమాచారం.



ఉగుర్ సాహిన్, ఓజ్లెమ్ టారెకి దంపతులు ఈ కరోనా వ్యాక్సీన్ ప్రయోగాల్లో కీలకభూమిక పోషించారు. ప్రయోగం ఫలితాలు వెలువడినప్పటి నుంచి వీరిని చాలామంది శాస్త్రవేత్తలు అభినందల్లో ముంచెత్తారు. ప్రపంచ దేశాలన్నీ ఇంకా ఈ కొత్త వ్యాక్సీన్ ఉపయోగాన్ని అధికారికంగా ఆమోదించలేదు. యూఎస్, యూకే, యూరప్ దేశాల్లో ఆమోదం కోసం ఫైజర్, బయాన్‌టెక్ సంస్థలు ఎదురుచూస్తున్నాయి.  అయితే ఈ కంపెనీలు చేసిన ప్రకటన ప్రభావం తక్కువేమీ కాదని, ఆయా దేశాల ఆమోదం ఇంకా లభించకపోవడం ప్రయోగం ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గించబోదని నిపుణులు అంటున్నారు. ఈ వ్యాక్సీన్ ప్రయోగం ప్రాధాన్యత సంతరించుకోవడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, ఈ వ్యాక్సీన్ కరోనాపై బాగా పనిచేస్తున్నట్లు కనబడుతోంది. ఇక రెండో కారణం చాలా ముఖ్యమైనది. అదేంటంటే ఇప్పటి వరకూ ఈ వ్యాక్సీన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు ఫిర్యాదులు రాలేదు. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి ఫలితాలు రావడం నిజంగా గొప్ప విషయమని విశ్లేషకుల అభిప్రాయం.


Updated Date - 2020-11-13T14:25:22+05:30 IST