వైద్యారోగ్యశాఖకు అవినీతి జబ్బు

ABN , First Publish Date - 2021-11-01T05:25:56+05:30 IST

వైద్యారోగ్యశాఖలో వ్యవహారాలు గాడితప్పాయి. పెద్ద ఎత్తున అవినీతి రాజ్యమేలుతోంది. పైసలిస్తేనే పని జరుగుతోంది. ఇందుకు ఇటీవల ఆ శాఖపై వస్తున్న పలు ఫిర్యాదులే నిదర్శనం. అన్నీ తెలిసినా ఆశాఖ కీలక అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారి కనుసన్నల్లో పనిచేసే ఒక ఉద్యోగి అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ఆయన మొదట్లో గుంటూరులో పనిచేస్తూ ఏసీబీకి చిక్కి కొద్ది రోజులు ఉద్యోగానికి దూరమయ్యాడు. రాజకీయ అండతో మళ్లీ పోస్టు తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి నెల్లూరు జిల్లాకు బదిలీపై వెళ్లి మరోసారి ఏసీబీకి చిక్కి సస్పెండ్‌ అయ్యాడు.

వైద్యారోగ్యశాఖకు అవినీతి జబ్బు
డీఎంహెచ్‌వో కార్యాలయం (ఫైల్‌)

పోస్టింగ్‌ల నుంచి ఉద్యోగోన్నతుల వరకూ వసూళ్లు

అంతా తానై వ్యవహరిస్తున్న ఒక ఉద్యోగి

రెండుసార్లు ఏసీబీకి పట్టుబడి, 

మరోసారి సస్పెండైన వ్యక్తికే అందలం

ఆయనకు ఉన్నతాధికారుల సంపూర్ణ సహకారం

విచ్చలవిడిగా డిప్యుటేషన్లు

వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

పట్టించుకోని అధికారులు

ఒంగోలు (కలెక్టరేట్‌), అక్టోబరు 31 :

వైద్యారోగ్యశాఖకు అవినీతి జబ్బు చేసింది. కీలక అధికారుల తీరు కారణంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పనిచేయాల్సిన శాఖపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారి అండతో ఒక ఉద్యోగి అంతా తానై వ్యవహారాలు చక్కబెడుతున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోస్టింగ్‌ల నుంచి ఉద్యోగోన్నతుల వరకు అన్నింటికీ బేరం పెట్టేశాడు. దీంతో ఆ శాఖలో అంతా కాసుల మాయే నడుస్తోంది. అర్హత ఉన్నా, లేకున్నా అడిగినంత ఇస్తే చాలు డిప్యుటేషన్లు అన్నట్లుగా వ్యవహారాలు నడుస్తున్నాయి. అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉన్నతాధికారులు ఒకసారి విచారణ చేపట్టినప్పటికీ చర్యలు కరువయ్యాయి. దీంతో ఏకంగా వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకే ఫిర్యాదులు వెళ్లాయి.


 

 వైద్యారోగ్యశాఖలో వ్యవహారాలు గాడితప్పాయి. పెద్ద ఎత్తున అవినీతి రాజ్యమేలుతోంది. పైసలిస్తేనే పని జరుగుతోంది. ఇందుకు ఇటీవల ఆ శాఖపై వస్తున్న పలు ఫిర్యాదులే నిదర్శనం. అన్నీ తెలిసినా ఆశాఖ కీలక అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారి కనుసన్నల్లో పనిచేసే ఒక ఉద్యోగి అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ఆయన మొదట్లో గుంటూరులో పనిచేస్తూ ఏసీబీకి చిక్కి కొద్ది రోజులు ఉద్యోగానికి దూరమయ్యాడు. రాజకీయ అండతో మళ్లీ పోస్టు తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి నెల్లూరు జిల్లాకు బదిలీపై వెళ్లి మరోసారి ఏసీబీకి చిక్కి సస్పెండ్‌ అయ్యాడు. పెద్ద ఎత్తున పైరవీలు చేసి మళ్లీ గుంటూరులో పోస్టు సాధించుకున్నాడు. తర్వాత కూడా తన బుద్ధి మార్చుకోకుండా అక్రమాలకు పాల్పడ్డాడు. దీంతో అక్కడి కలెక్టర్‌ అతనిని సస్పెండ్‌ చేశారు. కొద్దికాలం తర్వాత ఒంగోలుకు పోస్టింగ్‌ తెచ్చుకున్నాడు. అయితే రెండుసార్లు ఏసీబీకి చిక్కిన ఉద్యోగికి కీలకమైన బాధ్యతలు అప్పగించకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నా వాటిని పక్కనపెట్టి జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో కీలకస్థానం అప్పగించారు. ఉన్నతాధికారే అతనిని ఇక్కడికి తెచ్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వైద్యారోగ్యశాఖ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిపోయింది.

పైసలిస్తేనే పని

వైద్య ఆరోగ్యశాఖలో ఏపనైనా పైసలిస్తేనే జరుగుతోంది. కొత్తగా పోస్టింగ్‌ల నుంచి ఉద్యోగోన్నతులు, డిప్యుటేషన్ల వరకు అంతా ఇష్టానుసారంగా చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 80శాతం లోకల్‌, 20శాతం నాన్‌లోకల్‌ పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ నిబంధనలకు విరుద్ధంగా 60శాతం లోకల్‌, 40శాతం నాన్‌లోకల్‌ వారికి ఉద్యోగాలు ఇస్తున్నారనే విమర్శలు పెద్దఎత్తున వస్తున్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే అమరావతికి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిగితే వైద్యారోగ్యశాఖ పరువు బజారునపడే పరిస్థితి నెలకొంది.

ఇష్టానుసారంగా డిప్యుటేషన్లు 

జిల్లాలో గతేడాది నుంచి వైద్యారోగ్యశాఖలో ఇష్టానుసారంగా డిప్యుటేషన్లు వేశారనే విమర్శలు ఉన్నాయి. సాధారణంగా డిప్యుటేషన్‌కు కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటన్నింటినీ పక్కనపెట్టి అడిగినంత ఇచ్చిన వారిని అనుకూలమైన ప్రాంతాల్లో నియమించి భారీగా వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై ఇటీవల భారీగా ఫిర్యాదులు రావడంతో  వైద్యారోగ్యశాఖలో విచారణ కూడా జరిగింది. 

అర్హత లేకున్నా ఉద్యోగోన్నతులు

వైద్యారోగ్యశాఖలో అర్హత లేకున్నా ఉద్యోగోన్నతులు లభిస్తున్నాయి. రోస్టర్‌ ప్రకారం ఉద్యోగోన్నతులు కల్పించాల్సి ఉండగా ఇటీవల అందుకు భిన్నంగా వ్యవహరించారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో పనిచేసే ఒక అటెండర్‌కు టైపిస్టుగా ఉద్యోగోన్నతి కల్పించి ఒంగోలులోని మరో కార్యాలయంలో నియమించారు. అయితే ఆ అటెండర్‌కు కనీసం టైపు అంటే కూడా తెలియదు. నియమించిన కార్యాలయంలో టైపు కూడా చేయడం సాధ్యం కాకపోవడంతో ఆ వైద్యాధికారులు డీఎంహెచ్‌వో కార్యాలయానికి సరెండర్‌ చేశారు. ఇదేరీతిలో మరికొందరికి కూడా ఉద్యోగోన్నతులు కల్పించినట్లు సమాచారం. 

అక్రమాలపై కదిలిన అధికారులు

జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై వారం క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. కార్యాలయ అక్రమాలపై మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుజన్‌ మాదిగ వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముద్దాడ రవిచంద్రకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆయన జాయింట్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌తో మాట్లాడినట్లు సమాచారం. దీనిపై స్పందించిన జేసీ చేతన్‌ వెంటనే అందుకు సంబంధించిన పైల్స్‌ను తెప్పించుకున్నట్లు తెలిసింది. ఏసీబీ కేసులో ఉన్న వ్యక్తిని కీలకమైన పోస్టులో ఏవిధంగా డిప్యుటేషన్‌పై నియమించారు తదితర అంశాలన్నింటినీ ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం. 


Updated Date - 2021-11-01T05:25:56+05:30 IST