ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కరోనా టీకా సక్సెస్‌

ABN , First Publish Date - 2021-01-17T06:00:36+05:30 IST

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు కరోనా టీకా వేసే కార్యక్రమం సజావుగా సాగింది.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కరోనా టీకా సక్సెస్‌

సజావుగా కార్యక్రమం 

తొలిరోజు 368 మంది ఆరోగ్య సిబ్బందికి టీకాలు

కరీంనగర్‌లో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి గంగుల 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు కరోనా టీకా వేసే కార్యక్రమం సజావుగా సాగింది. కరీంనగర్‌లో టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రజాప్రతినిధులు,  అధికారులు టీకా పంపిణీలో పాల్గొన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో, బీఆర్‌ఆర్‌కాలనీ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో తొలి టీకాను ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల తీసుకున్నారు. బీఆర్‌ఆర్‌కాలనీ హెల్త్‌ సెంటర్‌లో డాక్టర్‌ సత్యజిత్‌ తొలి టీకాను తీసుకున్నారు. హుజురాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో టీకా శిబిరాన్ని జడ్పీ చైర్‌పర్సన్‌ కనమల్ల విజయ ప్రారంభించగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రమేశ్‌, తిమ్మాపూర్‌ పీహెచ్‌సీలో టీకా శిబిరాన్ని శాసనసభ్యులు రసమయి బాలకిషన్‌ ప్రారంభించగా హాస్పిటల్‌ కాంటిజెంట్‌ వర్కర్‌ పోతుగంటి లింగయ్య తొలి టీకాను తీసుకున్నారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఒక్కో కేంద్రంలో 30 మంది చొప్పున 120 మందికి టీకాలు ఇచ్చారు. ఎవరికి కూడా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌గాని, రియాక్షన్స్‌గాని ఎదురుకాలేదు. జిల్లా కలెక్టర్‌ శశాంక, పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి, జిల్లా వైద్యాధికారి సుజాత, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీకాలు పొందిన వారికి ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురుకాకపోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమయింది. 

మోడీ చిత్రపటం లేనందుకు బీజేపీ ధర్నా

కరోనా టీకా కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఫొటో మాత్రమే ముద్రించి ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను విస్మరించడం పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. కరీంనగర్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించి టీకా కేంద్రంలో ప్రధాని చిత్రపటాన్ని కూడా ఉంచాలని డిమాండ్‌ చేస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రత్నమాలకు వినతిపత్రం సమర్పించారు. ఈ ఆందోళనకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్‌, దుబాల శ్రీనివాస్‌, మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, దళిత మోర్చా అధ్యక్షులు సోమిడి వేణు, మీడియా కన్వీనర్‌ కటకం లోకేశ్‌, కార్పొరేటర్లు కచ్చు రవి, పెద్దపల్లి జితేందర్‌, మెండి చంద్రశేఖర్‌, జోనల్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, నరహరి లక్ష్మారెడ్డి, కార్యదర్శి మంజులావాణి, పలువురు నాయకులు పాల్గొన్నారు. తిమ్మాపూర్‌లో బీజేపీ నాయకులు మోడీ చిత్రపటాన్ని ఫ్లెక్సీలో ఏర్పాటు చేయనందుకు నిరసన తెలుపుతూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో వాగ్వివాదానికి దిగారు. ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసి అక్కడి నుంచి వెళ్లిపోగా బీజేపీ నాయకులు మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం పోలీసులు ఆందోళన చేస్తున్న నాయకులను అక్కడి నుంచి పంపించారు. 

18న మళ్లీ టీకాలు

ఈ నెల 18 నుంచి జిల్లాలో మళ్లీ కరోనా టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తారు. కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా 31 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి, 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6 అర్బన్‌ ఆరోగ్య కేంద్రాలు, జమ్మికుంట సీహెచ్‌సీ, హుజురాబాద్‌ ఏరియా ఆసుపత్రితోపాటు రెండు మెడికల్‌ కళాశాల ఆసుపత్రులు, అపోలో, రెనీ, మెడికవర్‌, స్టార్‌ ఆసుపత్రుల్లో ఈ టీకా కేంద్రాలు ఉంటాయి. రోజుకు వంద మంది చొప్పున ఈ కేంద్రాలలో టీకాలు ఇస్తారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, ఆశాకార్యకర్తలు, అంగన్‌వాడి టీచర్లు, వర్కర్లు, ఆయుష్‌, ఆర్టీసీ జోనల్‌ ఆసుపత్రిలో పనిచేసేవారికి మొత్తం 12,419 మందికి టీకాలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 99 కేంద్రాల్లో టీకాలు ఇస్తారు. జగిత్యాల జిల్లాలో 26 వ్యాక్సిన్‌ కేంద్రాలు, పెద్దపల్లి జిల్లాలో 26 వ్యాక్సిన్‌ కేంద్రాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 16 వ్యాక్సిన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి వీటి ద్వారా టీకాలు ఇస్తారు. 

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి...

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌

కరోనా మహమ్మారిని మన దేశం నుంచి తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్‌ చేసుకోవాలి. జిల్లాలో వ్యాక్సినేషన్‌ మొదటి విడత కార్యక్రమంలో జిల్లాలోని 12,.419 మందికి వ్యాక్సినేషన్‌ చేయడం జరుగుతుంది. తొలిరోజు వ్యాక్సినేషన్‌ సందర్భంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. వ్యాక్సినేషన్‌ సందర్భంగా ఎవరికైనా ఇబ్బందులు జరిగితే వెంటనే వైద్య సేవలందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది.

పెద్దపల్లి జిల్లాలో తొంబై మందికి టీకా : 

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

  పెద్దపల్లి జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో తొలి రోజు 120 మందికి గాను 90 మందికి టీకాలు వేశారు. మిగతా 30 మంది వివిధ కారణాల వల్ల టీకాలు వేసుకునేందుకు రాలేకపోయారు. జిల్లాలో 26 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు జిల్లాలోని పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి, గోదావరి ఏరియా ఆసుపత్రి, సుల్తానాబాద్‌ సామాజిక ఆసుపత్రి, రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని లక్ష్మీపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాలను సరఫరా చేసింది. సోమవారం నుంచి అన్ని కేంద్రాల్లో టీకాలు ఇవ్వనున్నారు. జిల్లాకు ప్రభుత్వం కోవిషీల్డ్‌ టీకాలను ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో జడ్పీ చైర్మన్‌ పుట్ట మఽధూకర్‌, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ తొలి టీకాను ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మందల వాసుదేవ రెడ్డికి ఇచ్చారు. తొలిరోజు ఎంపిక చేసిన వారిలో 20మంది మాత్రమే టీకాలు వేయించుకున్నారు. సుల్తానాబాద్‌ సామాజిక ఆసుపత్రిలో టీకాలు వేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆరంభించారు. ఇక్కడ తొలి టీకాను మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీనివాస శ్రీరామ్‌కు ఇచ్చారు. గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ తొలి టీకా ఆర్‌ఎంఓ డాక్టర్‌ భీష్మకు ఇచ్చారు. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని లక్ష్మీపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30 మందికి టీకాలు వేశారు. ఇక్కడ తొలి టీకాను ఆశా వర్కర్‌ అనంతలక్ష్మికి వేశారు. ఇప్పటివరకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదని, ఎలాంటి రియాక్షన్స్‌ కాలేదని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌ తెలిపారు.  

జగిత్యాల జిల్లాలో 38 మందికి : 

జగిత్యాల, జనవరి17(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రభుత్వం శనివారం నిర్వహించిన వ్యాక్సిన్‌ కార్యక్రమం జగిత్యాల జిల్లాలో సాఫీగా జరిగింది. జగిత్యాల ఏరియా ఆసుపత్రి, కోరుట్ల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 30 చొప్పున జిల్లాలో 60 మంది ఆరోగ్య సిబ్బందికి టీకా వేయాలన్న లక్ష్యానికి గాను 38 మందికి వైద్యులు టీకాలు వేశారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావులు టీకా పంపిణీ ప్రారంభించారు. కలెక్టర్‌ రవి, అదనపు కలెక్టర్‌ రాజేశం వ్యాక్సిన్‌ పంపిణీని పర్యవేక్షించారు. కోరుట్ల కేంద్రంలో 15 మందికి, జగిత్యాల కేంద్రంలో 23 మందికి టీకా వేశారు. కాగా గర్భిణులు, పాలిచ్చే తల్లులు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు సైతం జాబితాలో చోటు కల్పించడం పట్ల ఆరోపణలున్నాయి. జగిత్యాలలో స్టాఫ్‌ నర్సు శాంతి జయసుధ, కోరుట్లలో డాక్టర్‌ కోటగిరి సుధీర్‌ తొలి వ్యాక్సిన్‌ తీసుకున్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్న వ్యక్తులను ఆసుపత్రుల్లోని ప్రత్యేక గదుల్లో సుమారు అరగంట సేపు ఉంచి వైద్యులు పరిశీలించారు. జిల్లాలో వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తులెవరికీ సైడ్‌ ఎఫెక్ట్‌ కలగలేదు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 120 మందికి

సిరిసిల్ల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి):  రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు కేంద్రాల్లో 120 మందికి కొవిషీల్డ్‌ టీకాలు వేశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిరిసిల్లలోని జిల్లా ప్రభుత్వాస్పత్రితోపాటు  వేములవాడ, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో  టీకా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రంలో తొలి రోజు 30 మందికి ఇచ్చే విధంగా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ సరఫరా చేశారు. మొత్తం నాలుగు కేంద్రాల్లో 120 మందికి కొవిషీల్డ్‌ టీకాలు వేశారు. జిల్లా కేంద్రంలో తొలి వ్యాక్సిన్‌ను సిరిసిల్ల ఐఎంఏ అధ్యక్షుడు, డాక్టర్‌ సురసుర రాధాకృష్ణ తీసుకున్నారు. తర్వాత పారిశుధ్య కార్మికురాలితోపాటు మిగతా వారు టీకాలు వేసుకున్నారు. ఎవరికీ ఇబ్బందులు కలగలేదు. డాక్టర్‌ రాధాకృష్ణ మాత్రం టీకా తీసుకున్న ఒక నిమిషంపాటు కొద్దిగా తిప్పినట్లు అనిపించిందని, అనంతరం ఇబ్బంది కలగలేదని తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించినట్లు చెప్పారు.  వ్యాక్సిన్‌ గురించి భయపడవద్దని సురక్షితమైందని అన్నారు.  జిల్లా  కృషభాస్కర్‌ మాట్లాడుతూ ముందుగా ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఎవరికైనా దుష్ఫలితాలు ఏర్పడితే తక్షణ చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అంతకుముందు ప్రధాని ప్రసంగాన్ని విన్నారు.   అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ నీరజ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-17T06:00:36+05:30 IST