ఇదెక్కడి చోద్యం! చనిపోయిన వ్యక్తికి ప్రికాషనరీ డోసు వేసిన అధికారులు

ABN , First Publish Date - 2022-07-08T22:09:57+05:30 IST

కరోనా సమయంలో వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం చేసిన ప్రచారం అంతాఇంతా కాదు. ప్రతి ఒక్కరు నిర్ణీత సమయంలో

ఇదెక్కడి చోద్యం! చనిపోయిన వ్యక్తికి ప్రికాషనరీ డోసు వేసిన అధికారులు

హైదరాబాద్: కరోనా సమయంలో వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం చేసిన ప్రచారం అంతాఇంతా కాదు. ప్రతి ఒక్కరు నిర్ణీత సమయంలో రెండు డోసులు తీసుకోవాలని, కొవిడ్‌కు దూరంగా ఉండాలని ఎడతెగని ప్రచారం చేసింది. తొలుత విముఖత వ్యక్తం చేసిన జనం ఆ తర్వాత వ్యాక్సినేషన్ కోసం క్యూకట్టారు. రెండు డోసులు వేయించుకున్నారు. అతి తక్కువ సమయంలో కోట్లాది డోసులు వేసిన దేశంగా మనదేశం రికార్డులకెక్కింది. 


కోట్లాదిమంది జనాభా కలిగిన భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ విషయంలో అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరగడంలో తప్పులేదు. జరిగాయి కూడా. వ్యాక్సిన్ వేసుకోని వారికి వేసుకున్నట్టు వారి మొబైల్స్‌కు మెసేజ్‌లు రావడంతో అలా వచ్చినవారు ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా అక్కడక్కడ వెలుగుచూశాయి. అయితే, ఇప్పుడు రెండు డోసుల కథ ముగిసింది. ప్రికాషనరీ డోసు కోసం ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు డోసులు వేయించుకున్న వారికి ప్రికాషనరీ డోసు కూడా వేయించుకోవాలని మెసేజ్‌లు వస్తున్నాయి. అంతవరకు బాగానే ఉంది. 


హైదరాబాద్‌కు చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్‌ తన మొబైల్‌కు తాజాగా వచ్చిన మెసేజ్ చూసి ఆశ్చర్యపోయారు. తన తండ్రికి విజయవంతంగా ప్రికాషరీ డోసు వేసినట్టు ఆ మెసేజ్‌లో ఉంది. అది చూసిన అవాక్కైన ఆయన అసలు విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన తండ్రి గతేడాది జులై 21న చనిపోయారని, ఈ మేరకు డెత్ సర్టిఫికెట్ కూడా జారీ అయిందని పేర్కొన్నారు. కానీ, అదే ఏడాది డిసెంబరు 3న ఆయనకు కరోనా వ్యాక్సిన్ రెండో వేసినట్టు మెసేజ్ వచ్చిందని తెలిపారు.


అయితే, దానిని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా, ఈ రోజు (జులై 8న) తన తండ్రికి ప్రికాషనరీ డోసు వేసినట్టు మెసేజ్ రావడంతో ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను పోస్టు చేశారు. అందులోని టీకా స్టేటస్‌లో 81 ఏళ్ల ఆయన తండ్రికి మూడు డోసులు విజయవంతంగా పూర్తయినట్టుగా ఉండడం గమనార్హం.



Updated Date - 2022-07-08T22:09:57+05:30 IST