
రూ.అర కోటి పనుల వెనుక అవినీతి పావులు
చేయని పనులకు దొంగ బిల్లుల తయారీ
నిధులు మురిగిపోతాయనే సాకుతో హడావిడి
పది లక్షలు కూడా చేయని పనులకు రూ.కోటి బిల్లులు
ఇప్పటికే ఐదు క్లియర్.. మరో 11 బిల్లులు సిద్ధం
ఇంజనీర్లపై ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ఒత్తిడి
పట్టుమని రూ.పది లక్షలు కూడా ఖర్చు పెట్టకుండా దొంగ బిల్లులతో రూ.అర కోటిని అప్పనంగా మెక్కేసే మహా స్కెచ్ ఇది. ఇప్పటికే చేయని ఐదు పనులకు దొంగ బిల్లులు పెట్టేశారు. వీటికి డబ్బులు పడటమే తరువాయి. మిగిలిన 11 పనులకు కూడా బిల్లులను సిద్ధం చేస్తున్నారు. వీటిపై జడ్పీ సీఈవో సంతకాలు చేయటమే ఇక మిగిలి ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధులు మురిగిపోతున్నాయనే సాకుతో చేయని పనులను చేసినట్టు చూపి, దొంగ బిల్లులు పెట్టించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారుల బంపర్ అవినీతి స్కీమ్ ఇది..
(ఆంధ్ర జ్యోతి, విజయవాడ) : 14వ ఆర్థిక సంఘం నిధులతో జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో సీపీడబ్ల్యూ స్కీమ్ కింద పైపులైన్ల మరమ్మతులు, కొత్త పంపుసెట్లు, ఫిల్టర్ మీడియా మరమ్మతులు తదితర 50 పనులను రూ.4.50 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు పాలనా ఆమోదం లభించింది. వీటిలో 18 పనులకు రూ.1.49 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో ఈ పనులన్నింటినీ రద్దు చేశారు. తిరిగి మళ్లీ వీటి స్థానంలో గుడివాడ ఆర్డబ్ల్యూఎస్ డివిజన్ పరిధిలో మరో 20 కొత్త పనులను ప్రతిపాదించి, మళ్లీ టెండర్లు పిలిచారు. ఇక్కడే గమ్మత్తు జరిగింది. టెండర్లు పిలిచిన 20 పనులను నామినేషన్ల పద్ధతిన రెండు సంస్థలకు కేటాయించారు. వీటిలో మొదటి 16 (0.5 ఎంల్‌డీ మెక్రో ఫిల్టర్స్ ఏర్పాటు) పనులను ఒక సంస్థకు, మిగిలిన నాలుగు (పైపులైన్ల) పనులను మరో సంస్థకు నామినేషన్ పద్ధతిన కేటాయించారు. మొదటి 16 పనులను గుడ్లవల్లేరు మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో చేయాల్సి ఉంది. ఈ పనులను ‘అమృత సొల్యూషన్స్’ అనే సంస్థకు కట్టబెట్టారు. ఈ పనులకే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దొంగ బిల్లులు తయారు చేస్తున్నారు.
పనులు చేపట్టిందెక్కడ?
ఆర్డబ్ల్యూఎస్ గుడివాడ డివిజన్ పరిధిలోని గుడ్లవల్లేరు మండలంలో మైక్రో ఫిల్టర్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. ఆయా గ్రామాల్లో మొత్తం 16 మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేయాలి. ఈ పనుల విలువ రూ.80 లక్షలు. కానీ అమృత సొల్యూషన్స్ అనే సంస్థ ఎక్కడా పనులు చేపట్టలేదు. కేవలం ఓ ఐదు గ్రామాల్లో మైక్రో ఫిల్టర్ల ఏర్పాటుకు ట్యాంకర్లను మాత్రమే తీసుకు వచ్చింది. ట్యాంకర్లను తీసుకురావటం అంటే మైక్రో ఫిల్టర్స్‌ను ఏర్పాటు చేసినట్టు కాదు. ఈ ట్యాంకర్లలో రెండు చాంబర్లను ఏర్పాటు చేయాలి. ఒక చాంబర్లో కార్బన్, మరో చాంబర్లో ప్రత్యేకమైన ఫిల్డర్ శాండ్ నింపాలి. గ్రామ పంచాయతీ నీటి వనరులను మైక్రో ఫిల్డర్‌కు అనుసంధానం చేయాలి. మోటార్లు ఏర్పాటు చేయాలి. ఇంకా అనేక పనులు ఉంటాయి. ఖాళీ ట్యాంకర్‌ను మాత్రమే తీసుకువస్తే దానికి రూ. లక్షన్నర కూడా ఖర్చు కాదు. ఆమృత సంస్థ తీసుకు వచ్చింది ఐదు ట్యాంకర్లు మాత్రమే. వీటి విలువ రూ.8 లక్షలలోపే ఉంటుంది.
దొంగ బిల్లులు సిద్ధం
మొత్తం 16 మైక్రో ఫిల్టర్ పనులకుగానూ ఐదు మైక్రో ఫిల్టర్స్ ఏర్పాటు కోసం ట్యాంకర్లు తీసుకు వచ్చారు. ఫిల్టర్స్ ఏర్పాటు చేయలేదు. మిగిలిన అసెంబ్లింగ్ పనులు చేయలేదు. కానీ వీటికి దొంగ ఎంబుక్‌లు, ఇతర రికార్డులు రూపొందించి దొంగ బిల్లులు మాత్రం తయారు చేసేశారు. ఈ గ్రామాల్లో పనులు చేయకపోయినా బిల్లులు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. చేయని పనులకు బిల్లు చేసేందుకు స్థానిక డీఈఈ అభ్యంతరపెట్టినా.. ఏఈ అత్యుత్సాహంతో ఉన్నతాధికారులకు సహకరించాడు. చివరికి డీఈఈ కూడా ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలొగ్గక తప్పలేదు. బిల్లులు జడ్సీ సీఈవో దగ్గరకు వెళ్లాయి. ఆయన వాటిపై సంతకాలు కూడా పెట్టినట్టు తెలిసింది. రెండు రోజుల్లో చేయని పనులకు డబ్బుల చెల్లింపు కూడా జరగనుంది.
మిగిలిన 11 పనులకూ..
చేయని ఐదు పనులకూ విజయవంతంగా బిల్లులు పెట్టి, సంతకాలు కూడా చేయించేశారు. ఈ ఉత్సాహంతోనే మిగిలిన 11 పనులను కూడా ఎంబుక్‌లో నమోదు చేయించి, దొంగ బిల్లులు తయారు చేయించారు. ఈ బిల్లులను జడ్పీ సీఈవో కార్యాలయానికి పంపించినట్టు తెలుస్తోంది.
నిధులు మురిగిపోతాయనే సాకు
ఈ చర్యలను ఆర్డబ్ల్యూఎస్, జడ్పీ అధికార వర్గాలు సమర్థించుకుంటున్నాయి. ఈ నెలాఖరుతో 14వ ఆర్థిక సంఘం నిధులు మురిగిపోతాయని, వాటిని ఫోర్స్‌లో ఉంచడం కోసమే ఇలా చేస్తున్నామనే వాదనలు వినిపిస్తున్నారు. ఇంతకు ముందు టెండర్లను ఎందుకు రద్దు చేశారు? నిధులు మురిగిపోతాయని తెలిసీ గడువు సమీపించే వరకు ఎందుకు ఉపేక్షించారు? చేయని పనులకు కాంట్రాక్టర్‌కు డబ్బులు ఎలా చెల్లిస్తారు? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు.
అసలు కిటుకు ఇదీ..
అసలు కిటుకు ఏమిటంటే.. రెండో దశలో ఈ పనులను గుడివాడ డివిజన్‌కు మాత్రమే పరిమితం చేశారు. అందునా గుడ్లవల్లేరు మండలంలోనే సింహభాగం వర్కులు ఇచ్చారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ది కూడా ఇదే మండలం. చైర్పర్సన్ ఆబ్లిగేషన్తోనే బిల్లులు పెట్టాల్సి వచ్చిందనే వాద నలను ఆర్డబ్ల్యూఎస్ వర్గాలు వినిపిస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. గుడ్లవల్లేరు మండలం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పాత్ర కూడా ఇందులో కనిపిస్తోంది. ఇతను దశాబ్ద కాలానికి పైగా గుడివాడ ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కార్యాలయంలోనే పాతుకుపోయాడు. ఇటీవల ఈఎన్సీ కార్యాలయం నుంచి గుడ్లవల్లేరుకు పోస్టింగ్ వేసుకోవటం.. బంపర్ స్కీమ్‌ను అమలు చేయటం చకాచకా జరిగిపోయాయి. డీఈఈ అభ్యంతర పెట్టినా.. ఏఈ మాత్రం ఎంబుక్‌లలో పనులు జరిగినట్టు నమోదు చేసి తప్పుడు రికార్డులు తయారు చేశారు.
అన్ని పనులూ జరుగుతాయి..
మూడు రోజుల్లో అన్ని పనులూ పూర్తవుతాయి. చాంబర్స్, ఇతర మెటీరియల్ అంతా వచ్చింది. ఏర్పాటు చేయాల్సిన మోటార్లు కూడా వచ్చాయి. గ్రామ పంచాయతీలు ప్లాట్‌ఫామ్స్ ఏర్పాటు చేస్తే అన్నీ ఏర్పాటవుతాయి. - నెక్కంటి సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, గుడివాడ