రాజకీయ నేతలు అవినీతి చేస్తే తప్పేం కాదు: బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-28T18:05:44+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని రెవా లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎంపీ జనార్ధన్ మిశ్రా.. ఈ నెల 27న అదే జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక నేతలపై వచ్చే అవినీతి గురించి ఆయన స్పందిస్తూ..

రాజకీయ నేతలు అవినీతి చేస్తే తప్పేం కాదు: బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

భోపాల్: రాజకీయ నేతలు అవినీతి చేస్తే తప్పేం కాదని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ జనార్ధన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ అవినీకి కొంత పరిధి ఉంటుందంటూ ఆయన చెప్పుకురావడం గమనార్హం. గడిచిన ఎన్నికల్లో చేసిన ఖర్చు, వచ్చే ఎన్నికల్లో చేయాల్సిన ఖర్చులతో పాటు మరికొంత ఖర్చును లెక్కిస్తూ ఇంత వరకు అవినీతి చేయొచ్చంటూ బహిరంగ సభలోనే ఆయన వ్యాఖ్యానించారు. సదరు ఎంపీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మధ్యప్రదేశ్‌లోని రెవా లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎంపీ జనార్ధన్ మిశ్రా.. ఈ నెల 27న అదే జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక నేతలపై వచ్చే అవినీతి గురించి ఆయన స్పందిస్తూ ‘‘సర్పంచ్ 15 లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. నేను సరదాగా చెప్తున్నాను. 15 లక్షల రూపాయల వరకు అవినీతి చేస్తే మా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. అంతకు మించి అవినీతికి పాల్పడితే మా వద్దకు రండి. ఎందుకు చెప్తున్నానంటే.. గత ఎన్నికల్లో 7 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. వచ్చే ఎన్నికలకు మరో 7 లక్షలు కావాలి. ద్రవ్యోల్బణం పెరిగితే ఇంకో లక్ష పెరగొచ్చు’’ అని జనార్ధన్ అన్నారు.


జనార్ధన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది కొత్త కాదు.. ఆయన గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గెడ్డాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గెడ్డం నుంచి పీఎం ఆవాజ్ యోజన పుట్టింది. మోదీ గెడ్డం ఉన్నన్ని రోజులు ఈ పథకం కింద ఇళ్లు మంజూరు అవుతూనే ఉంటాయని అన్నారు. అంతే కాకుండా.. రైతుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు వస్తే పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల చేతులు నరికేస్తామని, గొంతు పిసికి చంపేస్తామంటూ జనార్దన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.

Updated Date - 2021-12-28T18:05:44+05:30 IST