కలెక్టరేట్‌లో అవినీతి ఊడలు!

ABN , First Publish Date - 2021-06-09T05:13:53+05:30 IST

‘జిల్లాకు కలెక్టర్లు వస్తుంటారు.. పోతుంటారు..కానీ చంటిగాడు లోకల్‌’..అన్నట్టుంది కలెక్టరేట్‌ కార్యాలయ సిబ్బంది తీరు. చాలామంది ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకుపోయారు.

కలెక్టరేట్‌లో అవినీతి ఊడలు!
కలెక్టర్‌ కార్యాలయం




కీలక విభాగాల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపై ఆరోపణలు

కార్యాలయ సమస్యలే కొత్త కలెక్టర్‌కు పెను సవాళ్లు

(కలెక్టరేట్‌)

‘జిల్లాకు కలెక్టర్లు వస్తుంటారు.. పోతుంటారు..కానీ చంటిగాడు లోకల్‌’..అన్నట్టుంది కలెక్టరేట్‌ కార్యాలయ సిబ్బంది తీరు. చాలామంది ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకుపోయారు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీ కావాల్సి ఉన్నప్పటికీ పదోన్నతి, స్థాయి మార్పు పేరుతో దీర్ఘకాలంగా ఇక్కడే ఉండిపోయారు. అడ్డగోలు వ్యవహారాలకు అలవాటు పడిపోయారు. కలెక్టరేట్‌లో ఏ నుంచి హెచ్‌ వరకూ విభాగాలున్నాయి. ప్రధాన నాలుగు విభాగాల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపై అవినీతి ఆరోపణలు అధికంగా ఉన్నాయి. ఉన్నతాధికారుల వద్ద సహాయ ఉద్యోగులుగా పనిచేస్తున్న కొంతమంది అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. కొవిడ్‌ కారణంగా బదిలీల ప్రక్రియ లేకపోవడంతో వారు ఆడిందే ఆట..పాడిందే పాట అన్న చందంగా మారిపోయింది. కలెక్టర్‌ కార్యాలయంలో ఏ పని జరగాలన్నా ఉన్నతాధికారుల వద్ద పనిచేస్తున్న వారిని కలిస్తే ఇట్టే జరిగిపోతాయన్న ముద్ర ఉంది. పనిని బట్టి రేటు కట్టి వసూలు చేస్తారన్న అపవాదు ఉంది. ప్రభుత్వ శాఖలకు సంబంధించినవితో పాటు భూ వ్యవహరాలకు సంబంధించిన ఫైల్స్‌ వీరి వద్దకు వెళ్తే క్షణంలో జరిగిపోతాయనే వాదనలు ఉన్నాయి. 


 ఆ ఇద్దరు అధికారుల చుట్టూ..

కలెక్టరేట్‌లో ఇద్దరు కీలక అధికారుల చుట్టూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. భూ వ్యవహారాలకు సంబందించి ఓ ఉన్నతాదికారితో పాటు ఉన్నత విభాగానికి చెందిన కీలక అధికారి సంయుక్తంగా అవినీతి మంత్రాంగం జరిపిస్తుంటారు. భూ వ్యవహారాలకు సంబంధించి ఏ ఫైల్‌ అయినా ఆ ఉన్నతాధికారి వద్దకే ముందుగా రావాలి. ఫైల్‌ను బట్టి ధరలను వారే నిర్థారించి వసూలు చేస్తుంటారు ముగ్గురు మహిళా ఉద్యోగులపై కూడా ఆరోపణలు ఉండడం విశేషం. వీరికి ఉన్నతాధికారుల వద్ద పనిచేస్తున్న వ్యక్తిగత ఉద్యోగుల  అండదండలతో వసూళ్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. దీనికితోడు కొందరు అధికారుల ప్రోత్సాహం ఉండడంతో వీరు రెచ్చిపోతున్నారు. రాజకీయ అండదండలతోనే కలెక్టరేట్‌లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌కు కార్యాలయ సమస్యలే పెను సవాల్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి పరిష్కారంపై దృష్టి పెడితే పాలన గాడిలో పడే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.





Updated Date - 2021-06-09T05:13:53+05:30 IST