ఉస్మానియాలో తొలిసారిగా కాస్మెటిక్‌ సర్జరీ

ABN , First Publish Date - 2021-09-17T16:58:21+05:30 IST

సినీ ప్రముఖులు, ధనిక వర్గాలకు మాత్రమే చేరువలో ఉండే కాస్మెటిక్‌ సర్జరీలను ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చి సరికొత్త రికార్డును

ఉస్మానియాలో తొలిసారిగా కాస్మెటిక్‌ సర్జరీ

ఖరీదైన వైద్యం ఇక ఉచితంగానే లభ్యం

ఇన్నాళ్లూ ఉన్నత వర్గాలకే పరిమితం

నేడు పేదలకు అందుబాటులోకి


హైదరాబాద్/మంగళ్‌హాట్‌:  సినీ ప్రముఖులు, ధనిక వర్గాలకు మాత్రమే చేరువలో ఉండే కాస్మెటిక్‌ సర్జరీలను ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చి సరికొత్త రికార్డును సృష్టించారు. ముక్కు వంకర, పెదాల మార్పు, ముఖాన్ని మరింత అందంగా మార్చుకోవడం వంటి కాస్మెటిక్‌ శస్త్ర చికిత్సలను ఇప్పుడు ఉస్మానియాలో పేదలకు ఉచితంగా చేసి చూపిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో మొట్టమొదటిసారి ‘బ్రెస్ట్‌ ఆగ్మెంటేషన్‌ మెమో ప్లాస్టిక్‌ సర్జరీ’ ద్వారా ఓ యువతికి రొమ్ము సైజులోని వ్యత్యాసాన్ని సరి చేశారు. ఈ మేరకు గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌, ప్లాస్టిక్‌ సర్జరీ హెచ్‌ఓడీ డాక్టర్‌ లక్ష్మి, అనస్తీషియా విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ పాండు నాయక్‌లు వివరాలు వెల్లడించారు. 


నల్గొండ జిల్లా దేవరకొండ మండలానికి చెందిన 18 ఏళ్ల యువతికి మొదటి నుంచి కుడిపైపు రొమ్ము భాగం పెరగలేదు. దీంతో గత నెల 15వ తేదీన ఉస్మానియా ఆస్పత్రి ప్లాస్టిక్‌ సర్జరీ విభాగానికి ఓపీ చికిత్సల నిమిత్తం వచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు శస్త్రచికిత్స ద్వారా సరిచేయవచ్చని సూచించారు. ఈ నెల 1న ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకున్న ఆ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ లక్ష్మి అదేరోజు అనస్తీషియా విభాగం వైద్యుల సహకారంతో ఐదు గంటలపాటు శ్రమించి రొమ్ము భాగాన్ని సరిచేశారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యంగా ఉండడంతో డిశ్చార్జ్‌ చేసినట్లు చెప్పారు. దాదాపు 48 సంవత్సరాల్లో ఉస్మానియా ఆస్పత్రిలో ఇలాంటి సర్జరీ జరగలేదని, తొలిసారి ఈ రకమైన సర్జరీ చేయడం జరిగిందని చెప్పారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో రూ.3లక్షలనుంచి రూ. 5 లక్షల వరకు ఖర్చు అయ్యే శస్త్ర చికిత్సను ఉచితంగా చేయడంతో వైద్యులకు సదరు యువతి కృతజ్ఞతలు తెలిపింది. సర్జరీలో పాల్గొన్న హెచ్‌ఓడీ డాక్టర్‌ పి.లక్ష్మి, అసిస్టెంట్‌ సర్జన్లు డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ గౌడ్‌, డాక్టర్‌ అశ్విన్‌ కిషోర్‌, అనస్తీషియా విభాగం వైద్యులు డాక్టర్‌ పాండునాయక్‌, పావని, అనుపమ, ఆనంద్‌లను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఉన్నత వర్గాలకే పరిమితమైన సర్జరీలను తాజాగా ఉస్మానియా లాంటి చరిత్రాత్మక ఆస్పత్రిలో ఉచితంగా పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, ఈ సేవలను పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Updated Date - 2021-09-17T16:58:21+05:30 IST