ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

ABN , First Publish Date - 2022-07-01T08:44:37+05:30 IST

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

కాంట్రాక్టరు నుంచి  రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన కర్నూలు కార్పొరేషన్‌ ఇన్‌చార్జి ఎస్‌ఈ 


కర్నూలు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగర పాలక సంస్థ ఇన్‌చార్జి ఎస్‌ఈ ఇ.సురేంద్రబాబు.. కాంట్రాక్టరు శ్రీనివాసరెడ్డి నుంచి రూ.15 లక్షలు లంచం తీసుకుంటుండగా గురువారం అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శివనారాయణస్వామి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఎస్‌ఈ పట్టుబడడం ఇంజనీరింగ్‌ విభాగంలో కలకలం రేపుతోంది. కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలో గత ప్రభుత్వం లో అమృత్‌ పథకం నిధులు రూ.68 కోట్లతో 430 కి.మీ మేర తాగునీటి పైపులైను, 15 వేల ఇంటింటికి కుళాయిల ఏర్పాటుకు 2018లో టెండర్లు పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన హ్యూంపైప్స్‌ సంస్థ పనులు దక్కించుకుంది. ఆ సంస్థ నుంచి కర్నూలుకు చెందిన శ్రీనివాసరెడ్డి సబ్‌ కాంట్రాక్ట్‌ తీసుకున్నారు. 11,300 కుళాయిలు సహా 426.17 కి.మీ. పైపులైన్‌ పనులు పూర్తిచేశారు. శ్రీనివాసరెడ్డికి ఫైనల్‌ బిల్లు రూ.1.52 కోట్లు రావాల్సి ఉంది. ఆ బిల్లు ఇవ్వాలని ఇన్‌చార్జి ఎస్‌ఈ ఇ.సురేంద్రబాబును సంప్రదిస్తే రూ.35 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి విలేకరులకు వివరించారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని కాంట్రాక్టరు కర్నూలు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శివనారాయణస్వామిని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో రూ.15 లక్షలు సిద్ధంచేసి శ్రీనివాసరెడ్డి... సురేంద్రబాబును ఫోన్‌లో సంప్రదించారు. కృష్ణానగర్‌ ఫ్లైఓవర్‌ బిడ్జి దిగువకు రమ్మంటే.. అక్కడికి వెళ్లి నగదు ఉన్న బ్యాగును ఎస్‌ఈకి అందజేశారు. ఆ బ్యాగులో ఉన్న నోట్ల కట్టలు తీసుకొని చూసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. నగదు స్వాధీనం చేసుకొని ఆయన్ను కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబరుకు  తీసుకెళ్లారు. అక్కడ ఎం-బుక్స్‌, పనులకు సంబంధించిన ఇతర రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయనికి మించి ఆస్తులున్నాయనే సమాచారంతో డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, కృష్ణయ్య, ఇంతియాజ్‌ ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. కాంట్రాక్టరు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు... ఎస్‌ఈ సురేంద్రబాబు రూ.15 లక్షలు లంచం తీసుకుంటుండగా...రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని డీఎస్పీ వివరించారు.

Updated Date - 2022-07-01T08:44:37+05:30 IST