గ‘లీజు’పర్వం!

ABN , First Publish Date - 2022-09-22T07:00:26+05:30 IST

నగరపాలక సంస్థ ఆస్తులు ఏళ్ల తరబడి పరాధీనంలోనే ఉంటున్నా యి. కొందరు అద్దె చెల్లించకుండానే సొంతమన్నట్లు వ్యవహరిస్తున్నా అడిగేవారు లేరు.

గ‘లీజు’పర్వం!
ఒంగోలు అద్దంకి బస్టాండ్‌లోని కార్పొరేషన్‌ కాంప్లెక్స్‌

ప్రభుత్వ కాంప్లెక్స్‌ల్లో బినామీలు తిష్ఠ    

ఆక్రమించి అద్దెలకిస్తున్న కొందరు

కార్పొరేషన్‌  ఆదాయానికి  భారీగా గండి 

అమలుకు నోచుకోని జీవో నెం.56

మామూళ్ల మత్తులో  నగరపాలక   యంత్రాంగం 

ఒంగోలు నగరంలో గలీజు పర్వం నడుస్తోంది. నగరపాలక సంస్థ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. అడిగేవారే లేకపోవడంతో ‘అద్దె కట్టం.. ఖాళీ చేయం’ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. కార్పొరేషన్‌ కార్యాలయంలోని రెవెన్యూ విభాగం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. పరుల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించి, ఆదాయాన్ని పెంచాల్సింది పోయి జేబులు నింపుకొనే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. లీజు పద్ధతిన కేటాయించిన కార్పొరేషన్‌ కాంప్లెక్స్‌ల్లో కిరికిరి నడుస్తోంది. ఓవైపు పాలకవర్గంలోని కొందరు కార్పొరేటర్లు కార్పొరేషన్‌ ఆస్తులపై కన్నేశారు. మరోవైపు ఆక్రమణదారులకు, అద్దెదారులకు అధికారులు సంపూర్ణంగా అండదండలు  అందిస్తున్నారు.  లీజుదారులకు కొమ్ముకాస్తూ ఆస్తులను ధారాదత్తం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.  

ఒంగోలు (కార్పొరేషన్‌), సెప్టెంబరు 21 : నగరపాలక సంస్థ ఆస్తులు ఏళ్ల తరబడి పరాధీనంలోనే ఉంటున్నా యి. కొందరు అద్దె చెల్లించకుండానే సొంతమన్నట్లు వ్యవహరిస్తున్నా అడిగేవారు లేరు. ముఖ్యంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని రెవెన్యూ విభాగం అవినీతికి కేరాఫ్‌ అడ్ర స్‌గా మారింది. దీంతో ప్రభుత్వవిలువైన ఆస్తులు పరుల పరమవుతున్నాయి. ఆస్తి పన్ను నుంచి అద్దె వసూలు వరకు వీరు చూపుతున్న నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆస్తులు  ఏళ్ళతరబడి పరాయి వ్యక్తుల చెరలో చిక్కుకున్నాయి. లీజు గడువు ముగిసినా రెన్యువల్‌ చేయించుకోని వ్యాపారులు అధికారులకు మామూళ్లు సమర్పించి దర్జాగా కొనసాగుతున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా రూ.లక్షల్లో అద్దె బకాయిలు పేరుకుపోయాయి. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో కార్పొరేషన్‌ ఖజానాకు భారీగా గండిపడింది. ప్రజలు కల్పించుకొని ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు స్పందించని పరిస్థితి. సామాన్యుల పనులను పక్కనపెట్టి, కాసులు చెల్లించే వారికే కార్పొరేషన్‌ అధికారులు రెడ్‌కార్పెట్‌ పరుస్తున్నారనే విమర్శలున్నాయి.


కార్పొరేషన్‌ కాంప్లెక్స్‌ల్లోనూ ఆక్రమణలు!

కార్పొరేషన్‌ స్థలం కనిపిస్తే కబ్జాలకు కొందరు తెగబడుతున్నారు. ప్రధానంగా ఫుట్‌పాత్‌లను సైతం వదలకుండా అడ్డగోలుగా ఆక్రమించేసి అద్దెలకు ఇస్తున్నారు. అయినా కార్పొరేషన్‌ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. కాసుల మత్తులో జోగాడుతున్న వారికి ఆక్రమణల పర్వం ఆదాయవనరుగా మారింది. ఇప్పటికే కార్పొరేషన్‌కు చెందిన స్థలాలను కొందరు ఆక్రమించి ఏళ్ల తరబడి యథేచ్ఛగా అనుభవిస్తున్నారు. కొన్నిచోట్ల కబ్జా చేసిన స్థలాలు తమవేనంటూ కోర్టుకెక్కుతున్నారు. అందుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అధికారులు కనీసం కదలకపోవడం గమనార్హం. ఒంగోలు నగరంలో వందలసంఖ్యలో ప్రభుత్వ రహదారులు, ఖాళీస్థలాల్లో శాశ్వతంగా ఆక్రమణలు జరిగినట్లు అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయి. అలాగే వివిధ వ్యాపారాల నిమిత్తం తాత్కాలిక ఆక్రమణలు కూడా ఉన్నాయి. తొలుత చిరువ్యాపారం కోసం పాక వేయడం, ఆ తర్వాత  శాశ్వత కట్టడాలు నిర్మించడం పరిపాటైంది. కార్పొరేషన్‌ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కనీసం రక్షణ కంచెలు వేయడానికి కూడా అధికారులు వెనకడుగు వేస్తున్న పరిస్థితి నెలకొంది. అలాగే కార్పొరేషన్‌ కాంప్లెక్స్‌ల్లోనూ అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. షాపులు దక్కించుకున్న వారు వ్యాపారాలు చేయకుండా వందల్లో కార్పొరేషన్‌కు చెల్లిస్తూ, ఇతరులకు అద్దెకు ఇచ్చి వేలల్లో వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. 


ఏళ్లతరబడి అవే అద్దెలు

కార్పొరేషన్‌ నిబంధనల ప్రకారం 56 జీవో అమ లు కావాల్సి ఉంది. అర్హులైన వారికి మాత్రమే షాపులు కేటాయించడంతోపాటు, మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌కు సమీపంలోని ప్రైవేటు కాంప్లెక్స్‌ల అద్దెలను పరిగణ నలోకి తీసుకుని వాటిపై పది శాతం అదనం గా వసూలు చేయాలి. మూడేళ్లకొకసారి మరో పదిశాతం పెంచుతూ రెన్యువల్‌ చేయాల్సి ఉంది.ఆదాయానికి నష్టం వాటిల్లే క్రమంలో లీజు రద్దు చేసి, తిరిగి వేలం నిర్వహించవచ్చు. నగరపాలక సంస్థ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి సొంత ఆదాయంపైనే దృష్టి సారిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో బినామీలు చొరబడి, ప్రభుత్వ దుకాణాలపై వ్రేటు పెత్తనం చేస్తూ ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. 


మామూళ్ల మత్తులో అధికారులు 

నగరం నడిబొడ్డున ఉన్న ఊర చెరువులో వందలసంఖ్యలో ఆక్రమణలు జరగడంతోపాటు, జోరుగా అనధికార కట్టడాలు వెలిశాయి. దామోదర సంజీవయ్య కూరగాయల మార్కెట్‌లో అనధికార దుకాణాలు వెలిశాయి. ఇప్పటివరకు అధికారుల లెక్కల ప్రకారం కార్పొరేషన్‌కు చెందిన స్థలాల్లో సుమారు 593 ఆక్రమణలు జరిగినట్లు సమాచారం. అందులో 200కుపైగా వివిధ చిరు వ్యాపారాల నిమిత్తం వాడుకుంటున్నారు. వారంతా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తాత్కాలిక వ్యాపారాలు చేస్తారు. అలాగే సైడు కాలువలను సైతం ఆక్రమించి నిర్మించిన కట్టడాలు వందల్లోనే ఉన్నాయి. వారందరికీ రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి.


 ఏడాదికి రూ.1.5కోట్ల రాబడి

నగరంలోని అమరజీవి షాపింగ్‌ కాంపెక్స్‌లో 25, టీఎల్‌ఎన్‌ మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 12, అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌ కాంప్లెక్స్‌లో 24, జయరామ్‌ సెంటర్‌లో 3, లాయర్‌పేటలో 40, ఘోష ఆసుపత్రి వద్ద 15, దామోదర సంజీవయ్య కూరగాయల మార్కెట్‌లో హోల్‌సేల్‌ దుకాణాలు 69, రిటైల్‌ షాపులు 123 ఉన్నాయి. అదే కాంప్లెక్స్‌లో పండ్ల వ్యాపారులకు 38, పూల వ్యాపారు లకు 28 షాపులను అధికారులు కేటాయించారు. మాంసాహార విక్రయాలకు చేపల మార్కెట్‌కు 25, మాంసం మార్కెట్‌ 25, బేకరీ 1, క్యాంటీన్‌ 1 చొప్పున కేటాయించారు.  ప్రస్తుతం ఏడాదికి రూ.1.5 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు అధికారులు చూపుతున్నారు. అయితే చాలా వరకు బకాయిలు ఉన్నట్లు సమాచారం. గృహ యజమానుల నుంచి ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేసే అధికారులు ప్రభుత్వ బకాయిలపై మాత్రం ఉదాసీనత చూపుతున్నారు. ఏళ్లతరబడి కార్పొరేషన్‌ సిబ్బందితో కుదుర్చుకున్న ఒప్పందం నేటికీ కొనసాగడమే కారణమన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కోట్ల రూపాయల విలువ చేసే మునిసిపల్‌ ఆస్తులు ఉచితంగానే అనుభవిస్తున్న ఆయా దుకాణాల యజమానులు కార్పొరేషన్‌ ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రస్తుత ధర ప్రకారం తిరిగి వేలం నిర్వహించి అద్దెలు పెంచితే రూ.5కోట్లకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా మున్సిపల్‌ యంత్రాంగం తన తీరును మార్చుకొని కార్పొరేషన్‌ ఆస్తులను పరిరక్షించడంతో పాటు అద్దెలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది.




Updated Date - 2022-09-22T07:00:26+05:30 IST