Corporation Schoolsలో.. భారీగా ప్రవేశాలు

ABN , First Publish Date - 2022-07-05T13:49:30+05:30 IST

నగర కార్పొరేషన్‌ పాఠశాలల్లో రోజు రోజుకూ ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ కార్పొరేషన్‌ ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత, మహోన్నత

Corporation Schoolsలో.. భారీగా ప్రవేశాలు

                                        - లక్ష దాటిన అడ్మిషన్లు


చెన్నై, జూలై 4 (ఆంధ్రజ్యోతి): నగర కార్పొరేషన్‌ పాఠశాలల్లో రోజు రోజుకూ ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ కార్పొరేషన్‌ ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత, మహోన్నత పాఠశాలల్లో ప్రవేశానికి సుమారు లక్షమంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఎల్‌కేజీ, యూకేజీ, ప్రాథమిక, మధ్యమ, ఉన్నత, మహోన్నత తదితర 281 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల వారి పిల్లలే అధికంగా చదువుతుంటారు. అయితే రెండేళ్ల కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల కారణంగా ఆదాయం కోల్పోయినవారంతా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను కార్పొరేషన్‌, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.  దీంతో గత రెండేళ్లుగా ప్రభుత్వ, కార్పొరేషన్‌, మున్సిపల్‌ పాఠశాలల్లో అడ్మిషన్లు ఎనిమిది లక్షల వరకు పెరిగాయి. నగరంలో గతేడాది 1.11 లక్షల మంది చేరారు. ఈ నేపథ్యంలో 2022-23 విద్యా సంవత్సరానికిగాను నగరంలో కార్పొరేషన్‌ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. గడిచిన ఇరవై రోజుల్లో లక్షా ఐదువేలమంది కార్పొరేషన్‌ పాఠశాలల్లో చేరినట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. గతేడాదిలాగే అడ్మిషన్లు పొందే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.  సెప్టెంబర్‌ లో విజయ దశమి సందర్భంగా బాల్వాడీ, ప్రాథమిక పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో కార్పొరేషన్‌పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలంటూ ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్ళి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా పాఠశాలల ప్రవేశద్వారాల వద్ద నాణ్యమైన విద్య కోసం కార్పొరేషన్‌ పాఠశాలల్లో చేర్పించాలంటూ బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల పాఠశాలలకు కొత్త నిర్వహణ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆ కమిటీ సభ్యుల ద్వారా అడ్మిషన్లు మరింతగా పెరుగుతాయని అధికారులు తెలిపారు. గతేడాదిలాగే ఈ సంవత్సరం కూడా సుమారు నాలుగు లక్షలమందిని చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2022-07-05T13:49:30+05:30 IST