వారు.. ఓటు వేయరు

ABN , First Publish Date - 2021-03-12T05:51:29+05:30 IST

ఓటు హక్కు ప్రతిఒక్కరి సామాజిక బాధ్యత. ఓటు హక్కు వినియోగంపై అధికారులు ప్రత్యేకంగా అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.

వారు.. ఓటు వేయరు

అపార్టుమెంట్ల నుంచి కిందికి దిగని వైనం

ఆ ఐదు డివిజన్లలో 50 శాతం కంటే తక్కువ పోలింగ్‌

ఓటు వేయడంపై ఆసక్తి చూపని సంపన్నులు, విద్యావంతులు

గుంటూరు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఓటు హక్కు ప్రతిఒక్కరి సామాజిక బాధ్యత. ఓటు హక్కు వినియోగంపై అధికారులు ప్రత్యేకంగా అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. అయినా ఓటు సామాజిక బాధ్యత అన్న విషయాన్ని కొందరు విస్మరిస్తున్నారు. అలా విస్మరించే వారిలో విద్యావంతులు ఉండటం విషేషం. ఓటుహక్కు నమోదు చేసుకునే విషయంలో చూపిస్తోన్న శ్రద్ధ ఎన్నికల సమయంలో ఓటు వేయడంపై చూపించకపోతుండటం విమర్శలకు దారి తీస్తోన్నది. నిరక్షరాస్యులు, పేదరికంలో ఉండే ఓటర్లు చూపించిన ఛైతన్యం ఈ ప్రాంతాల్లో కనిపించకపోవడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో సంపన్నులు, విద్యావంతులు చైతన్యవంతులు కాలేకపోయారు. గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని మురికివాడలు, విలీన గ్రామాల్లోని ఓటర్లు ఎంచక్కా ఉదయాన్నే పోలింగ్‌ బూత్‌ల వద్దకు వచ్చి ఓటు వేసి సామాజిక బాధ్యతని నిర్వర్తించారు. అయితే నగర పరిధిలోని ఐదు డివిజన్లలో ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి కనబరచలేదు. అపార్టుమెంట్లు, డ్యూప్లెక్స్‌ గృహాల్లో నివాసం ఉండే చాలామంది ఓటు వేయడానికి తమ ఫ్లాట్లలో నుంచి కదలలేదు. మునిసిపల్‌ ఎన్నికలే కాదు ఏ ఎన్నికలు వచ్చినా ఇదే వైఖరిని ఆయా డివిజన్లలోని ఓటర్లు ప్రదర్శిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో బుధవారం జరిగిన ఎన్నికలో 32, 33, 35, 37, 42 డివిజన్లలో 50 శాతం కంటే తక్కువగా పోలింగ్‌ నమోదైంది. దీంతో ఆ డివిజన్లు ఏ ప్రాంతాల్లో ఉన్నాయా అని అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు ఆరా తీశారు. చివరికి అవన్ని పోష్‌ ఏరియాలు అని తెలుసుకొని నోళ్లు వెళ్లబెట్టారు. బ్రాడీపేట అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది విద్యావంతులు నివసించే ప్రాంతమని.  ఈ డివిజన్‌ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కూడా విద్యావంతులే. అయినప్పటికీ పోలింగ్‌ శాతం 48.57గా నమోదైంది. ఇదేవిధంగా బ్రాడీపేట ఎక్స్‌టెన్షన్‌, పండరీపురం, అశోక్‌నగర్‌ తదితర ప్రాంతాలు కలిగిన 33వ డివిజన్‌లోనూ ఓటర్లు ఆసక్తి చూపలేదు. ఇక్కడ 9,554 ఓట్లు ఉండగా అందులో 4,663(48.81 శాతం) మాత్రమే పోలింగ్‌ అయ్యాయి. ఈ ప్రాంతాల్లోనూ ఎక్కువ మంది విద్యావంతులు, సంపన్నులే ఉన్నారు. పట్టాభిపురం పరిసర ప్రాంతాల పరిధి కలిగిన 35వ డివిజన్‌లో కూడా పోలింగ్‌ 49.58 మాత్రమే నమోదైంది. ఈ డివిజన్‌లోనూ విద్యావంతులే అధిక సంఖ్యలో ఉన్నారు. చంద్రమౌళీనగర్‌, బృందావన్‌గార్డెన్స్‌ తదితర ప్రాంతాలు కలిగిన 37వ డివిజన్‌లో 48.94 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ ప్రాంతాలు కూడా బాగా అభివృద్ధి చెందినవేనన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా విద్యానగర్‌లో కొంతభాగం, నవభారత్‌నగర్‌, ఎస్‌వీఎన్‌ కాలనీ తదితర ప్రాంతాలు కలిగిన 42వ డివిజన్‌లో అతి తక్కువగా కేవలం 47.19 శాతం మంది ఓటర్లే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. 


Updated Date - 2021-03-12T05:51:29+05:30 IST