Advertisement

10 వేలు దాటేశాయ్‌ యాక్టివ్‌ కేసులు

Apr 23 2021 @ 04:06AM

రాష్ట్రంలో కొత్తగా 10,759 కేసులు.. 31 మరణాలు

మిలియన్‌ మార్కుకి చేరువైన కేసులు

4 జిల్లాల్లో వెయ్యికిపైగా పాజిటివ్‌లు

67 వేలకు చేరువలో యాక్టివ్‌ కేసులు

విశాఖ ఏసీపీ, అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌ మృతి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి బుల్లెట్‌ వేగంతో దూసుకెళ్తోంది. సెకండ్‌ వేవ్‌లో రోజువారీ కేసులు తొలిసారిగా 10వేల మార్కుని దాటేశాయి. ఈ క్రమంలో మొత్తం కేసులు కూడా 10 లక్షల రికార్డుకి చేరువయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 41,871 శాంపిల్స్‌ను పరీక్షించగా 10,759 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 9,97,462కి చేరుకుంది. శుక్రవారం ఈ సంఖ్య మిలియన్‌ మార్కుని దాటే అవకాశం ఉంది. తాజాగా చిత్తూరులో అత్యధికంగా 1,474 మందికి వైరస్‌ సోకగా.. కర్నూలులో 1,367, శ్రీకాకుళంలో 1,336, గుంటూరులో 1,186, తూర్పుగోదావరిలో 992, నెల్లూరులో 816, విశాఖపట్నంలో 844, అనంతపురంలో 789, కృష్ణాలో 679, ప్రకాశంలో 345, విజయనగరంలో 562, కడపలో 279, పశ్చిమగోదావరిలో 90 కేసులు నమోదయ్యాయి.


ఒకరోజు వ్యవధిలో 3,992 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ కావడంతో రికవరీల సంఖ్య 9,22,977కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 66,944 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక కరోనా కారణంగా గత 24 గంటల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు, కృష్ణాలో ఐదుగురు చొప్పున, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాలు 7,541కి పెరిగాయి. 


రెండో డోసు తర్వాత గుండెపోటు

విశాఖపట్నం ఏఆర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ) తలగాన కృష్ణారావు (56) గురువారం ఉదయం విశాఖపట్నంలో గుండెపోటుతో మృతి చెందారు. కృష్ణారావుకు గతంలో గుండె శస్త్రచికిత్స జరిగి స్టంట్‌ వేశారు. గురువారం కొవిడ్‌ రెండో డోసు వ్యాక్సిన్‌ వేసుకున్న కొద్దిసేపటికే ఆయనకు మరోసారి గుండెపోటు రావడంతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. కృష్ణారావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు. భార్య, కుమారుడితో కలిసి విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. 


అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ మృతి 

వారం రోజులుగా కొవిడ్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌ సవడం శ్రీనివాస్‌ గురువారం మృతి చెందారు. అగ్రిగోల్డ్‌ సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తూ మృతిచెందిన మూడో వ్యక్తి శ్రీనివాస్‌. ఇంతకుముందు డైరెక్టర్లు ఇమ్మిడి సదాశివ వరప్రసాద్‌, అవ్వా ఉదయభాస్కర్‌ మరణించారు. కరోనాతో మృతిచెందిన శ్రీనివాస్‌ అగ్రిగోల్డ్‌ డైరెక్టరే కాకుండా క్యారమ్స్‌ ఆటగాడు కూడా. కృష్ణా జిల్లా క్యారమ్స్‌ సంఘం కార్యదర్శిగానూ పనిచేశారు. 


మరణాలను దాచడం లేదు: ఏకే సింఘాల్‌ 

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు, కొవిడ్‌ మరణాల తీవ్రతను తగ్గించి చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదంటూ వస్తున్న కథనాలపై ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్‌ గురువారం స్పందించారు. కరోనా మరణాలను దాచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని చెప్పారు. ‘‘కొవిడ్‌ కారణంగా మరణిస్తున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు ప్రకటిస్తున్నారు. కొవిడ్‌ మరణాలు కానివాటిని కూడా ఆ కేసులుగా చూపుతున్నామనేది వాస్తవం లేదు’’ అని వివరించారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ బాగానే జరుగుతోందని, రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్‌ తెప్పించే విషయంలో సీఎం జగన్‌ కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.