వేడుకతో కరోనా..మరణ యాతన!

ABN , First Publish Date - 2021-06-16T09:31:38+05:30 IST

కరోనా సమయంలో వివాహ వార్షికోత్సవం జరపడం తగదంటూ సన్నిహితులు సూచించినా వారికి పట్టలేదు.

వేడుకతో కరోనా..మరణ యాతన!

  • ఆర్భాటంగా వివాహ వార్షికోత్సవం
  • కరోనాతో ఇంటిపెద్ద, తల్లి, సోదరి మృతి
  • ముగ్గురి చికిత్సకు రూ.కోటికి పైగానే... 

శంషాబాద్‌ రూరల్‌, జూన్‌ 15: కరోనా సమయంలో వివాహ వార్షికోత్సవం జరపడం తగదంటూ సన్నిహితులు సూచించినా వారికి పట్టలేదు. ఓ ఫంక్షన్‌ హాల్లో ఆర్భాటంగా వేడుకను నిర్వహించారు. అక్కడికి పిలువని అతిథిలా విచ్చేసిన మాయదారి కరోనా వైరస్‌, ఆ కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకుంది.ఈ ముగ్గురూ నెలరోజుల్లో ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం తొండుపల్లిలో ఈ విషాద ఘట న జరిగింది. గ్రామానికి చెందిన పెదిరిపాటి సుభా్‌షగౌడ్‌(50), చంద్రిక దంపతులు! వీరు తమ 25వ వివాహవార్షికోత్సవ వేడుకను గత ఏప్రిల్‌ 28న ఓ ఫంక్షన్‌ హాల్లో నిర్వహించారు. ఒకట్రెండు రోజులకే సుభాష్‌ తల్లి సులోచన(70)కు, భార్య చంద్రికకు, ముగ్గురు కుమారులకు, చెల్లెలు లావణ్య(45)కు కరోనా సోకింది. మే 1న సులోచనను ఆస్పత్రికి తరలించగా అదేనెల 12న ఆమె మృతిచెందారు. కొన్ని రోజులకే సుభాష్‌ అస్వస్థతకు గురయ్యారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్‌ 8న ఆయన మృతి చెందారు. తర్వాత ఆరు రోజులకే అంటే జూన్‌ 14న ఆయన సోద రి లావణ్య కూడా మృతి చెందారు. మిగతా నలుగురు కరోనా నుంచి కోలుకున్నారు. చనిపోయిన ముగ్గురి చికిత్సకు రూ.కోటికి పైగానే ఖర్చయిందని, అయినా ప్రాణా లు దక్కలేదని కుటుంబీకులు రోదిస్తూ తెలిపారు.  

Updated Date - 2021-06-16T09:31:38+05:30 IST