అన్నదానంలో అవినీతి

ABN , First Publish Date - 2021-10-09T04:30:23+05:30 IST

అలంపూర్‌ ఆలయాల్లో అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రసాదం, అన్నదానం పంపిణీ సందర్భంగా పాలక మండలి సభ్యులు విరాళాలు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

అన్నదానంలో అవినీతి
అన్నదాన సత్రంలో భోజనం చేస్తున్న భక్తులు

అలంపూర్‌ ఆలయాల్లో బాగోతం

అన్నదానం సరుకులకు అధిక ధరలు చూపుతున్న వైనం

రూ.లక్షల్లో బిల్లులు.. వందల్లో భోజనాలు 

టెండరు లేకుండా సరుకుల కొనుగోలు

భక్తుల విరాళాలు, వీఐపీల ప్రసాదం స్వాహా


అలంపూర్‌, అక్టోబరు 8: అలంపూర్‌ ఆలయాల్లో అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రసాదం, అన్నదానం పంపిణీ సందర్భంగా పాలక మండలి సభ్యులు విరాళాలు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆలయ ఆదాయ వనరులు, విరాళాల సేకరణ నుంచి భక్తుల సౌకర్యార్థం కుమారస్వామి అన్నదాన సత్రాన్ని 1916 నుంచి నిర్వహిస్తున్నారు. భక్తులు మధ్యాహ్న భోజనం అనంతరం భక్తితో అన్నదాన సత్రానికి విరాళాలు ఇవ్వటం పరిపాటి. పండుగ సమయాల్లో భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకుంటారు. మామూలు సమయాల్లో సైతం దాదాపు 500 నుంచి 1,000 మంది వరకు భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుంటారు. భోజన సమయంలో అతి తక్కువ మంది భక్తులు ఆలయంలో ఉంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రోజూ 200 మంది భక్తులకు  భోజనం పెడతారు. అన్నదానానికి అవసరమైన వంట సరుకుల కోసం టెండర్‌ నిర్వహిస్తారు. టెండర్‌ కాలపరిమితి ఆరు నెలల కిందట ముగిసింది. అప్పటి నుంచి నేటి వరకు టెండర్‌ లేకుండా పాలకమండలి, పరిపాలన సిబ్బంది అన్నదాన సత్ర సరుకులు కొనుగోలు చేసి, ఆలయ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. గత ఈవో టెండర్‌ ప్రక్రియకు తిలోదాకాలు ఇచ్చి,  వంట సరుకులో అవినీతికి తెరతీశారు. అదే విధానాన్ని ప్రస్తుత ఈవో కొనసాగిస్తున్నారు. సరుకుల కొనుగోలులో జరుగుతున్న అవినీతిపై పాలక మండలి ధర్మకర్త బహిరంగంగా వ్యతిరేకించటం ఇందుకు నిదర్శనం. సరుకుల సరఫరా ఓ వ్యక్తికి అప్పగించారు. రిటైల్‌ రేటుకంటే అధికంగా ధరలు చూపి అన్నదాన సత్రానికి అందించే లక్షల రూపాయలు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని ధర్మకర్త మల్లికార్జున విలేకరులకు తెలిపారు.

పాలకవర్గం జేబుల్లోకి ప్రసాదం: ఆలయ దర్శనానికి వచ్చిన వీఐపీలకు ఆలయ మర్యాదలలో భాగంగా ప్రసాదాన్ని అందిస్తారు. ఇచ్చిన ప్రసాదాల కంటే ఎక్కువ ఇచ్చినట్లు రాసి, డబ్బులు కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీఐపీల వెంట వచ్చే పది మందికి సైతం ప్రసాదాలు అందించాల్సి ఉంటుంది. ఇదే అదునుగా వందల సంఖ్యలో ప్రసాదాలు పక్కదోవ పట్టి, ఓ వర్గం పాలక మండలి సభ్యులు, ఆలయానికి సంబంధించిన సిబ్బంది జేబుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇది గమనించిన మిగతా సభ్యులు ఉచిత ప్రసాదాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఎవరికీ ప్రసాద వితరణ చేయకూడదని ఆదేశించారు. 

అధిక ధరలు: అన్నదాన సత్రంలో భక్తులకు మధ్యాహ్న భోజనంలో రోజూ అన్నం, సాంబారు, కూరగాయలతో ఒక కూర, మామిడి చట్ని, మజ్జిగ వడ్డిస్తారు. వారంలో ఒక రోజు స్వీట్‌ ఇస్తారు. సెప్టెంబరులో సగటున నెలకు దాదాపు 1,500 మంది భక్తులు భోజనం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెలలో చెక్‌ నంబర్‌ 504752తో రూ1,19,220, చెక్‌ నంబర్‌ 594753తో రూ1,08,960, చెక్‌ నంబర్‌ 460594తో రూ.14,130 డ్రా చేశారు. మొత్తం రూ.2,42,310 డ్రా చేశారు. ఒకరి భోజనం కోసం సుమారు రూ.160 ఖర్చు చేసినట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. అలంపూర్‌ పట్టణంలోని హోటల్స్‌లో ఫుల్‌ భోజనం రూ.70, ప్లేట్‌ భోజనం రూ.60గా ఉంది. హోటల్స్‌లో అన్నం, పప్పు, సాంబారు, రసం, రెండు రకాల కూరగాయలు, రెండు రకాల చెట్నీలు, చిక్కటి పెరుగును వడ్డిస్తారు. వీటిని పరిగనలోకి తీసుకుంటే సత్రంలో జరుగుతున్న అవినీతి ఎలాంటిదో తెలుస్తుంది. సరుకు ధరలు ఎంత అధికంగా వేస్తున్నారో తెలుస్తోంది. ఆలయంలో సిబ్బందికి ప్రత్యేకంగా రుచికరమైన కూరలు చేసుకుంటారనే ఆరోపణలున్నాయి. పాలక మండలిలోని ఓ ధర్మకర్త తనకు భోజనంలో కాజు ఉండాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ధర్మకర్తలంతా ఒకే గొడుగు కింద ఉండటంతో ఆ ధర్మకర్త కోర్కెలను తప్పని పరిస్థితిలో తీరుస్తున్నట్లు తెలుస్తోంది.

పాలక మండలి తీర్మానం చేస్తే చర్యలు

అన్నదాన సత్రంలో జరుగుతున్న అవినీతిపై పాలక మండలి తీర్మానం చేస్తే సరుకులు సరఫరా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. పాలక మండలి తీర్మానిస్తే టెండర్‌ ప్రక్రియకు శ్రీకారం చుడుతాం. ఆలయంలో తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో గుర్తించాలి. వాటిపై సమష్టిగా కృషి చేసి, ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలి. పాలక మండలిలోనూవర్గ విబేధాలు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. జరుగుతున్న సంఘటనలను ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకెళ్లాను.

- మఠం వీరేశం, ఆలయ ఈవో

Updated Date - 2021-10-09T04:30:23+05:30 IST