కలిసుంటేనే.. కొత్త పాలకవర్గంలో సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2021-05-09T05:40:23+05:30 IST

కలిసుంటేనే.. కొత్త పాలకవర్గంలో సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం

కలిసుంటేనే..  కొత్త పాలకవర్గంలో సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం
కలెక్టర్‌ను కలిసిన మేయర్‌, డిప్యూటీ మేయర్‌

గత మేయర్‌, కార్పొరేటర్ల మధ్య విబేధాలు

అప్పట్లో రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశం

ఖమ్మం కార్పొరేషన్‌, మే 8: నగరపాలక సంస్థకు కొత్త పాలక వర్గం ఏర్పడింది. నూతన, తొలి మహిళా మేయర్‌గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌గా ఫాతిమా జోహారా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం సూచనల మేరకు వారి ఎన్నిక సజావుగా సాగింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. గత అనుభవా లు మాత్రం అందరిని ఆలోచనలో పడేస్తున్నాయి. కార్పొరేటర్ల ను కలుపుకొని పోతేనే నగరపాలన సజావుగా సాగుతుందని.. లేదంటే అభివృద్ధి ఆగిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. గత పాలకవర్గంలో మేయర్‌కు, అధికార పక్ష కార్పొ రేటర్లకు మధ్యే విబేధాలు రావటం, విషయం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వద్దకు వెళ్లడంతో రాష్ట్రస్థాయిలో తీవ్ర చర్చనీ యాంశమైంది. ఒకదశలో అప్పటిమేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెడదామని నిర్ణయించి, అధిష్ఠానం సీరియస్‌ కావటంతో విరమించుకున్న సంగతి తెలిసిందే. పాలకవర్గం పదవీకాలం ముగిసే సమయంలోనూ దాదాపు ఇదే జరిగింది.  

గత పాలనలో ఏం జరిగిందంటే..

ఖమ్మం నగరపాలకంలో గతంలో 43మంది అధికారపక్ష కార్పొరేటర్లు ఉండేవారు. కొన్నిరోజులు బాగానే ఉన్నా.. మేయర్‌కు కార్పొరేటర్లకు మధ్య విబేధాలు ప్రారంభమ య్యాయి. మేయర్‌ పాపాలాల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో సూప రింటెండెంట్‌గా పనిచేసి, తొలిసారి రాజకీయాల్లోకి రావటంతో ఆయన కార్పొరేటర్లు చెప్పింది వినేవారు కాదని అను కునే వారు. దీంతో చాపకింద నీరులా విబేధాలు ప్రారంభ మయ్యాయి. అంతేకాక మేయర్‌ తన సొంత ఆస్పత్రిలోనే ఎక్కువ సమయం గడపటం కూడా విమర్శలకు తావిచ్చింది.  డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించినా, మరిన్ని నిధుల కేటాయింపు విషయంలో అప్పటి మేయర్‌, అధికార పక్ష కార్పొరేటర్లకు మధ్యే దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో పదవీకాలం ముగిసేందుకు మరో ఏడాది ఉన్న సమయంలో అధికారపక్ష కార్పొరేటర్లు ప్రైవేట్‌గా సమావేశమై మేయర్‌ను తొలగించాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు హైదరాబాద్‌ వెళ్లి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి మేయర్‌ పనితీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం కేటీఆర్‌ మేయర్‌ను పిలిచి మాట్లాడారు. అందరికీ సర్దిచెప్పి, అవిశ్వాసం ఊసు ఎత్తవద్దని హెచ్చరించటంతో అందరూ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. తాత్కాలికంగా అప్పుడు విబేధాలు సద్దు మణిగాయని చెప్పినా.. లోలోపల మాత్రం రగులుతూనే ఉంది. ఇక చివరిసమావేశంలో మేయర్‌ తన డివిజన్‌కు మాత్రమే అధిక నిధులు కేటాయించుకుని.. కార్పొరేటర్లకు తక్కువ నిధులు ఇవ్వడం పట్ల అధికార పక్ష కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. తమ డివిజన్లకు కూడా కావాల్సినన్ని నిధులు కేటాయించాలని పట్టుపట్టారు. అయితే మేయర్‌ అందుకు అంగీకరించకుండా సమావేశానికి రానని చెప్పటంతో సమావేశం రద్దు అయ్యింది. ఈ విషయం కూడా ఆరోజున తీవ్ర చర్చనీయాంశమైంది. 

సమన్వయంతోనే సాధ్యం.. 

మేయర్‌ ఎప్పుడూ అందుబాటులో ఉండటమే కాకుండా, కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తేనే పాలన సజావుగా సాగి, అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తమ డివిజన్లలో అభివృద్ధి పనులు సగంలోనే నిలిచిపోయాయని, అధికారపక్ష కార్పొరేటర్లే సాధా రణ సమావేశాల్లో చెబుతున్న ఘటనలు గతంలో జరిగాయి. కానీ సభ్యులు చెప్పిన సమస్యలను వినడమే కానీ, వాటిని మినిట్స్‌ పుస్తకంలో నమోదు చేయకపోవటంతో మళ్లీ నిర్వ హించే సమావేశంలో ఆ సమస్యలు ఎంత మేరకు పరిష్కారం అయ్యాయనే విషయం పట్టించుకోలేదు. అలాగే ప్రస్తావించిన సమస్యలనే పునరావృతం చేస్తూ కీలకమైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు. అధికారంలో ఉండి కూడా అభివృద్ధి పనులు పూర్తి చేయలేక పోయారనే అపవాదు వచ్చింది. ఇప్పుడైనా నూతన మేయర్‌ ఇవి జరగకుండా చూస్తేనే ప్రజలకు సౌకర్యాలు అందుతాయన్న అభిప్రాయాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.

కలెక్టర్‌ను కలిసిన మేయర్‌, డిప్యూటీ మేయర్‌

ఖమ్మం కలెక్టరేట్‌ : నూతనంగా ఎన్నికైన ఖమ్మం నగరపాలక మేయర్‌ పునుకుల నీరజ శనివారం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ను ఆయన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆమెకు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందించారు. ఆమెతో పాటు డిప్యూటీ మేయర్‌ షేక్‌ ఫాతిమా జోహరా కూడా ఉన్నారు.

Updated Date - 2021-05-09T05:40:23+05:30 IST