గొంతు, ముక్కులో 2-3 రోజులే!

ABN , First Publish Date - 2021-04-28T16:23:31+05:30 IST

కరోనా ఇన్ఫెక్షన్‌ లక్షణాలను గుర్తించి, నిర్ధారణ పరీక్ష చేయించుకునేలోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతోంది. అప్పటికే వైరస్‌ కాస్తా ఊపిరితిత్తుల్లోకి చొరబడి తిష్టవేస్తోంది. ఆ తర్వాత.. ఆర్టీ- పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేయించుకున్నా ఇ న్ఫెక్షన్‌ నిర్ధారణ కావడం లేదు.

గొంతు, ముక్కులో 2-3 రోజులే!

గుర్తించే సరికే ఊపిరితిత్తుల్లో కరోనా తిష్ట.. 

ర్యాపిడ్‌ యాంటీజెన్‌, ఆర్టీపీసీఆర్‌ టెస్టులకు అందని వైరస్‌

సత్వర నిర్ధారణకు హెచ్‌ఆర్‌సీటీ..

మూడోరోజే వైరల్‌ లోడ్‌ గుట్టురట్టు

కొవిడ్‌ లక్షణాలు లేకపోయినా చేయించుకోవాలి : వైద్య నిపుణులు


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): కరోనా ఇన్ఫెక్షన్‌ లక్షణాలను గుర్తించి, నిర్ధారణ  పరీక్ష చేయించుకునేలోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతోంది. అప్పటికే వైరస్‌ కాస్తా ఊపిరితిత్తుల్లోకి చొరబడి తిష్టవేస్తోంది. ఆ తర్వాత.. ఆర్టీ- పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేయించుకున్నా ఇ న్ఫెక్షన్‌ నిర్ధారణ కావడం లేదు. చాలామందికి ‘నెగెటివ్‌’ వస్తోంది. దీంతో తమకు కరోనా వైరస్‌ సోకలేదనే నిర్ధారణకు వస్తున్నారు. అయితే సకాలంలో ఇన్ఫెక్షన్‌ను గుర్తించకపోవడంతో కొవిడ్‌ బారినపడిన వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్‌ను సకాలం లో నిర్ధారించుకొని, పెనుముప్పు నుంచి బయటపడేందుకు ‘హెచ్‌ఆర్‌సీటీ’ (హై రెజెల్యూషన్‌ కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ)పరీక్ష తప్పనిసరి అని వారు అంటున్నారు. 


ఆర్టీ పీసీఆర్‌ ఫలితాలు ప్రశ్నార్ధకం.. 

కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచి లక్షణా లు బయటపడని కొవిడ్‌ కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలాంటి వారికి జ్వరం ఉండదు...దగ్గు ఉం డదు. జలుబు ఆనవాళ్లు కనిపించవు. గొంతు, ముక్కు లో కరోనా వైరస్‌ రెండు, మూడు రోజులే ఉంటుంది. ఆ తర్వాత ఊపిరితిత్తుల్లోకి చేరిపోతుంది. దీంతో ముక్కు, గొంతు స్రావాలతో నిర్వహించే ఆర్టీ పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేయించుకున్నా కొవిడ్‌ -19 నెగెటివే వస్తోంది. కానీ వైరస్‌ మాత్రం శరీరంలోనే ఉంటూ చడీచప్పుడు లేకుండా ఇన్ఫెక్షన్‌ను తీవ్రతరం చేస్తోంది. గొంతు, ముక్కులో వైరస్‌ ఉన్నప్పుడు మాత్రమే ఆర్టీపీసీఆర్‌ ద్వారా వైర్‌సను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సెకండ్‌వేవ్‌ మొదలైనప్పటి నుంచి వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్‌ స్ట్రెయిన్లు గొంతు, ముక్కు మార్గాల ద్వారా చాలా త్వరగా ఊపిరితిత్తుల్లో కి చేరిపోతున్నాయి.


ఈ కారణం వల్లే ఇటీవల కాలం లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో తప్పుడు నెగెటివ్‌ నివేదికలు పెరిగాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో హెచ్‌ఆర్‌సీటీ పరీక్ష చేయడం తప్పనిసరి అవుతోందని అంటున్నారు. కరోనా లక్షణాలను గుర్తించిన 3 నుంచి 5 రోజుల్లోగా హెచ్‌ఆర్‌సీటీ టెస్టు చేయాలని సూచిస్తున్నారు. కరోనా మొదటి వేవ్‌ సమయంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ద్వారా 70 శాతం ‘పాజిటివ్‌’ కేసులను కచ్చితత్వంతో నిర్ధారించేది. కేవలం 30 శాతం శాంపిళ్లకు మాత్రం తప్పుడు నెగెటివ్‌ నివేదికలు వచ్చే వి. అప్పట్లో కొవిడ్‌ లక్షణాలు గుర్తించిన 5వ రోజు త ర్వాత హెచ్‌ఆర్‌సీటీ చేస్తేనే ఊపిరితిత్తుల్లో వైరస్‌ ఉ న్నట్లు నిర్ధారణ అయ్యేది. కానీ ఇప్పుడు 50 శాతం దా కా ఆర్టీపీసీఆర్‌ పరీక్షా ఫలితాల్లో నెగెటివ్‌ వస్తోంది. లక్షణాలు కనిపించిన 3వ రోజే హెచ్‌ఆర్‌సీటీ పరీక్ష చేస్తే ఊపిరితిత్తులో వైరల్‌ లోడ్‌పై స్పష్టత వస్తోందని వైద్యులు వివరించారు. 


నమూనాలు సరిగ్గా సేకరించకపోయినా.. 

ఇక కొంతమంది జలుబు చేసిన మొదటిరోజే ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష చేయించుకుంటున్నారు. ఆ సమయం లో వైర్‌సను గుర్తించలేం. లక్షణాలు బయటపడిన మొదటి రోజు, పదిహేనో రోజు నాడు పరీక్ష చేయించుకుంటే ఇన్ఫెక్షన్‌ను నిర్ధారించలేం. దీంతోపాటు కరోనా అనుమానితుల నుంచి నమూనాల(శాంపిళ్లు)ను సరి గ్గా సేకరించకపోతే సరైన ఫలితం రాదు.


హెచ్‌ఆర్‌సీటీ చేస్తున్నాం

మా ఆస్పత్రికి వచ్చే వారిలో ఎవరైనా కరోనా లక్షణాలు బయటపడి 3 నుంచి 5 రోజు లు అయిందని చెబితే, హెచ్‌ఆర్‌సీటీ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నాం. ఫలితంగా ఊపిరితిత్తుల్లోని వైరల్‌ లోడ్‌ను కనిష్ఠంగా మూడో రోజునాడే గుర్తించే అవకాశం కలుగుతోంది. సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచి కరోనా నిర్ధారణ అవుతున్న చాలామంది వృద్ధుల్లో.. రోగ లక్షణాలు బయటపడటం లేదు. వారికి కూడా హెచ్‌ఆర్‌సీటీ టెస్టు చేయడం మంచిది. 


డాక్టర్‌ మురళి, పల్మనాలజిస్టు, శ్రీకర్‌ ఆస్పత్రి


కో-రాడ్స్‌ స్కోరుతో నిర్ధారణ 

హెచ్‌ఆర్‌సీటీ పరీక్షలో కరోనా వైరల్‌ లోడ్‌ను గుర్తిస్తాం. కో-రాడ్స్‌ స్కోర్‌ను 1 నుంచి 6 వరకు పరిశీలిస్తాం. కో-రాడ్స్‌ స్కోర్‌ 4 లేదా 5 ఉంటే కొవిడ్‌కు దరిదాపుల్లో ఉన్నట్టు. స్కోరు 6 ఉంటే కరోనా ఉందనే నిర్ధారణకు వస్తాం. మా ఆస్పత్రికి వచ్చే వాళ్ల ఆక్సిజన్‌ స్థాయి 95 కంటే తక్కువగా ఉంటే సీటీ స్కాన్‌ చేసుకోవాల్సిందిగా సూచిస్తాం. రెండు, మూడుసార్లు ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష చేయించుకున్నా నెగెటివ్‌ వస్తేనే హెచ్‌ఆర్‌సీటీ చేస్తున్నాం.  


డాక్టర్‌ లతా శర్మ, పల్మనాలజిస్టు, కిమ్స్‌ 


Updated Date - 2021-04-28T16:23:31+05:30 IST