కంత్రీ కార్పొరేటర్లు

Sep 26 2021 @ 23:37PM

అవినీతికి పాల్పడుతున్న కొందరు కార్పొరేటర్లు

రౌడీషీటర్లను తలదన్నేలా దందాలు.. సెటిల్‌మెంట్లు...

కబ్జా కోసం ప్రభుత్వ స్థలాలపై ఆరా...

కొత్తగా ఇల్లు కట్టుకుంటే డబ్బుల కోసం బెదిరింపులు

బెంబేలెత్తిపోతున్నా వరంగల్‌ నగరవాసులు

వరంగల్‌, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): అధికార మాటున కొందరు కార్పొరేటర్లు రెచ్చిపోతున్నారు.. దందాలు, సెటిల్‌మెంట్లతో పేట్రేగిపోతుండడంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.  వరంగ ల్‌ నగర పాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ భూములను పరిరక్షించా ల్సిన సదరు నేతలే నకిలీ రికార్డులను సృష్టించి కబ్జాకు పాల్పడు తున్నారు. డివిజన్లలో కొత్త ఇల్లు నిర్మాణం మొదలు పెట్టారంటే చాలు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు కొందరు నేతలు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అన్నీ సక్రమంగానే ఉన్నా కూడా వారికి ముట్టజెప్పనిదే పర్మిషన్‌ రాని దుర్భరమైన పరిస్థితి బల్దియాలో తయారైంది. అధికారం తమదేననే భావం పెరిగి గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో ఖాళీ స్థలాల్లో పేచీలు పెట్టడం, ఆ తర్వాత సెటిల్‌మెంట్ల పేరుతో రంగంలోకి దిగి దండుకోవడం బాగా పెరిగిపోయింది. గతంలో వరంగల్‌ నగరంలో రౌడీలు, డీల్‌ చేసి గుండాయిజం చేసేవాళ్లు, ఇప్పుడు కొందరు డివిజన్‌ అలానే తయారయ్యారు. కొన్ని డివిజన్లలో రౌడీషీటర్లే కార్పొరేటర్ల దగ్గరకు వెళ్లి జీ హుజూర్‌ అంటున్న సంఘటనలు జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. భూ దందాలు, ఆర్థిక సంబంధమైన సెటిల్‌మెంట్లతో నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు కొంత మంది కార్పొరేటర్లు వారి పరిధిలోని ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు సంబంధిత రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌ తూర్పుతో కొత్తగా వరంగల్‌ జిల్లా ఏర్పాటు కావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొంత మంది కార్పొరేటర్లు నగరంలోని ప్రభుత్వ ఖాళీ స్థలాలను కబ్జా చేసేందుకు అన్ని విధాలా ప్రణాళికలు రచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

సెటిల్‌మెంట్లు, ఆర్థిక పరమైన దందాలు..

వరంగల్‌ నగరంలోని కొంతమంది కార్పొరేటర్లు గెలిచిందే తడవుగా సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డివిజన్‌లోని సమస్యలు చెప్పుకునేందుకు సమయం ఇవ్వకుండా సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం దందాలు, సెటిల్‌మెంట్లు, పంచాయతీలతో కార్పొరేటర్ల కార్యాలయాలు కిట కిటలాడుతున్నట్లు వారు చెబుతున్నారు. కొందరి పరిస్థితి ఉదయం లేచిన దగ్గరి నుంచి పడుకునే వరకు నిత్యం భూ సంబంఽధిత వ్యవహారాలతోనే కాలం వెల్లదీస్తున్నారనే ఆపవాదు కూడా వినిపిస్తోంది. 

ఖాళీ స్థలాలపై కన్ను ..

కొంత మంది కార్పొరేటర్లు కొత్త తరహా అక్రమాలకు తెరలేపుతున్నారు. వారి పరిధిలోని ఖాళీ ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్నారు. ఏళ్ల తరబడి నిరాదరణకు గురైన పార్కు స్థలాలు, కమ్యూనిటీ భవనాలకు కేటాయించిన స్థ లాలను గుర్తించి వాటిని కబ్జా చేసేందుకు పక్కా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. అయిదేళ్లకాలంలో కనీసం అయిదు స్థలాలైన కబ్జా చేయకపోతే ఎలా అని ఓ కార్పొరేటర్‌ తన అనుచరులతో అంటున్నాడంటే ఎంతకు తెగించారో తెలుస్తుంది. 

ఖర్చు చేసింది.. సంపాదించాలిగా..

ఎన్నికల్లో ఖర్చు చేసింది సంపాదించాలి కదా అని బాహాటం గానే కొంత మంది  కార్పొరేటర్లు అంటున్నట్లు వారి అనుచర వర్గమే చెబుతోంది. ఖర్చు చేసిన దానికి కనీసం 100 రెట్లు సంపాదించేందుకు అన్ని మార్గాలను వెతుకుతున్నట్లు తెలుస్తోం ది. ప్రతీ సేవకు సర్వీస్‌ చార్ట్‌ ఉంటుంది కదా అని మరో కార్పొ రేటర్‌ అంటున్నట్లు ఆయన దగ్గరకు వెళ్లిన వారు చెబుతు న్నారు. డివిజన్లలో ఇళ్లు నిర్మించుకోవాలనుకుంటే ముందుగా కా ర్పొరేటర్‌ను ప్రసన్నం చేసుకోవాల్సిందేనని హుకూంలు జారీ చేస్తున్న పరిస్థితులను స్థానిక ప్రజలు చవిచూస్తున్నారు. 

ఇవీ ఆగడాలు...

వరంగల్‌ ప్రాంతంలో ఓ భూమి విషయంలో అడ్వకేట్‌ ద్వారా నోటీసులు అందుకున్న ఓ నేత, తనకే నోటీసులు పంపుతావంటూ సదరు వ్యక్తిపై దాడి చేసిన ఘటనలున్నాయి. దీనికి తోడు గెలిచిందే మొదలు తన పరిధిలోని ఖాళీ ప్రభుత్వ స్థలాల వివరాలు సేకరించే పని కోసం కొందరిని నియమించుకున్నట్లు తెలుస్తోంది. సదరు కార్పొరేటర్‌కు అండగా కొందరు రెవెన్యూ అధికారులు కబ్జాలకు ‘సిద్ధం’గా ఉంటున్నట్టు తెలిసింది. సిబ్బందిని మచ్చిక చేసుకుంటూ ఎక్కడెక్కడ ఖాళీ  ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, వాటిని కబ్జా చేస్తే ఎలాంటి లిటిగేషన్లు వస్తాయనో తెలుసుకొని మరీ పక్కాగా రంగంలోకి శాకరాసికుంట ప్రాంతంలో ఓ నేత దందా నడుపుతున్నట్టు సమాచారం.  

- కార్పొరేటర్లు నగరంలో వారి వారి డివిజన్లలో నియంతల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ కార్పొరేటర్‌ తన పరిధిలో అత్యంత విలాసవంతమైన కాలనీలు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ప్రతీ ఇంటి నిర్మాణదారున్ని తనను ప్రసన్నం చేసుకోవాలి బాబు అంటూ హుకూం జారీ చేస్తున్నట్టు ఆ ప్రాంతంలో ప్రచారంలో ఉంది. 

- బ్యాంకుల్లో పనిచేసే వాళ్లుండే కాలనీలో మరో కార్పొరేటర్‌ దందా మరోలా ఉంది. తమ సోదరుడు పైస్థాయిలో ఉండడంతో ఆయన సెటిల్‌మెంట్లు, భూదందాలు, పంచాయతీలకు కొదవలేకుండా పోయింది. ఆ నేత చెప్పినట్లు వినకపోతే భౌతిక దాడి చేయిస్తానని హెచ్చరిస్తుండడం ఆయన దౌర్జన్యానికి పరాకాష్ట. 

- కొందరు ప్రజాప్రతినిధులు బడాబాబులను గుర్తించి దండకుంటుంటే మరో ప్రజాప్రతినిధి మాత్రం గుడిసె వాసులపై పడిపోతున్నాడనే ఆరోపణలున్నాయి. ప్రతీ గుడిసె నుంచి ఇప్పటికీ వసూళ్ల పర్వం కొనసాగిస్తుండగా, ఈ పాపపు పనికి స్థానిక ప్రజాప్రతినిధి అండ ఉందంటూ బహిరంగంగానే ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ సెటిల్‌మెంట్లు చేస్తున్నాడని తెలుస్తోంది.

- ప్రతి ఏటా ఉత్సవాలు జరిగే ప్రాంతంలోని ఓ ప్రజాప్రతినిధి పరిస్థితి దారుణంగా ఉంది. తనకు సహకరించే అధికారులకు వారు కొరుకున్న విలాసవంతమైన సౌకర్యం అందించడంలో దిట్ట. తన దారికి అడ్డువచ్చే వారికి బలహీనతలను తెలుసుకొని వాటిని సమకూర్చే పని చేస్తూ బ్రోకర్‌గా మారాడంటూ ప్రచారం జరుగుతోంది. 

Follow Us on: