ముఖాకృతి మెరుగ్గా కనిపించాలంటే ఇలా చేయండి..

ABN , First Publish Date - 2022-02-15T17:28:55+05:30 IST

కంటికి ఇంపుగా కనిపించాలని ఎవరికి ఉండదు? అయితే కొందరికి పుట్టుకతో, లేదా ప్రమాదాలు, జబ్బులతో ముఖాకృతిలో లోపాలు ఏర్పడవచ్చు. వాటిని సరిదిద్దే చికిత్సా విధానమే మాక్జిలో ఫేసియల్‌ సర్జరీ. ఈ సర్జరీలతో ఎలాంటి లోపాలను సరిదిద్దుకోవచ్చో తెలుసుకుందాం!

ముఖాకృతి మెరుగ్గా కనిపించాలంటే ఇలా చేయండి..

ఆంధ్రజ్యోతి(15-02-2022)

కంటికి ఇంపుగా కనిపించాలని ఎవరికి ఉండదు? అయితే కొందరికి పుట్టుకతో, లేదా ప్రమాదాలు, జబ్బులతో ముఖాకృతిలో లోపాలు ఏర్పడవచ్చు. వాటిని సరిదిద్దే చికిత్సా విధానమే మాక్జిలో ఫేసియల్‌ సర్జరీ. ఈ సర్జరీలతో ఎలాంటి లోపాలను సరిదిద్దుకోవచ్చో తెలుసుకుందాం!


ముఖంలో దవడలు, బుగ్గలు, గడ్డం, ముక్కు.. ఇలా వేర్వేరు భాగాలకు సంబంధించి వేర్వేరు ఎముకలు ఉంటాయి. వీటికి సంబంధించి పుట్టుకతోనే లోపాలు ఉండవచ్చు. కొందరు పిల్లలకు పుట్టుకతోనే పెదవులు చీలి ఉండవచ్చు. ఇంకొందరికి దవడల అమరికలో లోపాలు ఉండవచ్చు. దాంతో ఆహారం తీసుకోవడం, మాట్లాడడం ఇబ్బంది కావచ్చు. కొందరికి పుట్టుకతో ఎటువంటి లోపాలూ లేకపోయినా, ప్రమాదాల్లో ముఖానికి దెబ్బలు తగిలి, ముఖంలోని ఎముకలు, దవడలు విరిగిపోవచ్చు. మరికొందరికి నోటి కేన్సర్‌, బ్లాక్‌ ఫంగస్‌ మూలంగా ముఖంలో కొంత భాగం తొలగించవలసి రావచ్చు. ఇలా ముఖాకృతికి సంబంధించిన లోపాలు ఏర్పడినప్పుడు వాటితో సర్దుకుపోవలసిన అవసరం లేదు. వాటిని మాక్జిలో ఫేసియల్‌ సర్జరీలతో పరిపూర్ణమైన ఆకారం సంతరించుకునేలా సరిదిద్దుకోవచ్చు. 


గ్రహణం మొర్రి

ఇది పుట్టుకతోనే వెంట తెచ్చుకునే సమస్య. పై పెదవి, దవడ చీలి ఉండే ఈ సమస్యతో పిల్లలు పుట్టినప్పుడు, మూడు నెలల వయసులో సర్జరీతో ఆ లోపాన్ని సరిదిద్దే వీలుంది. అయితే సాధారణంగా పెదవి లేదా అంగిట్లో ఉన్న తొర్రను సర్జరీతో సరిచేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ నిజానికి పిల్లలు 15 నుంచి 20 ఏళ్ల వయసుకు చేరుకునేవరకూ ఈ సర్జరీలను అంచెలంచెలుగా పలుమార్లు చేయవలసి ఉంటుంది. ఎదిగే క్రమంలో పిల్లల దవడలు, పలువరుసల్లో చోటు చేసుకునే మార్పులకు తగ్గట్టుగా, ఆయా అవయవాలను సర్దుబాటు చేస్తూ సర్జరీలు చేయవలసి ఉంటుంది. పాలు తాగే పసి వయసులో పాలు తాగడానికి వీలుగా ఉండేలా గ్రహణం మొర్రిని సర్జరీతో సరిచేయడం జరుగుతుంది. తర్వాత ఘనాహారం తినే వయసులో సర్జరీ చేయడంతో పాటు, ఆహారం తినడానికి తోడ్పడే ప్రత్యేకమైన పాత్రలు, స్పూన్లను ఉపయోగించే విధానాన్ని వైద్యులు సూచిస్తారు. 


కేన్సర్‌ గడ్డలు

నోటి కేన్సర్‌ దవడ, బుగ్గలు, నాలుక... ఇలా ముఖంలోని ఏ ప్రదేశంలోనైనా రావచ్చు. వ్యాధి సోకిన భాగాన్ని తొలగించి, రీకన్‌స్ట్రక్ట్‌ చేస్తారు. నోటి కేన్సర్‌లో సర్జరీ ప్రధానంగా సాగుతాయి. కాబట్టి కేన్సర్‌ భాగాన్ని తొలగించిన తర్వాత, ముఖంలో ఏర్పడిన లోపాన్ని వైద్యులు అప్పటికప్పుడే రీకన్‌స్ట్రక్ట్‌ చేస్తారు. అవసరాన్ని బట్టి తుంటి లేదా కాలు నుంచి కొంత ఎముకను సేకరించి రీకన్‌స్ట్రక్ట్‌ చేయడం జరుగుతుంది. కేన్సర్‌ కాని కణితులు, దవడలను తినేస్తూ నీటి బుడగల్లా పెరిగే సిస్ట్‌లను తొలగించినప్పుడు కూడా ముఖంలో లోపాలు ఏర్పడతాయి. ఈ లోపాలను కూడా సర్జరీతో సరిచేసుకోవచ్చు. 


రోడ్డు ప్రమాదాల్లో...

రోడ్డు ప్రమాదాల్లో, బాంబు పేలుళ్లలో ముఖంలోని ఏ భాగం ఆకృతి కోల్పోయినా సరి చేయవచ్చు. దవడలతో పాటు ముక్కు, కళ్ల చుట్టూరా ఉండే ఎముకలు, నుదుటిలోని ఎముకలు, బుగ్గల్లోని ఎముకలు... ఇలా ముఖంలోని ప్రతి ఎముకనూ సర్జరీతో సరిచేసే వీలుంది. ముఖంలో విరిగిన ఎముకలను సరిచేసే సర్జరీతో ముఖాకృతి మారిపోతుంది అనుకుంటే పొరపాటు. దంతాల అమరిక ఆధారంగా ముఖంలోని ఎముకల స్థానాలను కచ్చితంగా లెక్కించి, సర్జరీతో సరిచేయడం జరుగుతుంది. కాబట్టి ముఖం పూర్వపు ఆకృతినే సంతరించుకుంటుంది. అలాగే సర్జరీ తర్వాత నమలడం, నోరు తెరిచి, మూయడం లాంటి పనులన్నీ సవ్యంగా జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ఎముకలు సరిదిద్దడానికి కూడా వీలు లేనంతగా డ్యామేజీ కావచ్చు. కణజాలం కూడా పాడయిపోవచ్చు. ఇలాంటప్పుడు తుంటి, లేదా కాలి నుంచి ఎముకను సేకరించి, రీకన్‌స్ట్రక్ట్‌ చేయడం జరుగుతుంది. 


కాస్మటిక్‌ ఫేసియల్‌ సర్జరీలు

ముఖాకృతి పట్ల అసంతృప్తి ఉన్నవాళ్ల కోసం, దవడల్లో హెచ్చుతగ్గుల కారణంగా జీవనశైలి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ల కోసం ఉద్దేశించిన సర్జరీలు ఇవి. దవడలు ముందుకు లేదా వెనక్కి ఉన్నా, ముక్కు వంకర ఉన్నా ఈ లోపాలను కాస్మటిక్‌ సర్జరీతో సరిచేయవచ్చు. దవడల్లో అసమానతలతో నమలడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. కింద దవడ చిన్నగా ఉండడం వల్ల నిద్రలో గురక ఉండవచ్చు. కాబట్టి దవడల్లో హెచ్చుతగ్గులను సర్జరీతో సరిచేయించుకోవడం అవసరం. అలాగే ముక్కును రైనోప్లాస్టీతో సరిదిద్దుకోవచ్చు. ఎత్తుగా ఉండే బుగ్గల ఎముకలను సరిచేయవచ్చు. చెవులు అసంపూర్తిగా ఉంటే, కృత్రిమ మృదులాస్థితో సరిచేయవచ్చు. కళ్ల కింద చర్మం వదులుగా ఉన్నా, పెదవులు లావుగా ఉన్నా, నవ్వినప్పుడు చిగుళ్లు కనిపిస్తున్నా సరిచేసే సర్జరీలు కూడా ఉన్నాయి. పాత గాయాల తాలూకు మచ్చలు, గాట్లు ఇబ్బంది పెడతున్నా, వాటిని కూడా సర్జరీతో సరిదిద్దవచ్చు.


ప్లేట్స్‌ బిగిస్తే...

ముఖంలో విరిగిన ఎముకలను జాయింట్‌ చేయడం కోసం ప్లేట్స్‌ను బిగించడం జరుగుతుంది. ఇవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి చేత్తో ముఖాన్ని తాకినప్పుడు చేతికి తగలడం, అసౌకర్యం కలగడం లాంటివి ఉండవు. ఇవి టైటానియం ప్లేట్లు కాబట్టి వీటిని శరీరం అంగీకరిస్తుంది. కాబట్టి వీటిని తొలగించవలసిన అవసరం ఉండదు.


అపోహలు - వాస్తవాలు

వాపు శాశ్వతంగా ఉండిపోతుంది: ఎలాంటి దెబ్బలు తగిలినప్పుడైనా, వాపు వచ్చి, తర్వాత తగ్గిపోతుంది. మాగ్జిలో ఫేసియల్‌ సర్జరీలలో కూడా ఇలాగే జరుగుతుంది. విరిగిన ఎముకలు సరిచేసిన తర్వాత వారం నుంచి పది రోజుల్లో ముఖంలో వాపు పూర్తిగా తగ్గిపోతుంది. 


మచ్చలు, గాట్లు ఏర్పడతాయి: 90శాతం సర్జరీలు నోటి లోపలి నుంచి చేస్తారు కాబట్టి, ముఖం మీద గాట్లు, మచ్చలు ఏర్పడే వీలుండదు. తప్పనిసరి పరిస్థితుల్లో చర్మం ద్వారా సర్జరీ చేయవలసిన అవసరం పడితే, ముఖంలోని ముడతల గుండా సర్జరీ చేయడం జరుగుతుంది. 


కంటి చూపు, వినికిడి దెబ్బతింటాయి: సర్జరీ ప్రభావం కళ్ల మీద ఉండదు. కాబట్టి కంటి చూపు దెబ్బతినదు. వినికిడి శక్తి తగ్గదు.


ప్లేట్లు తీసేయాలి: సాధారణంగా ముఖంలో బిగించే ప్లేట్లతో ఎటువంటి సమస్యలూ ఎదురు కావు. ఎంతో అరుదుగా ఆ ప్లేట్లు ఇన్‌ఫెక్ట్‌ అయినప్పుడు, వాటిని వైద్యులు తొలగిస్తారు. వీటిని తీయడం వల్ల కూడా ఎటువంటి సమస్యలూ తలెత్తవు.


ముఖాకృతి మారిపోతుంది: దంతాల అమరిక ఆధారంగా కచ్చితమైన కొలతలతో ముఖంలోని ఎముకలను, లోపాలను సరిదిద్దడం జరుగుతుంది. కాబట్టి ముఖానికి పూర్వపు ఆకృతే చేకూరుతుంది తప్ప కొత్త ఆకృతి సంతరించుకోదు.


టెంపరో మాండిబ్యులర్‌ జాయింట్‌

నోరు తెరచి మూసేటప్పుడు, చెవికి దిగువన ఒక జాయింట్‌ కదులుతున్నట్టు గమనించవచ్చు. ఇదే టెంపరో మాండిబ్యులర్‌ జాయింట్‌. దవడలను కదిలించడానికీ, నోరు తెరిచి మూయడానికీ ఈ కీలు తోడ్పడుతుంది. మోకీళ్లు, తుంటి కీళ్లు అరిగిన విధంగానే దవడ జాయింట్లు కూడా అరుగుతాయి. ఈ కీలు పెరిగే వయసుతో పాటు, ఒత్తిడి వల్ల కూడా అరుగుతుంది. ఈ సమస్య 25 నుంచి 30 ఏళ్ల వయస్కుల్లో కూడా తలెత్తుతూ ఉంటుంది. నోరు తెరిచి, మూసుకునేటప్పుడు చెవి దగ్గర టక్‌ టక్‌మనే శబ్దాలు వినిపిస్తాయి. నోరు తెరుచుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. గట్టి పదార్థాలను కొరకలేకపోవడం, తరచుగా జాయింట్‌ పట్టు తప్పడం లాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మిగతా కీళ్ల మాదిరిగానే దీన్ని కూడా మార్పిడి చేసుకోవచ్చు. కీలులో వాపు ఉంటే, ఆర్ర్థోస్కోపీ ద్వారా జాయింట్‌ను కడగడం, డిస్క్‌ను రీలొకేట్‌ చేయడం లాంటి చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. కీలు పూర్తిగా అరిగిపోతే కృత్రిమ కీలుతో మార్పిడి చేసుకోవచ్చు.



డాక్టర్‌ సురేష్‌ పిఎల్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, 

మాగ్జిలో ఫేసియల్‌ సర్జన్‌, కేర్‌ హాస్పిటల్స్‌, 

హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌

Updated Date - 2022-02-15T17:28:55+05:30 IST