నేతలను వణికిస్తున్న వైరస్‌

ABN , First Publish Date - 2021-04-12T15:56:44+05:30 IST

కరోనా మహమ్మారి..

నేతలను వణికిస్తున్న వైరస్‌
గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

గొట్టిపాటితోపాటు ఏలూరికీ పాజిటివ్‌

బూచేపల్లి, ఆయన అనుచరులకూ కరోనా

దామచర్ల సత్యతోపాటు పలువురికి నిర్ధారణ

స్థానిక ఎన్నికలు, తిరుపతి ప్రచారం, ఫంక్షన్లే కారణం


(ఒంగోలు, ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా మహమ్మారి వివిధస్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలను చుట్టుముడుతోంది. దీంతో కుటుంబాలకు కుటుంబాలు వైద్యశాలల్లో చేరడంతోపాటు, హోంక్వారంటైన్‌లో ఉండిపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ఉన్న నేతల్లో వందల మంది హౌస్‌ క్వారంటైన్‌కు చేరారు. వారితోపాటు, మిగిలిన నేతలూ వణికిపోతున్నారు. ఇటీవల పరిషత్‌ ఎన్నికలు జరగడం, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, కిందిస్థాయిలో అనుచరులు, నాయకులు ఏర్పాటు చేసే వివిధ ఫంక్షన్లకు హాజరు కావడం వంటి కార్యక్రమాలతో వీరంతా కొవిడ్‌ బారిన పడ్డట్లు అర్థమవుతుంది.


ఒక ముఖ్యనేతకు పాజిటివ్‌ వస్తే అతనితో ఉన్న వారికి శరవేగంగా వైరస్‌ వ్యాపిస్తోంది. ఒకరి నుంచే సుమారు 30 మందికి  సోకుతున్నట్లు అంచనా వేస్తున్నారు. గతంలో ఈ స్థాయిలో వైరస్‌ వ్యాపించలేదని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే కుటుంబంలో ఒకరు వైరస్‌ బారిన పడితే అందరికీ పాజిటివ్‌ ఫలితం రావడం ఈసారి మరో ప్రత్యేకతగా కనిపిస్తోంది. వీటన్నింటికీ కనీస జాగ్రత్తలు లేకపోవడమే కారణమని భావిస్తున్నారు. 


పలువురు ప్రజాప్రతినిధులకు పాజిటివ్‌

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని వైద్యశాలలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన తన నివాసంలోని క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ ఫలితం వచ్చింది. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దామచర్ల సత్యకు కూడా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఒంగోలులోని ఓ కార్పొరేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబంలోనే మరొకరికి కూడా వైరస్‌ ఉన్నట్లు తేలిందని సమాచారం. దర్శి మాజీ ఎమ్మల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు వైరస్‌ బారిన పడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు.


చీమకుర్తిలో ఆయనతో ఉండే నేతలు, కార్యకర్తలు పలువురుకి కొవిడ్‌ సోకింది. చీమకుర్తిలోని ఓ నేత మృతి కూడా ఆందోళన రేకెత్తిస్తోంది. సుమారు 48 ఏళ్ల వయసు ఉన్న ఆ నాయకుడికి ఎలాంటి దురలవాట్లు లేవు. పది రోజుల క్రితం వ్యాక్సిన్‌ కూడా వేయించుకున్నారు. సమీపంలో ఉన్న వారికి పాజిటివ్‌ రావడంతో ఆయన పరీక్ష చేయించుకున్నాడు. వైరస్‌ ఉన్నట్లు తేలిన కొంతసేపటికే గుండెపోటుతో మృతి చెందాడు.  అందుకు తీవ్ర భయాందోళనలే కారణమని భావిస్తున్నారు.


హోం క్వారంటైన్‌లో నేతల వ్యక్తిగత సిబ్బంది

నేతలతోపాటు తిరిగిన వ్యక్తిగత సిబ్బంది, ద్వితీయ శ్రేణి నాయకుల్లో అనేక మందికి పాజిటివ్‌గా తేలడంతో హోం క్వారంటైన్‌కు వెళ్లారు. మరోవైపు జిల్లాలో ఆదివారం కూడా మరొకరు కరోనాకు గురై మృతి చెందినట్లు చెబుతున్నారు. పోలీస్‌ శాఖలోనూ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. చీరాల రూరల్‌ సీఐతోపాటు అక్కడ ఎస్సై, తాళ్లూరు ఎస్సైతోపాటు ఆయా ప్రాంతాల్లో కానిస్టేబుళ్లు కరోనా బారిన పడ్డారు. 

Updated Date - 2021-04-12T15:56:44+05:30 IST