కొవిడ్‌ నియామకాల్లోనూ అవినీతి..!

ABN , First Publish Date - 2020-08-09T11:30:36+05:30 IST

జిల్లాలోని కొవిడ్‌ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవల నిమిత్తం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చేపట్టిన స్టాఫ్‌నర్సు ఉద్యోగాల భర్తీలో అవకతవకలు ..

కొవిడ్‌ నియామకాల్లోనూ అవినీతి..!

అభ్యంతరాలకు ముందే హడావుడి నియామకాలు 

అవకతవకలకు ఆస్కారం లేదని డీఎంహెచ్‌వో కార్యాలయ వివరణ

ప్రహసనంగా స్టాఫ్‌ నర్సు ఉద్యోగ ఖాళీల భర్తీ 


ఏలూరు ఎడ్యుకేషన్‌, ఆగస్టు 8 : జిల్లాలోని కొవిడ్‌ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవల నిమిత్తం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చేపట్టిన స్టాఫ్‌నర్సు ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలను హడావిడిగా చేపట్టడం పట్ల సీఐటీయూ అను బంధ వైద్య ఉద్యోగుల సంఘ నాయకులతో పాటు పలువురు అభ్యర్థులు అ భ్యంతరాలను లేవనెత్తారు. ఈ నియామకాలపై జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) హిమాన్షుశుక్లాకు ఫిర్యాదు చేస్తున్నట్టు ప్రకటించారు. కొవిడ్‌ ఉధృతి దృష్టా జిల్లాకు మొత్తం 256 స్టాఫ్‌నర్సు ఉద్యోగాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల అనుమతులిచ్చింది. వీటిలో ఇప్పటికే ఆయా పీహెచ్‌సీల పరిధిలో క్లియర్‌ వేకెన్సీల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న పోస్టులు పోనూ, 88 పోస్టులను, ప్రత్యేకంగా ఆరు నెలల కాలపరిమితితో కొవిడ్‌ ఆసుపత్రుల్లో పనిచే సేందుకు ఉద్దేశించిన 100 పోస్టులు కలిపి మొత్తం 188 స్టాఫ్‌నర్సు ఖాళీల భర్తీకి గత నెలలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీక రించారు. ఈ ఉద్యోగా లకు మొత్తం 4850 దరఖాస్తులు వచ్చాయి. 


అర్హుల తాత్కాలిక జాబితాను రెండు రోజుల క్రితం విడుదల చేశారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 13వ తేదీలోగా తగిన ఆధారాలతో సహా తెలపాలని డీఎంహెచ్‌వో కార్యాలయం పేర్కొంది. అయితే శుక్ర, శనివారాల్లో పలువురు అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేయడంతో అక్రమాలు జరిగినట్టుగా ఆరో పణలు వెల్లువెత్తాయి. క్లియర్‌ వెకెన్సీల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థు లకు ఆరు నెలల కాల పరిమితి పోస్టులను ఇవ్వడం, అసలు తాత్కాలిక (ప్రొవిజినల్‌) జాబితాపై అభ్యంతరాలు తెలియజేసే గడువు (ఈనెల 13) ముగియకుండానే ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేయడంపై సీఐటీయూ నాయకులు, పలువురు అభ్యర్థులు అభ్యంతరాలు చెప్పారు. ఈ నియామకాల్లో పెద్దమొత్తంలోనే డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. 


వైద్య ఆరోగ్య శాఖ వివరణ ఇలా..

ఆరోపణలపై డీఎంహెచ్‌వో కార్యాలయ వర్గాలు వివరణ ఇస్తూ జిల్లాలోని పీహెచ్‌సీల్లో క్లియర్‌ వెకెన్సీలుగా ఉన్న 88 స్థానాలకు మాత్రమే ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్‌ లిస్టు వర్తిస్తుందని, కేవలం సంబంధిత స్థానాలకు మాత్రమే జాబితాలో ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 13వ తేదీలోగా స్వీకరిస్తామని స్పష్టం చేశాయి. మిగిలిన వంద ఉద్యోగాలకు కూడా మెరిట్‌ కం రూలాఫ్‌ రిజర్వేషన్‌ను వర్తింప చేసినట్టు వివరించాయి. క్లియర్‌ వేకెన్సీ లపై వచ్చే అభ్యంతరాలను ఈనెల 14, 15 తేదీల్లో పరిష్కరించి, 16న తుది జాబితాను విడుదల చేస్తామని, ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకూ కలెక్టర్‌ అధ్యక్షతన ఉన్న జిల్లా నియామకపు కమిటీ (డీఎస్సీ) నేతృత్వంలో 88 పోస్టు లకు నియామకాలు జరుగుతాయని వివరణ ఇచ్చాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో 10 రోజులపైనే వ్యవధి ఉండడం, ఈలోగా కొవిడ్‌ అత్యవసర సేవల దృష్ట్యా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మొత్తం 4850 దరఖాస్తు దారుల నుంచి మెరిట్‌ కం రిజర్వేషన్‌ నిబంధనలను పాటిస్తూ ప్రస్తుతానికి  తాత్కాలిక ఉద్యోగ నియామక పత్రాలను జారీ చేసి  సిబ్బంది కొరతను భర్తీ చేస్తున్నట్టు వివరించాయి.


తొలుత జిల్లాలో 188 స్టాఫ్‌నర్స్‌ పోస్టులను భర్తీ చేయాదలని నిర్దేశించగా తాజాగా శనివారం మరో 100 పోస్టులను (ఆరు నెలల కాలపరిమితి) కొవిడ్‌ ఆస్పత్రుల్లో భర్తీ చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఆమేరకు మొత్తం దరఖాస్తుల నుంచి మెరిట్‌ కం రూలాఫ్‌ రిజర్వేషన్‌ నిబంధనలు అనుసరించి 288 ఉద్యోగ నియామకాలు చేపడతామ న్నారు. క్లియర్‌ వేకెన్సీలపై ఈనెల 16న విడుదల చేయనున్న తుది జాబితాలో ఉన్న అభ్యర్థులు మాత్రం పీహెచ్‌సీల్లో కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులుగా నియమితు లవుతారని, మిగతా వారంతా ఆరు నెలల కాలపరిమితితో కొవిడ్‌ ఆస్పత్రుల్లో పని చేయాల్సి ఉంటుందన్నారు. కేవలం జాప్యాన్ని నివారించేందుకే అత్య వసర నియామకాలు చేపట్టాల్సి వచ్చిందని, ఎవరికైనా అన్యాయం జరిగిందని భావిస్తే రుజువులతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చని వివరణ ఇచ్చాయి. 


ప్రొవిజినల్‌ లిస్టులో ఈ వివరాలు ఉండాల్సిందే..

వైద్య సిబ్బంది నియామకాలకు విడుదల చేసే ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టు ల్లో కేటగిరీల వారీగా వచ్చే అభ్యంతరాలను స్వీకరించడంతో పాటు సంబంఽ దిత ప్రొవిజినల్‌ లిస్టులోనే అభ్యర్థుల అర్హతా పరీక్ష, మార్కులు, వెయిటేజీని అనుమతిస్తే ఉద్యోగ అనుభవ ధ్రువీకరణ పత్రాల వివరాలు నమోదు చేసి విడుదల చేయాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ భాస్కర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత ఫైనల్‌ మెరిట్‌ లిస్టు, సెలక్షన్‌ లిస్టులను విడుదల చేయాలని ఆదేశించారు.  

Updated Date - 2020-08-09T11:30:36+05:30 IST