‘వ్యయ’సాయం!

May 8 2021 @ 23:27PM

ఎరువుల ధర భారీగా పెంపు

ముడిసరుకుల సాకుగా చూపి పెంచిన యాజమాన్యాలు

నియంత్రించలేని స్థితిలో ప్రభుత్వాలు

ఆందోళనలో రైతులు

ఎరువుల ధర మోత మోగనుంది. అన్నిరకాల కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను కంపెనీలు భారీగా పెంచాయి. గత నెలలోనే పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ఇప్పుడు అనుమతిచ్చింది. దీంతో కంపెనీలు పెరిగిన ధరలను ప్రకటించాయి. డీఏపీ బస్తా రూ.1,200 నుంచి రూ.1,900కు పెరగగా..అన్నిరకాల ఫాస్పేట్‌ ధరలు రూ.350 నుంచి రూ.700కు ఎగబాకాయి. డీజిల్‌ ధర పెంపుతో సాగు పెట్టుబడులు పెరగగా..ఇప్పుడు ఎరువుల ధరతో రైతులపై అదనపు భారం పడనుంది. 


(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర లభించడం లేదు. కానీ.. సాగు వ్యయం మాత్రం అమాంతం పెరుగుతోంది. గిట్టుబాటు ధరలు అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్నా కొనుగోళ్లకు వచ్చేసరికి సవాలక్ష ఆంక్షలు. యాంత్రీకరణతో సాగు సులభమైనా రైతుకు మాత్రం పెట్టుబడులు పెరిగాయి. డీజిల్‌ ధర పెంపు ప్రభావం పరోక్షంగా రైతుపై పడింది. ఇప్పుడు ఎరువుల ధరలను సంబంధిత కంపెనీలు 50 శాతానికిపైగా పెంచాయి. అన్నిరకాల కాంప్లెక్స్‌ ధరలు అమాంతం పెరిగాయి. రూ.1,275 ఉన్న డీఏపీ బస్తా రూ.1,975కు పెరిగింది. రైతుకు అందనంత దూరానికి ఎగబాకింది. 20-20 రకం రూ.950 నుంచి రూ.1,400కు, 28-28 రకం రూ.1,350 నుంచి రూ.1,700కు, 15-15-15 రకవ రూ.1,040 నుంచి రూ.1,200కు, ఎంవోపీ రూ.580 నుంచి రూ.1,000కు పెంచుతున్నట్టు సంబంధిత కంపెనీలు ప్రకటించాయి. 

వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అంతంతే..

రైతు పండించే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నత్తనడకన పెరుగుతుండగా.. సాగు పెట్టుబడులు, ఎరువుల ధరలు మాత్రం జెట్‌ స్పీడ్‌లో పెరుగుతున్నాయి. వ్యయప్రయాసలతో వ్యవసాయం చేసినా..వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తేనే సాగు గిట్టుబాటయ్యేది. లేకుంటే అప్పులే మిగులుతాయి. అందుకే ఎక్కువ మంది వ్యవసాయాన్ని విడిచిపెట్టి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై దృష్టి పెడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటిస్తున్న ప్రభుత్వాలు వాటి కొనుగోలు విషయంలో కొర్రీలు పెడుతున్నాయి. గత ఏడాది ఖరీఫ్‌లో పండించిన ధాన్యం ఇంతవరకూ విక్రయించలేని స్థితిలో రైతులు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ధాన్యంతో పాటు మొక్కజొన్న, పత్తి, చెరకు వంటి వాటికి ఏడా ఖరీఫ్‌, రబీ సీజన్‌లో మద్దతు ధర ప్రకటిస్తున్నారు. ముందు ఏడాది కంటే రూ.50, రూ.100 వరకూ అదనంగా పెంచుతున్నారు. అదే ఎరువుల విషయానికి వచ్చేసరికి మాత్రం ఉన్న ధరకు 50 శాతం పెంచినా నియంత్రించలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి సరుకులు పెరిగాయని ఎరువుల కంపెనీల యాజమాన్యాలు చెప్పుకొస్తున్నాయి. దీంతో ధరల పెంపునకు ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నాయి. దీంతో అవి ఎడాపెడా ధరలు పెంచి రైతుల నడ్డి విరుచుతున్నాయి. దశాబ్ద కాలం డీఏపీ బస్తా ధర రూ.450 ఉంటే ఇప్పుడు దాని ధర రూ.1,975లకు పెరిగిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.  

డీజిల్‌ ధర పెంపుతో భారం

వ్యవసాయంలో యాంత్రీకరణ గణనీయంగా పెరిగింది. తద్వారా రైతుకు సమయంతో పాటు పెట్టుబడి ఆదా అవుతుందని చెప్పుకొస్తోంది. సమయం వరకూ నిజమే అయినా పెట్టుబడి విషయానికి వచ్చేసరికి మాత్రం అమాంతం పెరుగుతోంది. దుక్కులు, నాట్లు, నూర్పులు వంటి అన్నింటికీ ఇప్పుడు యంత్రాలే దిక్కు. కానీ డీజిల్‌ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతుండడంతో యంత్రాల అద్దె ధరలను కూడా పెంచుతున్నారు. దీంతో ట్రాక్టర్లు, నూర్పు యంత్రాలు, ఇతర పరికరాల అద్దెలు ఏడాదికేడాది పెరుగుతూ వస్తున్నాయి. దీంతో చాలామంది రైతులు భూములను కౌలుకు ఇస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు దృష్టిసారిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు స్వాంతన చేకూర్చే నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి కార్పొరేట్‌ యాజమాన్యాలకు అనుకూలంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ధరలను నియంత్రించాలని రైతులు కోరుతున్నారు. ఎరువుల ధర పెంపుపై మార్క్‌ఫెడ్‌ అధికారుల వద్ద ప్రస్తావిస్తే పెరిగిన ధరల జాబితా ఇంకా అధికారికంగా రావాల్సి ఉందన్నారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.