ప్లాస్టిక్‌ ఉత్పత్తి చేసే సంస్థలపై కేసులు

ABN , First Publish Date - 2021-04-18T05:07:30+05:30 IST

నగర పరిధిలో ప్లాస్టిక్‌ ఉత్పత్తి చేసే సంస్థలను గుర్తించి సీజ్‌ చేసి కేసులు నమోదు చేయాలని ప్రజారోగ్య అధికారులను కమిషనర్‌ చల్లా అనురాధ ఆదేశించారు.

ప్లాస్టిక్‌ ఉత్పత్తి చేసే సంస్థలపై కేసులు

గుంటూరు(కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 17: నగర పరిధిలో ప్లాస్టిక్‌ ఉత్పత్తి చేసే సంస్థలను గుర్తించి సీజ్‌ చేసి కేసులు నమోదు చేయాలని ప్రజారోగ్య అధికారులను కమిషనర్‌ చల్లా అనురాధ ఆదేశించారు.   రోడ్లు, కాలువల్లో చెత్త వేసే వారి నుంచి, నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగం, విక్రయించే వారి నుంచి  జరిమానా వసూలు చేసేందుకు ఏర్పాటు చేసిన బృందాలు, అధికారులతో శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. నగరంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించాలని, ఈ దిశగా ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులపై నిషేధం ఉన్నందున వాటి వినియోగం, ఉత్పత్తి చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ వెంకటకృష్ణయ్య, ఎంహెచ్‌వో  డాక్టర్‌ వెంకటరమణ, ఎస్‌ఎస్‌లు రాంబాబు, ఆనందకుమార్‌, శానిటేషన్‌ ఓఎస్‌డీ యేసుదాసు తదితరులు పాల్గొన్నారు.

ఆక్రమణలను తొలగించాలి

రోడ్ల పక్కన, కాలువలు మీద ఉన్న ఆక్రమణలను యుద్ధ ప్రాతిపదికను తొలగించాలని కమిషనర్‌ చల్లా అనురాధ అధికారులను ఆదేశించారు. కొరిటెపాడు, ఆంజనేయపేట, అరుంధతినగర్‌ ప్రాంతాల్లో శనివారం పర్యటించి అధికార్లకు పలు ఆదేశాలు జారీ చేశారు.  ప్రభుత్వ భవనాలు, గోడలపై పోస్టర్లు  అంటించే వారిపై పోలీస్‌ కేసులు నమోదు చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. కొరిటెపాడు చెరువును పరిశీలించి పరిసరాలను ప్రతి రోజు శుభ్రం చేయాలని ప్రజారోగ్య అఽధికారులను ఆదేశించారు.    ట్రాక్‌ చుట్టు పక్కల గృహాలవారు కాలువలోకి  సెప్టిక్‌ ట్యాంక్‌ కనెక్షన్‌ వదిలారని, వాటిని వెంటనే తొలగించాలని లేకుంటే నోటీసులు ఇవ్వాలన్నారు. ట్రాక్‌ వెంబడి మొక్కలు నాటడం, సంరక్షించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న సీనియర్‌ సిటిజన్‌ రత్తయ్యని కమిషనర్‌ అభినందించారు. ఆంజనేయపేటలో డ్రెయిన్లకు సంబంధించిన పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరావు, డీఈ శ్రీనివాసరెడ్డి, ఏఈ ఆనూష, 44వ డివిజన్‌ కార్పొరేటర్‌ వంగల హేమలత, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ దూపాటి ప్రసాద్‌, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-18T05:07:30+05:30 IST