Advertisement

నివురు లేదు, నిప్పే!

Oct 10 2020 @ 00:14AM

ఆరునెలలకు పైగా ప్రపంచాన్ని కుదిపివేస్తున్న ప్రాణాంతక వ్యాధి పూర్తిగా నెమ్మదించలేదు కానీ, అస్వస్థతలకి, సుదీర్ఘ చికిత్సలకి, మరణాలకి అలవాటు పడిపోయాము. అంతే కాదు, ముఖకవచాలకు, దిగ్బంధ జీవనాలకు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లకు, సమూహ వినోద రాహిత్యానికి, నిరుద్యోగానికి, అరకొర సంపాదనలకు కూడ అలవాటుపడ్డాము. ఎంత తీవ్ర పరిస్థితి అయినా సాధారణమయ్యాక, భరించగలిగే స్థితికి వస్తుంది. ఎవరి కష్టాన్ని వారు భరించడం వ్యక్తిగత స్థాయి అయితే, సమాజంలో కొందరు ఉపాధిని, ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని కోల్పోవడం సామాజిక స్థాయిలో ఏర్పడే సహిష్ణుత. స్థూలంగా చూస్తే, వ్యాధి వ్యాప్తితీవ్రత తగ్గిందని, మరణాల రేటు తగ్గిందని గణాంకాలలో చెబుతుంటాము కానీ, ఒక్కో అంకె అది ఏ స్థానంలో ఉన్నదన్న దానిని బట్టి, దాని వాస్తవ విలువ ఉంటుంది. అవి కేవలం అంకెలు కావు, మనుషులు, ప్రాణాలు, జీవితాలు!


కాసింత తెరిపి వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఎంతెంత నష్టం జరిగిందన్న లెక్కలు వేసుకోవడానికి కుదురుతుంది. పోతున్న ప్రాణాలు విలువైనవే, కానీ, కాలంతో పాటు లోకం ముందుకు పోవాలి. మృత్యుస్పర్శను తప్పించుకున్న అశేష మానవాళి, రేపటి తరాలు– సాధారణ జీవితాన్నిగడపాలి, ఇప్పటిదాకా కొనసాగిస్తూ వస్తున్న అభివృద్ధిని, మంచిని మరింత ముందుకు తీసుకువెళ్లాలి. అందుకోసం కూడా మనం అంచనాలు వేసుకోవాలి. కొవిడ్‌ కల్లోలం కారణంగా, దాని నుంచి రక్షణ కోసం, దాని నుంచి ఉత్పన్నమైన పరిస్థితిని ఎదుర్కొనడం కోసం అనుసరించిన పద్ధతుల వల్ల ఎంతెంత నష్టపోయాము, రేపు సాధారణ స్థితి నెలకొన్న తరువాత, ఈ నష్టం పర్యవసానాలు ఎట్లా ఉంటాయి?– వీటిని మదింపు వేసుకోకపోతే, భవిష్యత్తును అనువుగా మలచుకోలేము. 


ఇటీవల ఒక ఆంగ్ల జాతీయ వారపత్రిక దేశ ఆర్థిక, ఉత్పాదక, ఉపాధి రంగాల పరిస్థితిని మదింపు వేస్తూ ఆందోళనకరమైన సమాచారాన్ని అందించింది. వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధి అందించే రంగాలు రెండు. ఒకటి– తయారీ రంగం (12 కోట్లు), రెండు జౌళి రంగం(సుమారు 10 కోట్లు). దేశ స్థూల జాతీయోత్పత్తిలో పదిహేను శాతం పైగా అందించే తయారీ రంగం కొవిడ్‌ కల్లోలంలో అతలాకుతలం అవుతున్నది. బంగ్లాదేశ్‌, శ్రీలంక వంటి చిన్న దేశాల నుంచి ఉన్న పోటీతో ఇబ్బందులు పడుతున్న జౌళి రంగం, కరోనా కాలంలో మరింత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దుస్తుల మీద ఎక్కువ ఖర్చు చేయగలిగిన వర్గాలు కేవలం ఇళ్లలో ధరించే వస్త్రాల కొనుగోలుకే పరిమితం అవుతున్నారు. మాస్కులు ఒక్కటే అధికంగా అమ్ముడుపోతున్న వస్త్ర ఉత్పత్తులంటే ఆశ్చర్యం లేదు. విమానయానంతో సహా, ప్రజా, సరుకుల రవాణారంగాలన్నీ తీవ్రమైన నష్టంలో కూరుకుపో తున్నాయి. భారీ ఆపరేటర్లే కాదు, చిన్న చిన్న అద్దెకార్ల ఏజెన్సీలు కూడా దాదాపుగా పడావులో పడిపోయాయి. రవాణాతో ముడిపడి ఉన్న పర్యాటకరంగం అయితే పూర్తిగా కుదేలయింది. నాలుగు కోట్ల మంది దాకా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. కిరాణా, త్వరగా వినియోగం పొందే సరుకుల దుకాణాలను మినహాయించి, తక్కిన దుకాణాల రంగం అంతా సంక్షోభంలో ఉన్నది. 5 కోట్ల మంది ఉపాధి ఈ రంగంతో ముడిపడి ఉన్నది. నష్టం లేకపోగా, లాభం కూడా పొందుతున్న రంగాలు ఏవైనా ఉన్నాయా అంటే, అవి ఈ–కామర్స్‌, ఫార్మా, కార్పొరేట్‌ వైద్యం, ఆహార, నిత్యావసర సరుకుల సూపర్‌ మార్కెట్లు, డెలివరీ సంస్థలు వంటివి మాత్రమే. హోటల్‌ పరిశ్రమ నష్టపోయింది. రెస్టారెంట్ల పరిస్థితీ అంతే, వాటితోపాటు హోమ్‌ డెలివరీలు కూడా ఆగిపోయాయి. సినిమాలు, థియేటర్లు, వినోదపరిశ్రమ, సరేసరి. ఒక్క ఓటిటి వేదికలు మాత్రం కొత్త వీక్షకులను సంపాదించుకున్నాయి. 


జనజీవనం కొద్దికొద్దిగా గాడిన పడుతున్నప్పటికీ, పైన చెప్పిన రంగాలపై ఒత్తిడి వెంటనే తొలగిపోదు. కొన్ని దీర్ఘకాలికమైన ప్రభావాన్ని చవిచూడవచ్చు. కరోనా కాలపు దిగ్బంధాల కారణంగా వినియోగ సరళిలో కూడా అనేక మార్పులు వస్తాయి. పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తుంది కానీ, పూర్వ స్థితి పునరుద్ధరణ జరగకపోవచ్చు. కేవలం వినియోగం విషయంలోనే కాదు, నైపుణ్యం కలిగిన శ్రామికుల విషయంలోనూ ఒక కొత్త పరిస్థితిని ఎదుర్కొనవలసి రావచ్చు. 

లాక్‌డౌన్‌ అనంతరం రోడ్ల మీదికి వచ్చిన వలసకూలీలలో నైపుణ్యం లేని వారితో పాటు, నైపుణ్యం కలిగిన శ్రామికులు కూడా ఉన్నారు. వారు వారి స్వస్థలాలకు చేరుకున్న తరువాత, వారిలో అనేకులు ఇతర ఉపాధులలోకి కుదురుకుని ఉంటారు. వెంటనే వారు తిరిగి వలస వెళ్లడానికి సంసిద్ధులు కాకపోవచ్చు. అందువల్ల అవసరమైన చోట్ల, అవసరమైన నైపుణ్యాల కొరత ఏర్పడుతుంది. భారతదేశంలో నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చే సంస్థలు (ప్రభుత్వం నడిపేవి, ఇతరులు నడిపేవి) 15 వేల దాకా ఉంటాయని అంచనా. అవన్నీ ఈ ఆరునెలల కాలంలో మూతపడ్డాయి. అనేక మంది శిక్షణార్థులు మధ్యలోనే స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఆ శిక్షణాసంస్థల పునఃప్రారంభం ఏమంత తేలిక కాదు. వెళ్లినవారందరూ మళ్లీ సంస్థలలోకి రాకపోవచ్చు. ఉత్పాదక పరిశ్రమలు, సేవారంగాల సంస్థలు పూర్తిస్థాయిలో పనిచేయడం ఆరంభిస్తే, నైపుణ్య కార్మికుల కొరత భారీగా ఉంటుంది. 


కరోనానంతర స్థితి గురించి ప్రణాళికలు రచించేవారు, శ్రామికుల తిరుగు వలసల ప్రభావాన్ని, నైపుణ్య కార్మికులకు ఏర్పడబోయే కొరతని, నైపుణ్య శిక్షణాసంస్థల మూత కారణంగా ఉత్పన్నయిన పరిస్థితిని మదింపు వేసి, తగిన పరిష్కారాన్ని అన్వేషించాలి. వైరస్‌ లాగా, ఆర్థిక సంక్షోభం వెంటనే ప్రస్ఫుటం కాదు. వివిధ రంగాలలో నెలకొని ఉన్న ప్రమాదకర పరిస్థితులు ఒకదాని తరువాత ఒకటి పైకి వ్యక్తం అవుతాయి. యాజమాన్యాలు సైతం తీవ్రమైన ఆర్థికసంక్షోభంలో కూరుకుపోతాయి. ఇదంతా అశాంతికి దారితీస్తుంది. అది ఏలికలకు మంచిది కాదు. ఏదో బూచి చూపించి మభ్యపెట్టడం నాయకులకు సాధ్యమే. కానీ, అది ప్రజలకు ప్రమాదం.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.