కర్షకులపై ‘కార్పొరేట్‌’ పంజా

ABN , First Publish Date - 2020-09-23T06:28:38+05:30 IST

మన దేశంలోని మొత్తం జనాభాలో సుమారు 60 శాతం మందికి పైగా ప్రజలకు వ్యవసాయరంగం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీవనాధారంగా ఉంది. 70శాతం మంది గ్రామీణ...

కర్షకులపై ‘కార్పొరేట్‌’ పంజా

పంజాబ్‌, రాజస్థాన్‌, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలలో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమిస్తున్నారు. మరో పక్క ఆలిండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ (ఏఐకెఎఫ్‌సీసీ) దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. రైతుల ఉద్యమానికి వివిధ కార్మిక సంస్థలు, ప్రజాసంఘాలు మద్దతు పలకడం శుభసూచకం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో సైతం పార్టీలకు అతీతంగా రైతుసంఘాలు, అనుబంధ సంస్థలు కలిసి సంఘటితంగా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది.


మన దేశంలోని మొత్తం జనాభాలో సుమారు 60 శాతం మందికి పైగా ప్రజలకు వ్యవసాయరంగం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీవనాధారంగా ఉంది. 70శాతం మంది గ్రామీణ ప్రజలు ఇప్పటికీ వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్నారు. సాగుచేస్తున్నవారిలో 82శాతం మంది చిన్న సన్నకారు రైతులే. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఈ రంగం వాటా 18శాతంగా ఉందంటే మన ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిలో దీనికున్న ప్రాధాన్యమేమిటో తెలుసుకోవచ్చు. ఒక పక్క కరోనా ప్రభావంతో ఆర్థికరంగం స్తంభించి, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి, జీవనోపాధి మార్గాలు మూసుకుపోయి, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో దేశ ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటిదాకా బ్యాంకులు, బొగ్గు గనులు, బీమా సంస్థలు, రైల్వేలు వంటి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించి దేశ సంపదను కార్పొరేట్‌ రంగానికి దోచిపెడుతున్న నరేంద్ర మోదీ సర్కారు కన్ను ఇప్పుడు వ్యవసాయంపై పడింది. రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొల్లగొట్టడానికి బడా వ్యాపారులకు అవకాశం కల్పిస్తూ దొడ్డిదారిన నల్లచట్టాలను తీసుకువచ్చింది. వీటి ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, పంట ఉత్పత్తులను స్వేచ్చÛగా ఎక్కడికైనా తీసుకుపోయి నచ్చిన ధరకు విక్రయించుకోవచ్చంటూ ప్రధాని సహా కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రచారం వాస్తవ విరుద్ధం. ఈ చట్టాల వల్ల రైతులకు మేలు జరగడం కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది. ఇప్పటిదాకా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు ప్రధానంగా మార్కెట్‌యార్డుల్లోనే జరిగేవి. కానీ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులతో ఆ ఉత్పత్తుల అమ్మకాలు, -కొనుగోళ్ల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ఇంకో బిల్లుననుసరించి ప్రైవేట్‌, కార్పోరేట్‌ కంపెనీలు ప్రత్యక్షంగా రైతులతో ఒప్పందం చేసుకోవచ్చు. ప్రభుత్వానికే తమ ఉత్పత్తులను అమ్మాలన్న నిబంధన ఏమీ లేదు. అయితే ప్రైవేట్‌ కంపెనీలు క్రమంగా వ్యవసాయ రంగాన్ని కూడా ఆక్రమిస్తే భవిష్యత్తులో ఎన్నో రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి.


మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం, విక్రయ బిల్లు (ది ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ కామర్స్‌, ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటీస్‌) వల్ల దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్‌యార్డులు ఉనికి కోల్పోతాయి. సెస్‌, బహిరంగ వేలం వంటి నిబంధనలేవీ పాటించాల్సిన అవసరం లేకుండా బడా వ్యాపారులు, పెద్దపెద్ద వర్తకులు నేరుగా రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తోంది. ప్రైవేట్‌ కంపెనీలు నిర్ణయించే ధరలకే పంటలు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొదట్లో మార్కెట్‌యార్డుల కంటే కొంత మేర ఎక్కువ ధరకు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసినా నాణ్యతా లోపం, డిమాండ్‌ లేదన్న కుంటిసాకులు చూపి ఈ కంపెనీలు ధరలు తగ్గించేయడం ఖాయం. అదే జరిగితే రైతులకు కనీస మద్దతుధర కూడా దక్కదు. రైతులు ప్రభుత్వ సంస్థలకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉండదు. దేశంలో ఎక్కువమంది చదువుకోని రైతులే ఉన్నందున ప్రైవేట్‌ కంపెనీలతో లావాదేవీలు నెరపడం వారికి కష్టమవుతుంది. ఇక రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకే పంటను అమ్ముకుంటే మార్కెట్‌యార్డులు నిర్వీర్యమై ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా రాదు. కార్పొరేట్లు తమ లాభాల కోసమే వ్యాపారం చేస్తాయి కానీ రైతులు, వినియోగదారుల ప్రయోజనాల కోసం కాదన్న నిజాన్ని ప్రభుత్వం కాదనగలదా? 


ఇక ఉత్పత్తుల ధరలు, సాగు సేవలపై రైతుల సాధికారిత ఒప్పందం (ది ఫార్మర్స్‌ ఎంపవర్‌మెంట్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌) బిల్లు ద్వారా రైతులు పంట దిగుబడికి ముందే వ్యాపారులతో ఒప్పందం చేసుకోవచ్చు. అయితే పంట చేతికొచ్చాక ఏదో కారణం చెప్పి, వంకలు చూపి వ్యాపారులు ధరలు తగ్గిస్తే రైతులకు వేరే దిక్కుండదు, అడిగే నాథుడు ఉండడు. ప్రమాదకరమైన ఈ బిల్లుననుసరించి అంబానీ, ఆదానీ, వాల్‌మార్ట్‌ వంటి పెద్దపెద్ద కార్పొరేట్లకు రైతుల నుంచి భూమి సేకరించి ఇస్తే.. వాళ్లు అధునాతన పద్ధతుల్లో కాంట్రాక్టు వ్యవసాయం చేస్తారు. రైతులకు సంవత్సరాని కొకసారి కౌలు మాత్రం చెల్లిస్తారు. ఈ చట్టం రైతును తన సొంత భూమిలోనే పని చేసే కూలీగా మారుస్తుంది. 


కేంద్ర ప్రభుత్వం చేసిన మరొక నిర్వాకం 1955 నాటి అత్యవసర సరకుల చట్టానికి సవరణలు. దీనివల్ల ధాన్యం, పప్పులు, నూనె గింజలు, వంటనూనెలు, బంగాళాదుంపల వంటి నిత్యావసరాల ఎగుమతులపై ఇప్పటివరకున్న ఆంక్షలు తొలగిపోతాయి. దీన్ని ఆసరాగా చేసుకొని బడా వ్యాపారులు, సంస్థలు పంట సీజనులో రైతుల నుంచి పెద్ద ఎత్తున తక్కువ ధరకు ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటిని గోడౌన్‌లలో నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు తిరిగి అమ్ముకుంటారు. దీనిని నియంత్రించేందుకు ప్రభుత్వానికి ఆస్కారం లేకుండా పోతుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాలపై మరికొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఒకవేళ -ప్రైవేట్‌ వ్యాపారుల వ్యవస్థ బలపడితే వ్యవసాయ సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రభుత్వం పట్టించుకుంటుందా? కష్టకాలంలో రుణాలిచ్చి ఆదుకుంటుందా? రాష్ట్రాల పరిధిలో అమలవుతున్న రైతు బంధు, రైతు ఆసరా లాంటి పథకాలు కొనసాగుతాయా? అన్నింటికి మించి పౌర సరఫరాలపై ప్రభావం పడదా? చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు నిత్యావసరాలను అందించడం కొనసాగుతుందా? వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మోదీ సర్కారు అసమర్థ, స్వార్థపూరిత విధానాల వల్ల దేశ ఆర్థికవ్యవస్థ కార్పొరేట్‌ శక్తుల్లోకి వెళ్లిపోతుంది. అటు రైతులు, ఇటు వినియోగదారులను బడా వ్యాపారులు నిలువునా దోచుకోవడం ఖాయం.


మోదీ సర్కారు తీసుకొచ్చిన ఈ వ్యవసాయ సంబంధిత బిల్లులకు ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ, టీడీపీ మద్దతు పలకడం అత్యంత బాధాకరం. ప్రత్యేక హోదా సహా విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు అందించాల్సిన సహాయ సహకారాల విషయంలో మొండి చేయి చూపించిన మోదీ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్న ఈ రెండు పార్టీలు రైతులకు చేటు కలిగించే మోదీ సర్కారుపై ప్రేమ చూపడానికి కారణమేమిటి? రైతులే కాదు యావత్తు దేశానికి ప్రమాదకరమైన నిర్ణయాలను ఈ రెండు పార్టీలు ఏ విధంగా సమర్థిస్తాయో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మోదీని ధిక్కరిస్తే కేసులు పెట్టి వేధిస్తారని ప్రధాన ప్రతిపక్షం, ఉన్న కేసుల్లోనే బెయిల్‌ను రద్దు చేయించి జైల్లోకి తోస్తారని అధికారపక్ష అధినేతలు భయపడుతున్నారని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ బిల్లులను బీజేపీ మిత్రపక్షాలే తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి ఇక్కడ గమనార్హం. బీజేపీకి చిరకాల మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హర్‌ సిమ్రత్‌ కౌర్‌ ఏకంగా కేంద్రమంత్రి పదవికే రాజీనామా చేశారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. గతంలో దళారీల దయాదాక్షిణ్యాలపై రైతులు బతికారని, ఈ బిల్లుల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుందని వైసీపీకి చెందిన ముఖ్యనేత రాజ్యసభలో మాట్లాడటం సిగ్గు చేటు. ఇప్పటివరకు చిన్నచిన్న దళారులు రైతులను మోసం చేస్తుంటే ఇప్పుడు కార్పొరేట్‌ కంపెనీలు రైతులను నిట్ట నిలువునా ముంచడానికి మోదీ ప్రభుత్వం ద్వారాలు తెరుస్తున్న విషయం ఆయనకు తెలియలేదా? మార్కెట్‌ కమిటీల కంటే కార్పొరేట్‌ శక్తులే అత్యంత ప్రమాదకారులని ఆయన గుర్తెరగాలి. ఈ బిల్లుల ద్వారా రాష్ట్రాల జాబితాలోని వ్యవసాయ మార్కెట్‌ రంగాలపై కేంద్రం తన పెత్తనాన్ని ఖరారు చేసుకుంది. అందుకే ఈ బిల్లును బీజేపీ యేతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నపాటి కనీస అవగాహన కూడా లేకుండా ఆంధ్రాలోని అధికార వైసీపీ మోదీ సర్కారు నిర్ణయాలకు మద్దతు పలకడం ఏ విధంగా చూసినా సమర్థనీయం కాదు.


ఇప్పటికే పంజాబ్‌, రాజస్థాన్‌, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలలో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమిస్తున్నారు. మరో పక్క ఆలిండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ (ఏఐకెఎఫ్‌సీసీ) దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. రైతుల ఉద్యమానికి వివిధ కార్మిక సంస్థలు, ప్రజాసంఘాలు మద్దతు పలకడం శుభసూచకం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో సైతం పార్టీలకు అతీతంగా రైతుసంఘాలు, అనుబంధ సంస్థలు కలిసి సంఘటితంగా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్న తరుణంలో రాష్ట్రపతి వ్యవసాయ బిల్లులపై ఆమోదముద్ర వేయకుండా మంచి నిర్ణయం తీసుకోవాలి.

కొలనుకొండ శివాజీ

కృష్ణాడెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్‌

Updated Date - 2020-09-23T06:28:38+05:30 IST