కరోనా వైరస్‌ కట్టడికి చర్యలు

ABN , First Publish Date - 2021-04-17T06:14:32+05:30 IST

మహారాష్ట్ర ప్రభావంతో జిల్లాలో కేసులు బాగా పెరుగుతుండడంతో కరోనా కట్టడికి జిల్లా అధికార యంత్రాంగం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటి వరకు టెస్టులు, పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్సపై దృష్టిపెట్టిన యంత్రాంగం ఎక్కడికక్కడ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. కేసులు

కరోనా వైరస్‌ కట్టడికి చర్యలు
నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలో కరోనా టెస్టుల కోసం బారులు తీరిన జనం

జిల్లాలో కరోనా వైరస్‌ కట్టడికి ప్రయత్నాలు 

క్వారంటైన్‌ జోన్‌లు, హాట్‌స్పాట్‌ల గుర్తింపు 

పీహెచ్‌సీల పరిధిలో సిబ్బంది కొరత

నియంత్రణపై దృష్టి సారించిన పోలీసులు 

స్వీయ నియంత్రణ పాటించాలంటున్న అధికారులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మహారాష్ట్ర ప్రభావంతో జిల్లాలో కేసులు బాగా పెరుగుతుండడంతో కరోనా కట్టడికి జిల్లా అధికార యంత్రాంగం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటి వరకు టెస్టులు, పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్సపై దృష్టిపెట్టిన యంత్రాంగం ఎక్కడికక్కడ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో మైక్రో క్వారంటైన్‌ ప్రాంతాలు, హాట్‌స్పాట్‌లు ప్రకటింనున్నారు. ఆ ప్రాంతాలలో ప్రజలను కట్టడి చేయనున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులు పలు దఫాలు చర్చలు జరిపారు. ప్రభుత్వానికి నివేదించారు. క్వారంటైన్‌ జోన్‌లు, హాట్‌స్పాట్‌లు ప్రకటించి ఎక్కడికక్కడ పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స అందించనున్నారు. జిల్లాలో గడిచిన నెలన్నర రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో నియంత్రణపై వైద్య, ఆరోగ్యశాఖతో పాటు ఇతర శాఖల అధికారులు కట్టడిపై దృష్టిపెట్టారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పలు దఫాలు చర్చించిన అధికారులు కేసులు బాగా వస్తున్న ప్రాంతాలపై దృష్టిపెట్టారు. ఆయా మండలాల పరిధిలో కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అక్కడి ప్రజలను కట్టడి చేయడంతో పాటు మొదటి విడతలోగానే క్వారంటైన్‌ జోన్‌లు, హాట్‌స్పాట్‌లు ప్రకటించి చర్యలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. మొదటి విడత సమయంలో కేసులు వచ్చిన ప్రాంతాలను క్వారంటైన్‌ జోన్‌లుగా ప్రకటించి చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలో సెకండ్‌వేవ్‌ తీవ్రత ఎక్కువగా ఉండడం నిత్యం వందలాది కేసులు వస్తుండడంతో ఈ నిర్ణయానికి వచ్చారు. మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తుండడంతో కేసులు పెరుగుతున్నట్లు గుర్తించారు. సరిహద్దుల వద్ద చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో కేసులు ఎక్కువగా వస్తున్న గ్రామాలు, మున్సిపాలిటీలలోని వార్డులను గుర్తించి వీటిని క్వారంటైన్‌ జోన్‌లుగా ప్రకటిస్తారు. అక్కడే కేసుల తీవ్రతను బట్టి చికిత్స అందిస్తారు. సీరియస్‌గా ఉన్నవారిని ఆసుపత్రులకు తరలిస్తారు. వారికి చికిత్స అందిస్తారు. 

పీహెచ్‌సీల పరిధిలో పెంచిన టెస్టులు

కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో పీహెచ్‌సీల పరిధిలో టెస్టులను పెంచారు. ప్రతీ పీహెచ్‌సీ పరిధిలో కనీసం 50 టెస్టులు చేస్తున్నారు. అంతకుమించి వచ్చినా చేస్తున్నారు. జిల్లాలోని మొత్తం 42 కేంద్రాలలో ఈ పరిక్షలను నిర్వహిస్తున్నారు. ఈ టెస్టులకు కావాల్సిన కిట్స్‌కు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేస్తున్నారు.

కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ

జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతీ కేంద్రంలో నిత్యం 75 నుంచి వంద మందికి వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు. జిల్లాకు కోవిషీల్డ్‌ సరఫరా ఉండడంతో అన్ని పీహెచ్‌సీల పరిధిలో అదే వ్యాక్సిన్‌ వేస్తున్నారు. కొవాక్సిన్‌ సరఫరా అంతగా లేకపోవడంతో మొదటి డోస్‌ వేసిన వారికే రెండో డోస్‌ వేస్తుండడం గమనార్హం.

పీహెచ్‌సీ పరిధిలో ఉన్న ఉద్యోగులపై భారం

జిల్లాలోని పీహెచ్‌సీల పరిధిలో సిబ్బంది కొరత ఉంది. ఉన్నవారిలో 25 శాతం మందికిపైగా కొవిడ్‌ సోకింది. మిగతా సిబ్బంది కొవిడ్‌ పరీక్షలను నిర్వహించడంతో పాటు వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా వైద్యులతో పాటు పారామెడికల్‌ సిబ్బందిని నియమించకపోవడం వల్ల ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్న వారిలో కొంతమందిని డిప్యూటేషన్‌ పై ఇతర ప్రాంతాలకు పంపించడం వల్ల సమస్య ఎదురవుతుంది.

ఎక్కడికక్కడ ఆసుపత్రులు ఫుల్‌

జిల్లాలోని కొవిడ్‌ చికిత్స అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు ఫుల్‌ అయ్యాయి. జిల్లాలో వందల సంఖ్యలో కేసులు వస్తుండడంతో అనుమతులు అన్ని ఆసుపత్రులకు ఇచ్చారు. చిన్న ప్రైవేట్‌ ఆసుపత్రులు కూడా జనరల్‌ సేవలు తగ్గించి కరోనా రోగులను చేర్చుకుంటున్నారు. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులలో ఆక్సిజన్‌ బెడ్స్‌కు డిమాండ్‌ పెరగడంతో సాధారణ పడకలకు కూడా ఆక్సిజన్‌ పెట్టి చేస్తున్నారు.

కొత్తగా కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు

కరోనా కేసులు పెరుగుతుండంతో కొత్తగా కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతతున్నారు. ఇప్పటికే మాక్లూర్‌, పెర్కిట్‌, బోధన్‌ పరిధిలో వీటిని ఏర్పాటు చేశారు. ఇవేకాకుండా నిజామాబాద్‌, ఇతర ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

నియంత్రణపై పోలీసుశాఖ దృష్టి

కరోనా నియంత్రణపై పోలీసుశాఖ దృష్టిపెట్టింది. అన్ని పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో వాహనాల తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అన్ని సంఘాలతో సమావేశాలను జరుపుతున్నారు. కరోనా నియంత్రణకు సహకరించాలని కోరుతున్నారు. బయటకు వచ్చేవారు తప్పనిసరి మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరుతున్నారు. మాస్కులు పెట్టని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. నగర సీపీ కార్తికేయతో పాటు అన్ని స్థాయిల అధికారులు రోడ్లపైకి వచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

జనరల్‌ ఆసుపత్రికి తాకిడి

జిల్లా జనరల్‌ ఆసుపత్రికి కరోనా రోగుల తాకిడి భారీగా పెరిగింది. సీరియస్‌గా ఉన్న వారితో పాటు ఓ మాదిరిగా ఉన్నవారు ఎక్కువగా వస్తున్నారు. తమను చేర్చుకోవాలని కోరుతున్నారు. ఆసుపత్రిలో ఇప్పటికే 315 మంది చేరడంతో బెడ్స్‌ లేక తిప్పలు పడుతున్నారు. కొత్తగా బెడ్స్‌ వేసి చేర్చుకుని ఆక్సిజన్‌తో పాటు ఇతర సమస్యలు ఏర్పడుతుండడంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పెరిగిన మృతుల సంఖ్య

కరోనా కేసులు పెరుగుతుండడంతో గడిచిన కొన్ని రోజులుగా సీరియస్‌ అయిన వారు మృత్యువాత పడుతున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన తర్వాత సరైన వైద్యం తీసుకోనివారే ఎక్కువగా సీరియస్‌ అయి చనిపోతున్నారు. లక్షణాలు ఎక్కువగా ఉన్నవారు త్వరగా ఆసుపత్రిలో చేరితో ప్రమాదం నుంచి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

జిల్లాలో టెస్టులు పెంచాం

: డాక్టర్‌ బాలనరేంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

జిల్లాలో కొవిడ్‌ టెస్టులను పెంచాం. పీహెచ్‌సీల పరిధిలో వచ్చిన వారిని తిప్పి పంపడం లేదు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారందరికీ మందులు అందిస్తున్నాం. ప్రజలు స్వీయ నియంతణ్ర పాటించాలి. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు.

Updated Date - 2021-04-17T06:14:32+05:30 IST