కమీషన్ల కార్పొరేటర్లు

ABN , First Publish Date - 2021-10-23T07:16:59+05:30 IST

ఒంగోలు నగరపాలక సంస్థలో కమీషన్ల వ్యవహారం తీవ్రమైంది. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఎదురుచూస్తుండగా, మా పర్సంటేజీలు తేలేవరకు ఒప్పుకునేది లేదంటూ ఓ నలుగురు కార్పొరేటర్లు అంతా తామై చక్రం తిప్పుతున్నారు.

కమీషన్ల కార్పొరేటర్లు
సమావేశ మందిరంలో ఖాళీగా ఉన్న కుర్చీలు

పర్సంటేజీల కోసం కాంట్రాక్టర్లతో బేరసారాలు

నలుగురి వ్యవహార శైలిపై తీవ్ర ఆరోపణలు 

ప్రజా సమస్యలు చర్చించకుండా సమావేశానికి డుమ్మా

కోరం లేదంటూ సమావేశం వాయిదాపై సర్వత్రా చర్చ

ఒంగోలు (కార్పొరేషన్‌), అక్టోబరు 22 : ఒంగోలు నగరపాలక సంస్థలో కమీషన్ల వ్యవహారం తీవ్రమైంది. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఎదురుచూస్తుండగా, మా పర్సంటేజీలు తేలేవరకు ఒప్పుకునేది లేదంటూ ఓ నలుగురు కార్పొరేటర్లు అంతా తామై చక్రం తిప్పుతున్నారు. వారి కారణంగానే అప్పటివరకూ ఉంటుందన్న కౌన్సిల్‌ సమావేశం అర్ధంతరంగా వాయిదాపడిందంటూ ఆయావర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు ప్రజాసమస్యలుచర్చించకుండా సమావేశం వాయిదా వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకెళితే.. ఒంగోలు కార్పొరేషన్‌ పాలకవర్గ అత్యవసర సమావేశం శుక్రవారం ఉదయం 11గంటలకు జరగాల్సి ఉంది. అందులో మూడు అంశాలను మాత్రమే అజెండాలో పొందుపరిచారు. ఈనెల 8న జరిగిన సమావేశంలో రూ.12కోట్ల సబ్‌ప్లాన్‌ పనుల బిల్లులను జనరల్‌ ఫండ్‌ నుంచి ఇవ్వాలని ఆదేశాలు ఉండగా, అందుకు కార్పొరేటర్లు ఆమోదం కోసం బేరసారాలకు దిగారు. విషయం తేలకపోవడంతో ఆ అంశం వాయిదాపడింది. దీనిపై అసంతృప్తి చెందిన కాంట్రాక్టర్లు కొందరు కోర్టును ఆశ్రయించడంతో జరిగిన జాప్యానికి 18శాతం వడ్డీ కలిపి చెల్లించాలని కోర్టు అధికారులను ఆదేశించింది. దీంతో కోర్టుకెళ్లిన వారిలో కొందరికి సీఎంఎఫ్‌ఎస్‌లో అప్‌లోడ్‌ చేశారు. దీంతో రూ.7 కోట్ల వరకు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయగా, మిగిలిన రూ.5కోట్ల బిల్లులకు కౌన్సిల్‌ ఆమోదం తెలియజేయాల్సి ఉంది. అదే అంశాన్ని శుక్రవారం సమావేశంలో పొందుపరిచారు.  ఈ నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేయడం.. అది కూడా అధికారపక్షం కార్పొరేటర్లు 43 మంది ఉన్నా, ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి డుమ్మా కొట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా కోరం లేదనే సాకుతో వాయిదా వేయడం కార్పొరేటర్ల బేరం వాస్తవమే అన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. 


Updated Date - 2021-10-23T07:16:59+05:30 IST