ltrScrptTheme3

కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలు అందించాలి

Nov 25 2021 @ 00:15AM

ములుగు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

ములుగు కలెక్టరేట్‌, నవంబరు 24: కార్పొరేట్‌ స్థాయికి దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్య అన్నారు. జిల్లా కేంద్రంలోని సామాజిక వైద్యశాలను ఆయన బుధవారం సందర్శించారు.  డీఎంహెచ్‌వో డాక్టర్‌ అల్లెం అప్పయ్య ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న గైనకాలజిస్టుల సేవలను గుర్తించి అదనపు అలవెన్సులు అందిస్తామని అన్నారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ వైద్య సేవలందించాలన్నారు. శానిటేషన్‌ సమస్య తలెత్తకుండా చూడాలని, సెక్యూరిటీగార్డును నియమించి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని సూపరింటెండెంట్‌ జగదీశ్‌ను ఆదేశించారు. అనంతరం ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు, స్టాఫ్‌నర్సుల నియామకం,  ల్యాబ్‌ టెక్నీషియన్ల సంఖ్య తదితర అంశాలను చర్చించారు. అదేవిధంగా గట్టమ్మ దేవాలయం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్‌ భవనం సమీపంలో కొత్త ఏరియా ఆస్పత్రి నిర్మాణం కోసం పదెకరాల స్థలం కేటాయిస్తూ రూ.40కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అందులో రూ.10కోట్లు ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాల కోసం కేటాయించినట్టు చెప్పారు. కొవిడ్‌తో చనిపోయిన వారికి ప్రభుత్వపరంగా అందించే సహాయ సహకారాలపై జిల్లాలో ఇప్పటి వరకు 100 దరఖాస్తులు అందాయని అన్నారు. వాటి ఆధారంగా మెడికల్‌ ఆఫీసర్లు గ్రామాల్లో పరిశీలన చేపట్టాలన్నారు. టీఎస్‌ఎంఐడీసీ నుంచి ఆస్పత్రులకు మందుల సరఫరాలేని పక్షంలో ప్రైవేట్‌ నుంచి కొనుగోలు చేయాలన్నారు. కార్పొరేట్‌ స్థాయిలో అన్ని సదుపాయాలు కల్పించుకోవాలని ఆయన సూచించారు. కొవిడ్‌ నుంచి ప్రజలను రక్షించడం కోసం వ్యాక్సినేషన్‌ అందించడం పట్ల వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలను ఆయన అభినందించారు.  ఈ సమావేశంలో ఏటూరునాగారం సీహెచ్‌ఎస్‌ సూపరింటెండెంట్‌ సురేష్‌, డీసీహెచ్‌ జాన్సన్‌, వైద్యాధికారులు, స్టాఫ్‌ నర్సులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.