వెలిగొండ జపంతోనే సరి

ABN , First Publish Date - 2022-06-28T05:05:49+05:30 IST

మార్కాపురం డివిజన్‌లోని మూడు నియోజకవర్గాల్లో జరిగిన వైసీపీ ప్లీనరీలను పరిశీలిస్తే పాడిందే పాటరా అన్న సామెత గుర్తుకొస్తుంది. కార్యకర్తల హాజరు, అసమ్మతి నేతల గైర్హాజరుని పక్కనపెట్టినా మూడేళ్ల అనంతరం కూడా వైసీపీ నేతలు వెలిగొండ ప్రాజెక్టు పూర్తికోసం తీర్మానాలు చేయటం, సీఎంని కోరతామని చెప్పటానికే పరిమితం కావటం విశేషం.

వెలిగొండ జపంతోనే సరి
మార్కాపురంలో మాట్లాడుతున్న మంత్రి సురేష్‌

పూర్తిచేయాలని తీర్మానాలు 

ప్రధాన వక్తల ప్రసంగాల్లో అదే ప్రధానం 

మార్కాపురంలో అసమ్మతివాదుల గైర్హాజరు

గిద్దలూరులో ఇలా వచ్చి అలా వెళ్లారు 

పశ్చిమ ప్రాంతంలోని వైసీపీ ప్లీనరీల తీరుతెన్నూ 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

 మార్కాపురం డివిజన్‌లోని మూడు నియోజకవర్గాల్లో జరిగిన వైసీపీ ప్లీనరీలను పరిశీలిస్తే పాడిందే పాటరా అన్న సామెత గుర్తుకొస్తుంది. కార్యకర్తల హాజరు, అసమ్మతి నేతల గైర్హాజరుని పక్కనపెట్టినా మూడేళ్ల అనంతరం కూడా వైసీపీ నేతలు వెలిగొండ ప్రాజెక్టు పూర్తికోసం తీర్మానాలు చేయటం, సీఎంని కోరతామని చెప్పటానికే పరిమితం కావటం విశేషం. సొంత నియోజకవర్గంలో మాత్రం మంత్రి సురేష్‌ ఒకడుగు ముందుకేసి ఈ ఏడాది ఆఖరుకి పూర్తిచేస్తామన్న భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. గత ఎన్నికల సమయంలో, అంతకుముందు పాదయాత్రలో జగన్‌ తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే వెలిగొండ నిర్మాణాన్ని పూర్తిచేసి సాగునీరు ఇస్తామని హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చాక కూడా ఇదిగోఅదిగో అంటూ సీఎంతో పాటు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు, మంత్రులు ప్రకటనలు గుప్పించారు. నేడోరేపో ప్రాజెక్టు ద్వారా సాగునీరు పొలాలకు అందుతున్నట్లే చెప్పారు. కానీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్ల తర్వాత కూడా ఆ పార్టీ కీలకమైన ప్లీనరీ సభల్లో ఇంకా ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని తీర్మానాలు చేయటం విశేషం. సోమవారం మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల ప్లీనరీలు జరగ్గా ఆదివారం వైపాలెం ప్లీనరీ జరిగింది. ఆ ప్లీనరీకి కార్యకర్తలు భారీగానే తరలివచ్చారు. మార్కాపురం, గిద్దలూరు ప్లీనరీలకు అంతంతమాత్రంగానే కార్యకర్తలు హాజరయ్యారు. మార్కాపురం ప్లీనరీకి మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, వైసీపీ రాష్ట్ర నాయకులు హనుమారెడ్డిలాంటి ముఖ్యులతోపాటు అసమ్మతి గ్రూపులో ఉన్న ఇద్దరు ముగ్గురు సర్పంచ్‌లు కూడా గైర్హాజరయ్యారు. గిద్దలూరులో అసమ్మతి నేతలు సభకు హాజరైనట్లే హాజరై అరగంటలో వేదిక దిగి వెళ్లిపోయారు. 


కార్యకర్తలకు నో మైక్‌

కాగా మూడు ప్లీనరీలకు మంత్రి సురే్‌షతో పాటు ఎంపీ మాగుంట, స్థానిక ఎమ్మెల్యేలు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుర్రా, జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ తదితరులు హాజరయ్యారు. ఏ సభలోను కార్యకర్తలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. తద్వారా పార్టీ అంతర్గత వ్యవహారాలు బహిర్గతం కాకుండా చూసుకున్నారు. అయితే మార్కాపురం, గిద్దలూరు సభల్లో వెలిగొండని త్వరితగతిన పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలంటూ తీర్మానం చేయటం విశేషం. గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మార్కాపురంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మరోసారి సీఎంను కలిసి మన ప్రజల కోరికను తెలియజేస్తానని చెప్పారు. ఈ రెండు సభల్లోను మంత్రి సురేష్‌ సమక్షంలోనే ఈ తీర్మానాలు చేశారు. అంతకుముందు వైపాలెం సభలో మంత్రి సురేష్‌ ఏడాదికి వెలిగొండ పూర్తిచేసి నీరిస్తామని చెప్పారు. సోమవారం జరిగిన సభల్లో అయితే ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావటంపై వైసీపీ నాయకులు కూడా అనుమానాలు వ ్యక్తం చేస్తూ తీర్మానాలు చేశారు. తొలి ఏడాదే ప్రాజెక్టు పూర్తిచేసి నీరిస్తామని ప్రకటించిన అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మూడేళ్ల తర్వాత కూడా ఇంకా పూర్తిచేయాలని తీర్మానాలు చేయటంపై ప్లీనరీకి హాజరైన కార్యకర్తలే నిట్టూర్పులు ఇవ్వటం విశేషం.

Updated Date - 2022-06-28T05:05:49+05:30 IST