20 వేలు దాటేశాయ్‌!

ABN , First Publish Date - 2020-07-07T08:21:22+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విలయానికి అడ్డూ ఆపు లేకుండా పోతోంది. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో ..

20 వేలు దాటేశాయ్‌!

ఒక్కరోజే 1,322 కేసులు.. 20,019కి ఎగబాకిన పాజిటివ్‌లు

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 197 కేసులు నమోదు

తూర్పుగోదావరి, అనంతపురం, కర్నూలులో వైరస్‌ విలయం

కరోనాతో మరో ఏడుగురు మృత్యువాత.. 239కి మరణాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రంలో కరోనా వైరస్‌ విలయానికి అడ్డూ ఆపు లేకుండా పోతోంది. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,322 మందికి పాజిటివ్‌గా తేలడంతో.. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,019కి ఎగబాకింది. ఏపీలో ఒక్కరోజులోనే 1300కిపైగా కేసులు నమోదవడం ఇదే తొలిసాది. ఆదివారం 16,712 శాంపిల్స్‌ను పరీక్షించగా 1,263 మంది స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56 మందికి, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 197 మందికి వైరస్‌ సోకగా.. తూర్పుగోదావరిలో 171, అనంతపురంలో 142, కర్నూలులో 136, చిత్తూరులో 120, విశాఖపట్నంలో 101, పశ్చిమగోదావరిలో 106 కేసులు బయటపడ్డాయి. 24 గంటల్లో 424 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.


ఇక సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు మృతి చెందారు. శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 239కి చేరాయి. తూర్పుగోదావరిలో 171 మందికి కరోనా నిర్ధారణ అయింది. 


డాక్టర్‌ కుటుంబంలో 8 మందికి కరోనా

కర్నూలు జిల్లాలో 136 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2587కు చేరింది. కర్నూలు నగరంలో కరోనా బాధితుల సంఖ్య వెయ్యి దాటింది. తాజా కేసుల్లో నంద్యాలలోని ఓ ప్రముఖ డాక్టర్‌ కుటుంబంలో ఇద్దరు వైద్యులతోపాటు మరో ఆరుగురు ఉన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని పీహెచ్‌సీ వైద్యాధికారికి కూడా వైరస్‌ సోకింది. కృష్ణా జిల్లాలో మరో 55 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు.

Updated Date - 2020-07-07T08:21:22+05:30 IST