ఐటీఐఆర్‌ లేదా సమాన హోదాను కల్పించండి

ABN , First Publish Date - 2021-03-01T08:50:56+05:30 IST

ఐటీ పరిశ్రమలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్‌ నగరానికి ఐటీఐఆర్‌ ప్రాజెక్టును మంజూరు చేయాలని, లేదా దానికి సమానమైన ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు.

ఐటీఐఆర్‌ లేదా సమాన హోదాను కల్పించండి

  • ఐటీలో  అద్భుత ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్‌
  • తెలంగాణలో భారీగా పెరిగిన ఐటీ ఎగుమతులు
  • జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు ప్రోత్సాహం
  • కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌కు కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఐటీ పరిశ్రమలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్‌ నగరానికి ఐటీఐఆర్‌ ప్రాజెక్టును మంజూరు చేయాలని, లేదా దానికి సమానమైన ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో హైదరాబాద్‌ గత ఆరేళ్లుగా అద్భుతమైన ప్రగతిని కొనసాగిస్తోందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు లేఖ రాశారు. కొవిడ్‌ సంక్షోభంలో దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లోనూ తెలంగాణ ఐటీ ఎగుమతులు భారీ ఎత్తున పెరిగాయన్నారు. జాతీయ సగటు 1.9ు ఉండగా తెలంగాణ వృద్ధిరేటు 7 శాతంతో రూ.1.4 లక్షల కోట్లతో ఉందని లేఖలో ప్రస్తావించారు. కొవిడ్‌ పరిస్థితులున్న సంవత్సరంలోనూ 8.7 మిలియన్‌ ేస్క్వర్‌ ఫీట్‌ల నూతన కార్యాలయం స్పేస్‌ క్రియేషన్‌ జరిందని పేర్కొన్నారు. ఈ రంగంలో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, గోల్డ్‌ మాన్‌ సాక్స్‌, ఫియట్‌ క్రిస్లార్‌ ఆటో మొబైల్స్‌ వంటి అనేక ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డాటా అనలిటిక్స్‌, ఐవోటీ,  సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెక్నాలజీస్‌ వంటి నూతన ఎమర్జింగ్‌ టెక్నాలజీలను సైతం ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. దీంతోపాటు ఆర్‌అండ్‌డీ, నైపుణ్య శిక్షణ వంటి రంగాల్లోనూ ప్రభుత్వం వినూత్న పాలసీల ద్వారా అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తోందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనంత గొప్ప ఇన్నోవేషన్‌ ఎకో సిస్టం తెలంగాణలో ఉన్నదన్నారు.

 

ఐటీ అభివృద్ధిలో ముందవరుస

రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఐటీ అభివృద్ధిలో ముందవరుసలో ఉన్న హైదరాబాద్‌ నగరానికి కేంద్రం ప్రత్యేక ప్రోత్సహం అందించాలని కేటీఆర్‌ కోరారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరానికి కేటాయించిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. స్వయంగా ప్రధాని మోదీని సైతం సీఎం కేసీఅర్‌ అనేకసార్లు కోరారని తెలిపారు. తాను స్వయంగా కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. కేంద్రం ఐటీఐఆర్‌పై తాత్సారం చేయడంతో అత్యంత విలువైన సమయాన్ని తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగం అభివృద్ధి విషయంలో కోల్పోయిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ఐటీ, దానిఅనుబంధ పరిశ్రమ ప్రాధాన్యాన్ని కేంద్రం గుర్తించి, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్న విషయాన్ని పరిగణనలోకి  తీసుకుని ఐటీఐఆర్‌ హోదాను తిరిగి కల్పించడం లేదా ఐటీఐఆర్‌కు సమానమైన ప్రత్యేక పాలసీ పరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరారు. 


Updated Date - 2021-03-01T08:50:56+05:30 IST