ltrScrptTheme3

ఔరా.. ఇదేమి మాయ!

Oct 27 2021 @ 00:58AM
బస్తాల కింద, లోపల క్రేట్‌ చెక్కలతో ఏర్పాటు చేసిన సెట్టింగ్‌

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో ‘అవినీతి సెట్టింగ్‌’

బయట నుంచి చూస్తే అన్నీ నిత్యావసరాల బస్తాలే

తరచి చూస్తే లోపల క్రేట్‌ చెక్కలతో అవినీతి గోడలు 

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఉదయమే అంతా సర్దేశారు

రంగంలోకి విజిలెన్స్‌.. స్టాక్‌ పాయింట్‌లో తనిఖీలు 

తనిఖీల మాటున ఉన్నతాధికారుల మాస్టర్‌ ప్లాన్‌ 

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌


ఔరా.. అక్రమార్కుల తెలివి! నిత్యావసరాల కుంభకోణం చాటున ఎంత పెద్ద సెట్టింగ్‌! కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి చాటుమాటుగా తరలించిన రూ.2 కోట్ల విలువ చేసే చౌక బియ్యాన్ని గోడౌన్లోనే ఉన్నట్టు చూపేందుకు నిర్వాహకులు క్రేట్‌ చెక్కలతో ఏర్పాటు చేసిన సెట్టింగ్‌ ఇది. లోపల చెక్కలను పేర్చి, వాటి చుట్టూ, పైన బియ్యం బస్తాలు ఉంచి, గోడౌన్‌ నిండా సరుకు ఉన్నట్టు భ్రమింపజేస్తున్న నిర్వాహకుల అతి తెలివికి అద్దం పడుతున్న ఈ ఫొటోలు ఆంధ్రజ్యోతి చేతికి వచ్చాయి. ఇంత పెద్ద స్కామ్‌ను నాలుగు రోజుల క్రితమే పౌరసరఫరాల అధికారులు ఛేదించినా, ఇంత వరకు కేసు నమోదు చేయకపోవడాన్ని ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం వెలుగులోకి తీసుకొచ్చింది. రూ.40 లక్షల లంచం ఇస్తే శిక్ష తక్కువ వేస్తామంటూ సివిల్‌ సప్లయిస్‌ జిల్లా మేనేజర్‌ కార్యాలయానికి చెందిన ఒక బాస్‌ అక్రమార్కులకు ఆఫరిచ్చినట్టు తెలుస్తోంది. ఇంత భారీ స్కామ్‌ను గుర్తించినా, కేసు నమోదు చేయకపోవడమే కాదు.. ఇంత వరకు కలెక్టర్‌కు కూడా రిపోర్టు చేయలేదంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ / కైకలూరు) : కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లోని అవినీతి బండారం బట్టబయలు అయింది. రాష్ట్రంలోనే అతిపెద్ద బియ్యం స్కామ్‌కు సాక్ష్యాధారాలు ఇవే.. దొంగచాటుగా అమ్ముకున్న రూ.2 కోట్ల పేదల బియ్యాన్ని గోడౌన్లోనే ఉన్నట్టు చూపేందుకు అక్రమార్కులు కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో క్రేట్‌ చెక్కలతో సరుకు లోపల సెట్టింగ్‌ వేశారు. ఈ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో వెలుగు చూసిన అవినీతిపై ‘గోడచాటున నిజం’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావడంతో మంగళవారం ఉదయమే గోడౌన్‌ను తెరిచి, క్రేట్‌ చెక్కలను బయటకు తీసి, ఓ మూలన పడేశారు. నిత్యావసరాల బస్తాలను క్రమపద్ధతిలో ఉంచారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో బియ్యం, పంచదార, కందిపప్పు బస్తాలను నెట్స్‌గా నిల్వ చేస్తారు. ఒక చదరపు నెట్‌లో వాస్తవానికి 323 బస్తాలు పడతాయి. ఈ గోడౌన్‌లో క్రేట్‌ చెక్కలతో సెట్టింగ్స్‌ వేసి, 70 బస్తాలతో కవర్‌ చేశారు. సాధారణంగా క్రేట్‌ చెక్కలను గోడౌన్లలో ఉన్న బస్తాలు చెమ్మకు గురి కాకుండా ఉండటానికి వినియోగిస్తారు. ఫ్లోర్‌ మీద ఒక క్రేట్‌ చెక్కను ఉంచి, వాటి మీద బియ్యం, పంచదార, కందిపప్పు బస్తాలను ఉంచుతారు. కింద ఒక చెక్కను మాత్రమే ఉంచాలి. కానీ ఇక్కడ ప్రతి నెట్‌కూ 12, అంతకు మించి క్రేట్‌ చెక్కలను ఒకదానిపై ఒకటి పేర్చి, వాటిపై బస్తాలను చేర్చారు. దీని చుట్టూ బస్తాలను ఎత్తుగా పేర్చటం వల్ల ఇవన్నీ బస్తాలే అన్న భ్రమ కలుగుతుంది. దీంతో పాటు మరో ఆలోచనను కూడా గోడౌన్లో అమలు చేశారు. ఒక నెట్‌లో చతురస్రాకారంలో బియ్యం బస్తాలను పేర్చి, పైన పరదాలు కప్పి, అవన్నీ బస్తాలుగా భ్రమింప చేశారు. తద్వారా బయటకు బియ్యాన్ని తరలించినా, తనిఖీల్లో ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గోడౌన్‌ నిర్వాహకులు క్రేట్‌ చెక్కల ద్వారా తనిఖీ అధికారులకు ఏ స్థాయిలో మస్కా కొడుతున్నారో సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ ఛాయాచిత్రాలను చూస్తే అర్థమవుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని నాలుగు రోజుల క్రితమే తనిఖీ అధికారులు గుర్తించినా, గుట్టుచప్పుడు కాకుండా ఉంచారు. ఓ అధికారి ఈ వ్యవహారాన్ని ఎన్‌ క్యాష్‌ చేసుకునే ప్రయత్నం చేయటం, రూ.40 లక్షలు డిమాండ్‌ చేయటం చూస్తే పథకం ప్రకారం ఈ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచి లబ్ధి పొందాలన్న ప్రయత్నం జరిగిందని అర్థమవుతోంది.  


రంగంలోకి విజిలెన్స్‌.. 

‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావటంతో కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో ఏమి జరుగుతుందో తెలుసుకునేందుకు విజిలెన్స్‌ రంగంలోకి దిగింది. ఉదయం 11 గంటల సమయంలో విజిలెన్స్‌ సీఐ కె.వెంకటేశ్వరరావు నేతృత్వంలోని బృందం కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో ఆకస్మిక తనిఖీలు జరిపింది. ఈ బృందం గోడౌన్‌లో ఉన్న బియ్యం నిల్వలను పరిశీలించింది. మొత్తం స్టాక్‌ వివరాలపై విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించి, విచారించారు. ఇప్పటి వరకు గోడౌన్‌ నుంచి 138 టన్నుల బియ్యం బస్తాలు మాయమయ్యాయని ప్రాథమిక విచారణలో తేలింది. వీటి విలువ సుమారు రూ.కోటి ఉంటుందని గుర్తించారు. అయితే గోడౌన్‌లోని రికార్డు పుస్తకాలు మాయం కావటంతో, విజిలెన్స్‌ విభాగం ఆ దిశగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రిజిస్టర్‌ బుక్‌ను స్వాధీనం చేసుకుంటే తప్ప గత ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఎంత మొత్తంలో బియ్యం, పంచదార, కందిపప్పు బస్తాలు మాయమయ్యాయో తెలుసుకోవడం కష్టం. విజిలెన్స్‌ అధికారులు ఆన్‌లైన్‌  డేటాను కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది. 


 విజిలెన్స్‌ తనిఖీల వెనక అధికారుల మాస్టర్‌ ప్లాన్‌!  

విజిలెన్స్‌ తనిఖీలపై అనేక అనుమానాలు నెలకొంటున్నాయి. ఈ తనిఖీల ద్వారా ఇప్పటి వరకు జరిగిన భారీ స్కామ్‌ను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు కూడా ఇరుక్కునే అవకాశం ఉండటంతో  ఈ కుంభకోణాన్ని తక్కువ చేసి చూపటం కోసం విజిలెన్స్‌ తనిఖీలను అస్త్రంగా వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని విజిలెన్స్‌ మీద ఒత్తిళ్లు తీసుకు వచ్చి, తక్కువ నిల్వలను చూపే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 


సివిల్‌ సప్లయిస్‌ డీఎం కార్యాలయంలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌  రికార్డులు 

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లోని మాన్యువల్‌ రికార్డు పుస్తకాలు సివిల్‌ సప్లయిస్‌ డీఎం కార్యాలయంలో ఉండటం సంచలనం సృష్టిస్తోంది. నాలుగు రోజుల క్రితం అధికారుల తనిఖీల సందర్భంగా ఈ మాన్యువల్‌ రికార్డులను డీఎం కార్యాలయానికి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ఈ రికార్డులు కార్యాలయంలో ఉంటే.. వారికి అవసరమైనట్టు మార్చుకోవటానికి అవకాశం ఉంది. రూ.40 లక్షల లంచం డిమాండ్‌ చేసిన అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కూడా ఈ రికార్డులను దుర్వినియోగం చేసే అవకాశాలు లేకపోలేదన్న చర్చ నడుస్తోంది. 


గోడౌన్‌కు ఐదు లారీల బియ్యం!

 ఎంఎల్‌ఎస్‌ స్టాక్‌ పాయింట్‌ నుంచి మాయం చేసిన బియ్యాన్ని కొన్ని మిల్లులకు తరలించినట్టు సమాచారం. అయితే అధికారుల తనిఖీల నేపథ్యంలో, ఐదు లారీల బియ్యాన్ని శనివారం గోడౌన్‌కు తిరిగి తెప్పించినట్టు తెలుస్తోంది. ఈ బియ్యాన్ని కొనుగోలు చేసి, ఇక్కడకు తెచ్చినట్టు తెలుస్తోంది. 


వెలుగులోకి రాని కథలెన్నో!

ఇటువంటి భారీ కుంభకోణాలు ఒక్క కైకలూరుకే పరిమితం కాలేదని తెలుస్తోంది. అవనిగడ్డ, మొవ్వ, మైలవరం ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో కూడా ఈ తరహా మోసాలు జరుగుతున్నాయని విజిలెన్స్‌కు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ప్రతి ఎంఎల్‌ఎస్‌ స్టాక్‌ పాయింట్‌లోనూ ఈ తరహా మోసాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏ పాయింట్‌లోనూ డీలర్లకు తూకం వేసి బియ్యం బస్తాలు ఇవ్వటం లేదు. డీలర్‌కు వేసే తూకంలో తకరారుతో పాటు నిల్వల అక్రమ మేనేజ్‌మెంట్‌ ద్వారా వేల క్వింటాళ్ల నిత్యావసరాలను చాటుమాటుగా బయటకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. 


సాక్షాత్తూ మంత్రి నియోజకవర్గంలోనే.. 

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ రెవెన్యూ నియోజకవర్గంలోనే ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణం వెలుగు చూసినా, ఆయన దీని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. బియ్యం బస్తాల రవాణా కాంట్రాక్టర్‌ మంత్రి అనుచరుడేనని, గోడౌన్లో చట్ట విరుద్ధంగా పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తి ఆ కాంట్రాక్టర్‌ మనిషేనని తెలుస్తోంది. రాజకీయ అండదండలు కూడా పుష్కలంగా ఉండడంతో సివిల్‌ సప్లయిస్‌ అధికారులు ఈ వ్యవహారంపై చాలా కూల్‌గా ఉంటున్నారు. 

ఇదో రకం మాయ. బస్తాలను ఇలా సర్ది, మధ్యలో ఖాళీగా ఉంచి, పరదాలు కప్పేస్తారు


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.