HYD : విద్యుత్ శాఖలో లంచావతారాలు.. కాసులు కురిపిస్తున్న శివార్లు

ABN , First Publish Date - 2022-03-06T14:38:21+05:30 IST

మీటర్‌ కావాలంటే లంచం.. విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలంటే లంచం.. విచిత్రం ఏంటంటే ప్రతి పనికీ ప్రత్యేకంగా ఓ రేటు (లంచం) ఫిక్స్‌ చేయడం...

HYD : విద్యుత్ శాఖలో లంచావతారాలు.. కాసులు కురిపిస్తున్న శివార్లు

  • ప్రతి పనికో రేటు
  • ఏసీబీకి చిక్కుతున్నా మారని..
  • కొందరు అధికారుల, సిబ్బంది తీరు

మీటర్‌ కావాలంటే లంచం.. విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలంటే లంచం.. విచిత్రం ఏంటంటే ప్రతి పనికీ ప్రత్యేకంగా ఓ రేటు (లంచం) ఫిక్స్‌ చేయడం. పరిస్థితి ఎలా మారిందంటే.. దానికి మించి అడిగితేనే అవినీతికి పాల్పడినట్లుగా భావిస్తుండడం. 

- గత నవంబర్‌లో ఇబ్రహీంబాగ్‌ డివిజన్‌లో ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏడీఈ ఏసీబీకి చిక్కాడు.

- పదిహేనురోజుల క్రితం మేడ్చల్‌ సర్కిల్‌లో ఓ లైన్‌మన్‌ నెట్‌మీటర్‌ ఇచ్చేందుకు వినియోగదారుడి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసి సస్పెన్షన్‌కు గురయ్యాడు.

- మాదాపూర్‌లో శనివారం లైన్‌ఇన్‌స్పెక్టర్‌, లైన్‌మన్‌ విద్యుత్‌ మీటర్లు ఇచ్చేందుకు రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏడాదిలో ఐదారుగురు ఏసీబీకి చిక్కినా కొంతమంది అవినీతి అధికారుల తీరు మారడం లేదు.


హైదరాబాద్‌ సిటీ : నగరంలో పలు ప్రాంతాలలో విద్యుత్‌ అధికారులు, సిబ్బంది ఆమ్యామ్యాలకు అలవాటు పడి ఏసీబీకీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నా వారి తీరు మారడంలేదు. కొత్త కనెక్షన్ల జారీ, బిల్లులో పేరు మార్పు, ప్యానల్‌ బోర్డుకు ఎస్టిమేషన్‌, ట్రాన్స్‌ఫార్మర్ల కేటాయింపు, లైన్‌ షిఫ్టింగ్‌, టెండర్ల కేటాయింపులు, నామినల్‌ పనుల అప్పగింత.. ఇలా ప్రతి పనికీ ఓ రేట్‌ ఫిక్స్‌ చేసి.. అడిగింది ఇస్తేనే కానీ ఫైల్‌ ముందుకు కదలని పరిస్థితులు విద్యుత్‌శాఖలో సాధారణమైపోయాయి.


ఆరోపణలు వచ్చినా విజిలెన్స్‌ విచారణలో దోషులని తేలినా అధికారులపై టీఎ్‌సఎస్పీడీసీఎల్‌లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కొంతమంది డైరెక్టర్ల అండదండలతో కొందరు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతూ ప్రతి నెలా వారికి కప్పం కడుతుంటారనే ఆరోపణలున్నాయి. మూడేళ్లకోసారి ఉద్యోగులను బదిలీలు చేస్తున్న విద్యుత్‌సంస్థలు ఏడేళ్లుగా ఒకేసీట్లో కూర్చున్న డైరెక్టర్లను ఎందుకు మార్చడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పలు సర్కిళ్లలో కోట్ల రూపాయల విద్యుత్‌చౌర్యం జరుగుతున్నా.. విజిలెన్స్‌, డీపీఈ వింగ్‌ చేస్తున్న దాడుల్లో అక్రమ కనెక్షన్లు, మీటర్‌ ట్యాంపరింగ్‌ కేసులు బయటపడుతున్నా సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, సిబ్బందిని వినియోగదారులే నేరుగా ఏసీబీకి పట్టిస్తున్నారు.


గాడ్‌ ఫాదర్ల అండదండలు

అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు ప్రధానకార్యాలయానికి వచ్చినా గాడ్‌ ఫాదర్ల అండదండలతో ఎలాంటి విచారణ లేకుండానే అధికారులు తప్పించుకుంటున్నారు. చెరువులు, కుంటలు, ఎఫ్‌టీఎల్‌ ప్రాంతాల్లో అక్రమంగా వెలుస్తున్న నిర్మాణాలకు నకిలీపత్రాలతో విద్యుత్‌కనెక్షన్లు ఇస్తున్నారు. పలు ప్రాంతాల్లో లోడ్‌ పెరిగిందని చెపుతూ టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ ఖర్చులతో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తూ సంస్థ ఆదాయానికి గండికొడుతున్నారు. క్షేత్రస్థాయిలో విద్యుత్‌కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం తమ దృష్టికి రాలేదంటూ తప్పించుకుంటున్నారు. విజిలెన్స్‌ అధికారుల తనిఖీల్లో నిజమని తేలినా కిందిస్థాయి సిబ్బందిని బాధ్యులుగా చూపుతూ వారిపై చర్యలుతీసుకొంటున్నారు  సూత్రదారులు తప్పించుకుంటున్నారు.


కాసులు కురిపిస్తున్న శివార్లు.. 

గ్రేటర్‌ చుట్టూ శివారు ప్రాంతాల్లో వేలసంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు, కొత్త వెంచర్లు, కమర్షియల్‌ బిల్డింగ్‌ల నిర్మాణాలు జరుగుతుండటంతో విద్యుత్‌ కనెక్షన్లకు భారీడిమాండ్‌ నెలకొంది. ఈ నేపథ్యంలో కొందరు అధికారులు కొత్తకనెక్షన్లకు దరఖాస్తులు మొదలు, వెంచర్లకు ట్రాన్స్‌ఫార్మర్ల కేటాయింపులు, కొత్త లైన్లు వేయడం వరకు గంపగుత్తగా ఓ రేట్‌ మాట్లాడుకుంటూ మంజూరుచేస్తున్నారనే విమర్శలున్నాయి. డిస్కం సొమ్ముతో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు వేస్తూ ఆ డబ్బులు కూడా కొందరు పంచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. స్థల వివాదంలో ఉన్నా, కోర్టు కేసులున్నా, జీహెచ్‌ఎంసీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేకపోయినా సరే, అడిగినంత ఇస్తే చాలు తప్పుడు చిరునామాలు, పత్రాలు సృష్టిస్తూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి విద్యుత్‌కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. మీటర్లు ఎక్కువ కావాలన్నా ఇంటి నంబర్‌కు బై నంబర్లు వేస్తూ వాటి పేరుతో మీటర్లు జారీచేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. 


ఏసీబీ వలలో విద్యుత్‌ ఉద్యోగులు

నివాస గృహానికి విద్యుత్‌మీటర్‌ను ఏర్పాటు చేసేందుకు  రూ.10వేలు లంచం తీసుకుంటుండగా మాదాపూర్‌ ఎలక్ర్టికల్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, లైన్‌మన్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మాదాపూర్‌లోని ప్రైడ్‌హౌ్‌సలో నివాసం ఉండే నాగజ్యోతి తన ఇంటికి కరెంటు మీటర్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. లైన్‌మన్‌ సతీష్‌, లైన్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌రావు రూ.10వేలు లంచం డిమాండ్‌ చేశారు. డబ్బులు ఇచ్చిన తర్వాతే మీటరు ఇస్తామని చెప్పడంతో నాగజ్యోతి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మాదాపూర్‌ ట్రాన్స్‌కో కార్యాలయంలో నాగజ్యోతి నుంచి లైన్‌మన్‌ సతీష్‌, లైన్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌  లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచి అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-03-06T14:38:21+05:30 IST