నాలుగో‘సారీ’!

ABN , First Publish Date - 2022-01-23T05:19:56+05:30 IST

చిన్నచిన్న కాలువ పనుల నుంచి రూ.కోట్లు విలువైన బ్లాక్‌టాప్‌ (బీటీ)రోడ్ల వరకు పనుల కోసం కాంట్రాక్టర్ల మధ్య తీవ్ర పోటీ ఉండేది. ఏటా రూ.250కోట్ల వరకు డివిజన్ల పరిధిలో ఎన్నో పనులు సాగేవి. నిత్యం వర్క్‌ అగ్రిమెంట్లు, బిల్లుల కోసం కాంట్రాక్టర్లు తరచూ తిరిగేవారు. అనంతపురం నగరపాలక సంస్థలో ఒకప్పటి పరిస్థితి ఇది.

నాలుగో‘సారీ’!

నగరపాలక సంస్థలో ప్యాచవర్క్‌ల టెండర్లకు స్పందించని కాంట్రాక్టర్లు

అనంతపురం కార్పొరేషన, జనవరి22: చిన్నచిన్న కాలువ పనుల నుంచి రూ.కోట్లు విలువైన బ్లాక్‌టాప్‌ (బీటీ)రోడ్ల వరకు పనుల కోసం కాంట్రాక్టర్ల మధ్య తీవ్ర పోటీ ఉండేది. ఏటా రూ.250కోట్ల వరకు డివిజన్ల పరిధిలో ఎన్నో పనులు సాగేవి. నిత్యం వర్క్‌ అగ్రిమెంట్లు, బిల్లుల కోసం కాంట్రాక్టర్లు తరచూ తిరిగేవారు. అనంతపురం నగరపాలక  సంస్థలో ఒకప్పటి పరిస్థితి ఇది. ఇప్పుడు కాంట్రాక్టర్లు కనిపించే పరిస్థితి లేదు. వచ్చినా పాత బిల్లులు ఎప్పుడొస్తాయోనని ఎదురుచూడటం కోసమే. పాత బి ల్లులు వస్తే చాలనుకునే పరిస్థితుల్లో కాంట్రాక్టర్లున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కనీసం గుంతలను పూడ్చే ప్యాచవర్క్‌లకు కూడా కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాకపోవడమే ఇందుకు నిదర్శనం. నగరంలో అనేక ప్రాంతాల్లో దర్శనమిస్తున్న గుంతలు పూడ్చడానికి టెండరు పిలిచినా ఒక్క కాంట్రాక్టరు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం.


నాలుగుసార్లు పిలిచినా స్పందనలేదు...

నగరపాలక సంస్థ పరిధిలో 40మందికిపైగా కాంట్రాక్టర్లున్నారు. వారిలో కనీసం ఐదుశాతం మంది కూడా పనులు చేయడం లేదు. గతంలో చేసిన పనులకు సంబంధించి ఇంకా రూ.25కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆ బిల్లులు వచ్చేవరకు పనులు చేసే యోచనలో కాంట్రాక్టర్లు కనిపించడం లేదు. రెండు నెలలుగా నగరంలోని ప్యాచవర్క్‌ల కోసం టెండర్లు పిలుస్తున్నారు. రూ.33లక్షలతో పలు ప్రాంతాల్లో ప్యాచవర్క్‌లకు ఏ ఒక్క కాంట్రాక్టర్‌ కూడా స్పందించలేదు. మూడుసార్లు స్పందన లేకపోవడంతో తాజాగా నాలుగోసారి ఈనెల 12 వతేదీ నుంచి 19వరకు టెండరుకు గడువు విధించారు. ఈసారి కూడా కాంట్రాక్టర్లు సారీ చెప్పేశారు. వాస్తవానికి ఈ నిధులను జనరల్‌ ఫండ్‌ కింద ఖర్చు చేస్తున్నారు. సీఎ్‌ఫఎంఎస్‌ విధానంలో ఆ బిల్లులు కాంట్రాక్టర్‌ ఖాతాలో చేరతాయి. అంటే ఆ నిధులను నేరుగా నగరపాలక సంస్థ అధికారులు ఇవ్వడానికి కుదరదు. ఇక సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా ఎప్పుడు బిల్లులవుతాయో స్పష్టత లేదు. ఈ క్రమంలోనే ఆ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు వెనుకడుగేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ బిల్లులు ఎప్పుడు  వస్తాయో...? పను లు చేయడానికి కాంట్రాక్టర్లు ఎప్పుడు ముందుకొస్తారో...? తేలాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే.



Updated Date - 2022-01-23T05:19:56+05:30 IST