తూప్రాన్‌లో కోర్టు ఏర్పాటయ్యేదెన్నడో?

ABN , First Publish Date - 2021-07-25T05:29:59+05:30 IST

తూప్రాన్‌ కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటైనప్పటికీ రెవెన్యూ శాఖ పరంగా మినహా మిగిలిన విషయాలు అస్థవ్యస్థంగా ఉంది. తూప్రాన్‌ డివిజన్‌ పరిధిలోని మండలాలను పరిశీలిస్తే మండలానికో నియోజకవర్గంలో ఉన్నాయి. తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాలు మెదక్‌ జిల్లాలో ఉన్నప్పటికీ..

తూప్రాన్‌లో కోర్టు ఏర్పాటయ్యేదెన్నడో?

రెవెన్యూ డివిజన్‌లవారీగా కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖం 

తమ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోవాలంటున్న తూప్రాన్‌ డివిజన్‌వాసులు


తూప్రాన్‌, జూలై 24: తూప్రాన్‌ కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటైనప్పటికీ రెవెన్యూ శాఖ పరంగా మినహా మిగిలిన విషయాలు అస్థవ్యస్థంగా ఉంది. తూప్రాన్‌ డివిజన్‌ పరిధిలోని మండలాలను పరిశీలిస్తే మండలానికో నియోజకవర్గంలో ఉన్నాయి. తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాలు మెదక్‌ జిల్లాలో ఉన్నప్పటికీ.. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. మనోహరాబాద్‌ మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు వెల్దుర్తి, మాసాయిపేట మండలాలు నర్సాపూర్‌ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. చేగుంట, మాసాయిపేటలోని కొన్ని గ్రామాలు, నార్సింగి మండలంలోని కొన్ని గ్రామాలు దుబ్బాక నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. నార్సింగి మండలంలోని గ్రామాలు మెదక్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. 


కోర్టు పక్క జిల్లాలో

నియోజకవర్గాల పరిఽధి ఇలా ఉంటే కోర్టు పరిధి మరోలా ఉన్నది. తూప్రాన్‌ డివిజన్‌లోని వెల్దుర్తి, మాసాయిపేట, చేగుంట, నార్సింగి మండలాలు మెదక్‌ కోర్టు పరిధిలోకి వస్తాయి. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఉన్న తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాలు ఇప్పటికీ సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మున్సిఫ్‌ పరిధిలో, సెషన్స్‌ కోర్టు సిద్దిపేట పరిధిలో కొనసాగుతున్నాయి. జిల్లాలు మారినప్పటికీ కోర్టు పరిధి మార్చకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జిల్లాల పునర్విభజనకు ముందు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోనే మున్సిఫ్‌ కోర్టు, సెషన్స్‌ కోర్టులు ఉండేవి. ప్రస్తుతం అలా ఏర్పాటు చేయకపోవడంతో రెవెన్యూ, కోర్టు పరిధులు వేర్వేరుగా ఉంటున్నాయి. ప్రస్తుతం కోర్టు కేసుల్లో ప్రజలు ఇతర జిల్లాల్లో కొనసాగుతున్న కోర్టులకు హాజరుకావాల్సి వస్తున్నది. 


వందల్లో కేసులు

ప్రస్తుతం గజ్వేల్‌ మున్సిఫ్‌ కోర్టు పరిధిలో 300లకుపైగా సివిల్‌ కేసులు ఉన్నట్లు సమాచారం. అలాగే, తూప్రాన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గతేడాది 317, మనోహరాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో 225 కేసులు నమోదయ్యాయి. ఈయేడాది ఇప్పటి వరకు తూప్రాన్‌, మనోహరాబాద్‌లో కలిపి 296 కేసులు నమోదయ్యాయి. కేసుల తీరును పరిశీలిస్తే గజ్వేల్‌ కోర్టు పరిధిలో వెయ్యికిపైగా కేసులున్నట్టు తెలుస్తున్నది. 


మార్పునకు అవకాశం!

తూప్రాన్‌ కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసినందున ఇక్కడ మున్సిఫ్‌ కోర్టు, సెషన్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కనీసం మున్సిఫ్‌ కోర్టునైనా తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉన్నది. ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ జిల్లాలవారీగా కోర్టు పరిధులు మర్చాలని నిర్ణయించింది. ఈమేరకు హైకోర్టు చర్యలు ప్రారంభించింది. ఈమేరకు పాత జిల్లాల పరిధిలోని జిల్లా న్యాయమూర్తులకు హైకోర్టు రిజిస్ట్రార్‌ ఈ నెల 16న లేఖలు రాశారు. రెవెన్యూ జిల్లాల పరిధిలో కోర్టుల ఏర్పాటు, వసతులపై వివరాలు అందజేయాలని ఈ లేఖలో సూచించారు. జిల్లాలో కోర్టుల పరిఽధి మార్పు చేస్తున్నందున తూప్రాన్‌ పరిధిలో కోర్టు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. తూప్రాన్‌లో గతంలో మున్సిఫ్‌ కోర్టు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ కొన్ని కారణాలతో నిలిచిపోయాయి. ఇప్పుడు అవకాశం ఉన్నందున తూప్రాన్‌ పట్టణంలో మున్సిఫ్‌ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


కోర్టులు ప్రజలకు అందుబాటులో ఉండాలి : బొడ్డు శ్రీనివాస్‌, న్యాయవాది, తూప్రాన్‌

ప్రజలకు సత్వర న్యాయం జరిగేందుకు కోర్టుల వికేంద్రీకరణ జరగాలి. జిల్లాల పరిధిలో.. ప్రజల సమీపంలో కోర్టులను ఏర్పాటు చేయాలి. డివిజన్‌స్థాయిలో కోర్టులు ఏర్పాటు చేస్తే ప్రజలకు సత్వర న్యాయం లభిస్తుంది. ఈమేరకు తూప్రాన్‌లో కోర్టు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది.

Updated Date - 2021-07-25T05:29:59+05:30 IST