Advertisement

కార్పొరేట్స్, క్విట్ ఇండియా

Aug 8 2020 @ 01:36AM

కేంద్రం తెచ్చిన మూడు ఆర్డినెన్సులను వ్యతిరేకిస్తూనే, కార్పొరేట్లకు ప్రత్యామ్నాయంగా రైతు సహకార సంఘాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. వ్యవసాయ కుటుంబాల ఆదాయ భద్రతకు నిజమైన ప్రత్యామ్నాయం ఇదొక్కటే. వ్యవసాయ రంగంలో కార్పొరేట్లను అనుమతించడం ఎంతమాత్రమూ కాదు.


భారత్ నుంచి బ్రిటీష్ పాలకులు వైదొలగాలని ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి ఆనాడు (1942 ఆగస్టు 9) స్వాతంత్ర్య సమరయోధులు పిలుపు ఇచ్చారు. దేశమంతా ఈ నినాదంతో కదలి కదన రంగంలోకి దూకింది. 1947 ఆగస్టు 15 నాటికి దేశం నుంచి బ్రిటీష్ పాలకులు వైదొలిగే వరకూ ఈ ఉద్యమాలు సాగాయి. నాటి ప్రజల లక్ష్యం ఒక్కటే. స్వపరిపాలన, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సుస్థిర అభివృద్ధి, దేశం అన్ని రంగాలలో స్వయం సమృద్ధి సాధించడం. గత 73 సంవత్సరాలుగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతో దేశంలో మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ కొనసాగింది. మరీ ముఖ్యంగా మొదటి 43 సంవత్సరాలు ప్రభుత్వ రంగం ఉనికిలో ఉండడం వల్ల అనేక ఉత్పత్తులు, సేవలు ప్రజలకు చవక ధరలకు అందాయి. ప్రజల మౌలిక సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించకపోయినా వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వ రంగం తగినంత కృషి చేసింది. 1991 నుండీ దేశంలో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయడం, అమ్మేయడం గత 30 ఏళ్లలో విపరీతంగా జరిగింది. ఈ విధానాల వల్ల బాగుపడిన వాళ్ళు కొందరైతే, మరింత పేదరికంలోకి జారిపోయిన వాళ్లు అత్యధికులు. మధ్యతరగతి ప్రజలకు కొన్ని అవకాశాలు దక్కాయి కానీ, పట్టణ పేదలు, గ్రామీణ వ్యవసాయదారులు నిజమైన అభివృద్ధికి దూరంగా ఉండిపోయారు. 


నిజానికి 1960 దశకంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఏర్పడ్డాయి. ఒక పాతిక సంవత్సరాల పాటు ఈ సంఘాలు రైతులను సంఘటితం చేశాయి. రైతులకు సేవ చేశాయి. పంట రుణాలు ఇవ్వడమే కాదు, వ్యవసాయ ఉపకరణాలు రైతులకు అందించాయి. గిడ్డంగులు నిర్వహించాయి. రేషన్ షాపులు నడిపాయి. తెలంగాణలో పొతంగల్, ఎత్తొండ లాంటి గ్రామాల రైతు సహకార సంఘాలు రైతుల సేవలో మంచి గుర్తింపు, అనేక అవార్డులు సాధించాయి. రెండు రాష్ట్రాలలో నిజాయితీ కలిగిన నాయకత్వం ఉన్నచోట ఈ సంఘాలు అద్భుత ఫలితాలు సాధించాయి. ప్రభుత్వాల అనుచిత జోక్యం, రాజకీయ పార్టీల దివాళాకోరు వైఖరి ఈ సహకార సంఘాల ప్రాణం తోడేశాయి. తమ వాళ్ళు సహకార సంఘాల పాలక వర్గంగా ఉండాలనే ఆలోచనతో, ఈ సంఘాల ఎన్నికలను సాధారణ ఎన్నికల స్థితికి దిగజార్చేశారు. క్రమంగా రైతుల భాగస్వామ్యం సంఘాల నిర్వహణలో తగ్గిపోయింది. 


1995లో పరస్పర సహాయ సహకార సంఘాల చట్టం క్రింద రెండు తెలుగు రాష్ట్రాలలో వందలాది రైతు, మహిళా సహకార సంఘాలు ఏర్పడ్డాయి. మహిళా స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో ఏర్పడిన మహిళా సహకార సంఘాలు ఒక మేరకు నిలదొక్కుకున్నా పూర్తిగా పురుషులతో ఏర్పడిన రైతు సహకార సంఘాలు తమ ఉనికిని పెద్దగా నిలబెట్టుకోలేకపోయాయి. ములకనూరు లాంటి కొన్ని సహకార సంఘాలు బలంగా ఎదిగినా, ఈ చట్టం కింద ఏర్పడిన రైతు సహకార సంఘాలకు కూడా ప్రభుత్వం నుండి పెద్దగా సహాయం అందలేదు. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, మత్స్యకారుల సహకార సంఘాలు కొంత విజయం సాధించాయి. ఇటీవల కాలంలో నాబార్డ్, సెర్ప్, ఉద్యానశాఖలు రెండు తెలుగు రాష్ట్రాలలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాయి.


1956 కంపెనీ చట్టంలో 2013లో తెచ్చిన సవరణతోనూ, మ్యాక్స్ చట్టం ప్రకారం ఈ సంఘాలు ఏర్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక సహకారంతో ఏర్పడుతున్న ఈ సంఘాలకు రిజిస్ట్రేషన్, నిర్వహణ, సామర్ధ్యం పెంపు కోసం నాబార్డ్ నుండి సహకారం అందుతున్నది. కానీ ఇప్పటికీ ఈ సంఘాలతో ఎలా వ్యవహరించాలో, ఎలాంటి సహకారం అందించాలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టంగా నిర్ణయించలేదు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు వేలకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, ఇరవై వేలకు పైగా రైతు, మహిళా పరస్పర సహాయ సహకార సంఘాలు, ఎనిమిది వందలకు పైగా రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పడ్డాయి. వంద మంది నుండి అయిదువేల మంది వరకు ఈ సంఘాలలో రైతులు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వాల వ్యవసాయ రంగ పథకాల నుండి, ఇతర సంస్థల సహకారంతోనూ ఈ సంఘాలు కొన్ని మౌలిక సౌకర్యాలను కూడా సమకూర్చుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రామీణ రైతులను, ఇతర ఉత్పత్తిదారులను ఈ సహకార సంఘాలు, కంపెనీలలోకి సమీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను రూపొందించగలితే, ఈ సహకార సంఘాలను, కంపెనీలను ప్రోత్సహిస్తున్న వివిధ సంస్థల మధ్య సమన్వయాన్ని సాధించగలిగితే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. గ్రామీణ ప్రాంతంలో, వ్యవసాయ యంత్రాలతో కూడిన కస్టమ్ హైరింగ్ సెంటర్లు, గిడ్డంగులు, శీతల గిడ్డంగులు ఈ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చెయ్యడానికి ప్రభుత్వం పెట్టుబడి పెట్టగలిగితే, ప్రభుత్వం పంటలను ఈ సంఘాల ఆధ్వర్యంలో సేకరించగలిగితే రైతుల ప్రధాన సమస్యలు పరిష్కారమవుతాయి.


రైతుల సమస్యలను పరిష్కరించడానికి సహకార సంఘాలను మరింత ప్రోత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వం, వాటి ప్రాథమిక ఉనికికే ప్రమాదం తెస్తూ, భారత వ్యవసాయ రంగాన్ని మరింతగా కార్పొరేట్ కంపెనీల కబంధ హస్తాల్లోకి నెట్టివెయ్యడానికి ఇటీవల మూడు ఆర్డినెన్సులను విడుదల చేసింది. ఈ ఆర్డినెన్సులు అమలులోకి వస్తే భారత రైతులు మరింత నష్టపోతారు. వారి పంటలకు మద్దతు ధరలు అందవు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రక్రియపై కంపెనీల పెత్తనం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా విదేశీ, స్వదేశీ బహుళజాతి సంస్థలు వ్యవసాయ రంగంపై పట్టు బిగిస్తాయి. ఫలితంగా దేశ ఆహార భద్రత, ఆర్థిక భద్రత ప్రమాదంలో పడుతుంది. ప్రజలు బానిసత్వంలోకి వెళ్లిపోతారు. సహజ వనరులు ఈ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఈ ప్రమాదాన్ని పసిగట్టి దేశవ్యాపితంగా రైతు, వ్యవసాయ కూలీ, ఆదివాసీ, దళిత, మహిళా సంఘాలు AIKSCC ఆధ్వర్యంలో 2020 ఆగస్టు 9న క్విట్ ఇండియా నినాదం స్ఫూర్తితో ‘కార్పొరేట్లు భారత్ నుండి వెళ్లిపోవాలి’ నినాదంతో ఆందోళనలకు పిలుపు ఇచ్చాయి. కేంద్రం తెచ్చిన మూడు ఆర్డినెన్సులను వ్యతిరేకిస్తూనే, కార్పొరేట్లకు ప్రత్యామ్నాయంగా రైతు సహకార సంఘాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. వ్యవసాయ కుటుంబాల ఆదాయ భద్రత కోసం నిజమైన ప్రత్యామ్నాయం ఇదొక్కటే. వ్యవసాయ రంగంలో కార్పొరేట్లను అనుమతించడం ఎంత మాత్రమూ కాదు.

కన్నెగంటి రవి (రైతు స్వరాజ్య వేదిక)

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.