పైపై పూత.. పైపులైన్ల మేత

Published: Mon, 16 May 2022 01:20:12 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పైపై పూత.. పైపులైన్ల మేత

ఆర్‌డబ్ల్యూఎస్‌లో మరో భారీ అవినీతి

పైడూరుపాడులో వెలుగుచూసిన కుంభకోణం

నేలను తవ్వకుండా డ్రెయినేజీలు, రోడ్ల పక్కన పైపులు

ఎం బుక్‌లో మాత్రం నేలను తవ్వి వేసినట్టుగా లెక్కలు

ప్రత్యేకాధికారి అనుమతితో బిల్లులు

అవినీతి రికార్డులు.. నాణ్యతలేని పైపులు

జీఎస్టీ కూడా ఎగ్గొట్టారు.. 

విజయవాడ రూరల్‌లో పన్నెండేళ్లుగా ఇదే పరిస్థితి

ఆధారాలతో సహా ‘ఆంధ్రజ్యోతి’ చేతికి..


పై ఫొటోలను చూస్తే నేలను తవ్వి పైపులు వేసినట్టుగా ఉన్నాయా? ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు మాత్రం ఎం బుక్‌లో అదే నమోదు చేశారు. బిల్లులు కూడా సిద్ధం చేసేశారు. స్పెషల్‌ ఆఫీసర్‌ కనీసం చూడకుండానే పర్మిషన్‌ ఇచ్చేశారు. ఇంతకంటే పచ్చిమోసం ఏమైనా ఉంటుందా? వాస్తవానికి ఈ పైపులైన్లంటినీ నేలను తవ్వకుండా డ్రెయినేజీ కాల్వల పక్కన, రోడ్లపైన పడేశారు. మంచినీటి పైపులను పనికిరాని ప్రాంతాల్లో ఓపక్కగా వేయడం సబబేనా? విజయవాడ రూరల్‌ మండలం పైడూరుపాడులో ప్రధానమంత్రి ఆవాస్‌ గ్రామీణ యోజన పథకాన్ని ఆర్‌డబ్ల్యూఎస్‌, విజయవాడ రూరల్‌ ఎండీవో కార్యాలయ అధికారులు ఇలా పైసలు దండుకునే కార్యక్రమంగా మలచుకున్నారు. ప్రజారోగ్యానికి తిలోదకాలిచ్చి జరిగిన ఈ అక్రమ వ్యవహారం ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో బయటపడింది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రక్షిత మంచినీటి పథకాల్లోనే కాదు.. కేంద్ర ప్రాయోజిత పథకం పనుల్లోనూ ఆర్‌డబ్ల్యూఎస్‌, ఎంపీడీవో అధికారుల అవినీతి బయటపడింది. విజయవాడ రూరల్‌ మండలం పైడూరుపాడు గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్‌ గ్రామీణ యోజన (పీఎంఏజీవై) పథకంలో భాగంగా చేపట్టిన గాల్వనైజ్డ్‌ ఐరన్‌ (జీఐ) పైపుల పనుల్లో భారీ అవినీతి చోటుచేసుకుంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం పరిధిలో ఇది మరో స్కామ్‌. పైడూరుపాడు గ్రామ పంచాయతీలో కొత్త హరిజనవాడ, పాత హరిజనవాడలో జీఐ పైపులైన్ల ఏర్పాటుకు గతంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు టెండర్లు పిలిచారు. ఈ పని మొత్తం విలువ రూ.20 లక్షలు. అయితే, కేంద్ర ప్రాయోజిత పథకానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. జీవో నెంబర్‌ 127 ప్రకారం ఒకే పనిని విభజించకూడదు. కానీ, ఈ పనిని నాలుగు పనులుగా విభజించి కట్టబెట్టేశారు. టెక్నికల్‌ శాంక్షన్‌ ప్రకారం చూస్తే ఒక మీటరుకు రూ.755 చొప్పున చెల్లించేలా నిర్ణయించారు. వర్క్‌ స్పెసిఫికేషన్లకు 50 సెంటీమీటర్ల లోతు, 50 సెంటీమీటర్ల వెడల్పున గొయ్యి తవ్వి ఈ జీఐ పైపులు వేయాలి. జీఐ పైపులను కూడా ఐఎస్‌ఐ స్టాండర్డ్స్‌ ప్రకారమే 1239 కోడ్‌ స్పెసిఫికేషన్‌ కలిగినవి వాడాలి. వీటికి ఇన్వాయిస్‌లు ఉండాలి. జీఎస్టీ చెల్లించాలి. అయితే, ఇందుకు విరుద్ధంగా పనులు జరిగాయి. ఎర్త్‌వర్క్‌ అనేది మచ్చుకు కూడా చేయకుండానే నాసిరకం గాల్వనైజ్డ్‌ ఐరన్‌ పైపులతో పనులు చేసేశారు. విజయవాడ రూరల్‌ మండలంలో దశాబ్దకాలానికి పైగా పాతుకుపోయిన ఏఈ ఈ పనులకు సంబంధించి ఎం బుక్‌లలో అన్నీ జరిగిపోయినట్టుగా తప్పుడు రికార్డులు రాశారు. ఏఈ ఎం బుక్‌లలో చేసిన ఈ అంశాలను డీఈఈ పరిశీలించాల్సి ఉంటుంది. అదేమీ జరగకుండానే ఆయన సర్టిఫై చేసేశారు. విజయవాడ డివిజన్‌ ఈఈ కూడా ఓకే అనేశారు. బిల్లులను సిద్ధం చేసేశారు. అప్పటి ఆ గ్రామ ప్రత్యేక అధికారి, ప్రస్తుత విజయవాడ రూరల్‌ మండల ఎండీవో కూడా సీఎఫ్‌ఎంఎస్‌కు పంపించేశారు. క్షేత్రస్థాయిలో ఈ పనులు ఎలా జరిగాయో పరిశీలించాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారిపై ఉంటుంది. కానీ, ఆ పని చేయకుండా సీఎఫ్‌ఎంఎస్‌కు పెట్టేశారు. సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీలు చెల్లించనేలేదు. 

నాణ్యత లేని పైపులతో.. 

ఎర్త్‌వర్క్‌ చేయని పనులకు ఎం బుక్‌లలో అడ్డగోలుగా రికార్డు చేశారు. పైపులైన్లను 50 సెంటీమీటర్ల లోతు, 50 సెంటీమీటర్ల వెడల్పున తవ్వి వేశారని నమోదు చేశారు. నాణ్యత లేని పైపులు వాడితే ఆ విషయాన్ని తెలివిగా మరుగున పరిచారు. ఎలాంటి ఇన్వాయిస్‌లు లేకుండానే ఎం బుక్‌లలో అవి నమోదు చేయకుండానే పనులు చేసినట్టుగా చూపారు. జీఎస్టీ కట్టని విషయాన్ని కూడా అందులో నమోదు చేయలేదు. నాణ్యతలేని జీఐ పైపు ముక్క మీటర్‌ కట్‌ చేస్తే మూడు కేజీలు కూడా రాదు. అదే ఐఎస్‌ఐ 1239 కోడ్‌ జీఐ పైపయితే మూడు కేజీల పైనే బరువు ఉంటుంది. 

జీఎస్టీ మాయ

తాజా స్కామ్‌లోనూ జీఎస్టీ బిల్లులు లేకుండానే పనులు చేపట్టారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి  భారీగానే గండి పడింది. రక్షిత మంచినీటి పథకాల పనుల్లో జీఎస్టీలు లేకుండానే బిల్లులు చేసుకోవటం అలవాటైపోయి ఇలా చేశారని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే జీఎస్టీ రిఫండ్‌ కంటే నాణ్యత లేని పనులతోనే ఎక్కువ డబ్బు గడిస్తున్నారని అర్థమవుతోంది. 

ఇవిగో సజీవ సాక్ష్యాలు

రికార్డుల్లో జరగని పనులను జరిగినట్టుగా చూపినా, పనులెలా చేశారో ప్రజలకు తెలియవా? నాలుగు రీచ్‌లలో పీఎంఏజేవై కింద చేపట్టిన గాల్వనైజ్డ్‌ పనులన్నీ కూడా భూమిని తవ్వకుండా చేపట్టారన్న దానికి ‘ఆంధ్రజ్యోతి’ వద్ద సాక్ష్యాలు ఉన్నాయి. దళిత వాడలలో చేసిన పనుల దృశ్యాలు చూడండి. సిమెంట్‌ రోడ్లు, డ్రెయినేజీ కాల్వల వెంబడి ఓపెన్‌గా పైపులైన్లు వేశారు. రోడ్డు మార్జిన్లలో తవ్వకుండానే పనులు చేపట్టారు. డ్రెయినేజీ గోడల మీద నుంచి పైపులు వేశారు. ఇలా బయటకు కనిపించేలా, డ్రెయినేజీల చెంత పైపులు వేయటం వెనుక ఉద్దేశమేమిటి? నాణ్యతలేని పైపులు వెంటనే దెబ్బతింటాయి. నీరు తగిలితే తుప్పుపట్టి పాడైపోతాయి. అప్పుడు మళ్లీ జీఐ పనులు చేపట్టి ఇదే తరహాలో ప్రజాధనాన్ని దోపిడీ చేయొచ్చని అధికారుల ఉద్దేశం కాబోలు..

పన్నెండేళ్ల అవినీతి

ప్రస్తుతం పీఎంఏజేవై పథకానికి సంబంధించిన నాలుగు రీచ్‌లలో జరిగిన పనులకు సంబంధించి మాత్రమే ఈ కుంభకోణం జరిగిందనుకుంటే పొరపాటే. పన్నెండేళ్లుగా విజయవాడ రూరల్‌ మండల పరిధిలో జరిగిన గాల్వనైజ్డ్‌ ఐరన్‌ పైపులైన్ల పనులన్నింటి పరిస్థితి ఇదే. ప్రస్తుత పనులకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు మీటరుకు రూ.755 ధర నిర్ణయించారు. నాణ్యమైన పైపులు కొనకుండా, ఎర్త్‌వర్క్‌ చేయకుండా, భూమిలో వేయకుండా చేసే పనులకు ఇంత ఎక్కువ మొత్తంలో రేటు చెల్లించటం అంటే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయటమే.

పైపై పూత.. పైపులైన్ల మేత


పైపై పూత.. పైపులైన్ల మేత


పైపై పూత.. పైపులైన్ల మేత


పైపై పూత.. పైపులైన్ల మేత


పైపై పూత.. పైపులైన్ల మేత


పైపై పూత.. పైపులైన్ల మేతపాత, కొత్త హరిజనవాడల్లో భూమిని తవ్వకుండా డ్రెయినేజీల వెంబడి, నేలపై వేసిన పైపులైన్లు


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.