పత్తికి పైకమేది?

ABN , First Publish Date - 2020-11-30T06:05:03+05:30 IST

పత్తికి పైకమేది?

పత్తికి పైకమేది?
తొగుట మండలం మెట్టు గ్రామంలో కూలీల ఖర్చు భారమై చేనులోనే వదిలేసిన పత్తి

గిట్టుబాటు ధర లేక రైతన్న దిగాలు

వర్షాలతో నల్లబారిందని సాకు

రైతులకు శాపంగా సీసీఐ నిబంధనలు

దళారులు, వ్యాపారుల చేతుల్లోకి తెల్ల బంగారం

జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో పత్తిసాగు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, నవంబరు 29: తెల్లబంగారం పండించిన రైతుల ముఖాలు ఆవేదనతో తెల్లబోతున్నాయి. దూదిపూలు సాగుచేసి దు:ఖంతో తల్లడిల్లుతున్నారు. ఓ పక్క వర్షాలతో చేన్లు దెబ్బతినగా..అరకొరగా వచ్చిన దిగుబడికీ సరైన ధర లేదని ఆవేదన చెందుతున్నారు. కొనుగోళ్లకు ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ నిబంధనలు విధించడంతో దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.

 జిల్లావ్యాప్తంగా 2.43 లక్షల ఎకరాల్లో ఈ వానాకాలం పత్తి సాగుచేశారు. నియంత్రిత సాగులో భాగంగా ఈసారి సుమారు 50వేల ఎకరాల్లో అధికంగా పత్తి సాగువైపు దృష్టి పెట్టారు. మొత్తంగా 20 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. 


ప్రైవేట్‌ వ్యాపారుల చేతుల్లోకి

జిల్లాలోని 24 జిన్నింగ్‌ మిల్లులు, మార్కెట్‌ యార్డుల్లో సీసీఐ కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేసే  అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు సీసీఐ ద్వారా 95 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. తేమశాతం 8 నుంచి 12 వరకు ఉంటేనే రూ.5,496 నుంచి రూ.5,825 వరకు చెల్లిస్తామని సీసీఐ ప్రకటించింది. 12శాతం తేమను మించితే కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పారు. అదే ప్రైవేట్‌ వ్యాపారులు జిల్లా వ్యాప్తంగా 1.23లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని క్వింటాల్‌కు రూ.5,725 చెల్లించగా ప్రైవేట్‌ వ్యాపారులు మాత్రం రూ.4,200 నుంచి 4,700 వరకు చెల్లించారు. సీసీఐ కంటే ఎక్కువగా ప్రైవేట్‌ వ్యాపారులే పత్తిని కొనుగోలు చేస్తున్నట్లుగా తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీని వల్ల పత్తిరైతులు క్వింటాల్‌కు రూ. 1000 చొప్పున నష్టపోతున్నారు. 


పల్లెల్లో దళారుల అడ్డా

పత్తిపూలు చేతికొచ్చే దశలోనే అకాల వర్షాలు కురిశాయి. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా 60వేల ఎకరాల వరకు పత్తిచేన్లు దెబ్బతిన్నాయి. పత్తిపూలు నల్లబారాయి. తీసిన పత్తిని చాలామంది రైతులు ఇళ్లవద్దనే ఆరబెడుతున్నారు.  తేమ ఎక్కువగా ఉండడం, నల్లబారిపోయి కనిపించడంతో ధర తక్కువగా వస్తుందని మార్కెట్‌కు, వ్యాపారుల వద్దకు తీసుకెళ్లడం లేదు.  ఇళ్లలోనే నిల్వఉంచి మంచి ధర వచ్చినపుడు విక్రయించడానికి సిద్ధమయ్యారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు దళారులు పల్లెల్లో అడ్డా వేస్తున్నారు. వెం టనే డబ్బు ఇస్తామని చెప్పి ఇళ్లలో ఉన్న పత్తిని కొంటున్నారు. మార్కెట్‌కు తీసుకెళ్లే రవాణా ఛార్జీలు, తేమ, పడిగాపులు పడే సమస్యలేవి లేకుండా ఇక్కడే కొంటామని చెబుతున్నారు. దీంతో రైతులు కూడా వీరికే అమ్ముతున్నారు. రూ.3,500 నుంచి రూ.4వేలకు మించి దళారులు ధర పెట్టడం లేదు. ఇలా దళారులు కొనుగోలు చేసిన పత్తిని అధిక ధరకు మళ్లీ ప్రైవేట్‌ వ్యాపారులకు, సీసీఐకి విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. 


చేలల్లోనే వదిలేస్తున్నారు..

వర్షాలతో పత్తిచేన్లు దెబ్బతినడం, పత్తిపూలు నల్లగా మారడంతో కొందరు రైతులు తమ పత్తిని ఏరకుండా చేలల్లోనే వదిలేస్తున్నారు. ఒక్కో కూలికి రూ.300 చొప్పున 10మంది కూలీలను పెట్టి ఏరిస్తే క్వింటాల్‌ పత్తి కూడా రావడం లేదని, పైగా కూలీ డబ్బులు చెల్లించడం కష్టంగా మారిందని చెబుతున్నారు. కొన్ని చోట్ల మాత్రం రైతులే తమకు వీలున్నప్పుడల్లా పత్తిపూలు తీసి ఇళ్లలో నిల్వ ఉంచుతున్నారు. కూలీలపై ఆధారపడకుండా కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి పత్తి ఏరివేతలో పాలుపంచుకుంటున్నారు. 

ఏదేమైనా 20లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా ఇప్పటి వరకు సుమారు 2.25లక్షల క్వింటాళ్ల పత్తిని మాత్రమే అధికారికంగా విక్రయించారు. మిగతా పత్తి నిల్వలు ఇళ్లలో, చేలల్లో ఉన్నాయి. పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్‌ ఇప్పుడిప్పుడే తెరమీదకు వస్తున్నది. పెద్దఎత్తున పత్తిని విక్రయించాల్సిన పరిస్థితి ముందుండడంతో సర్కారుకు, అధికారులకు తలనొప్పి తప్పదనే  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


 చేన్ల వదల్లేక.. కైకిలి ఇయ్యలేక

- ఎంగారి నర్సవ్వ, దుబ్బాక

సర్కారోళ్లు చెప్పిండ్రని రెండెకరాల్లో వరి, నాలుగెకరాల్లో పత్తి వేసినం. వర్షానికి ఆరు ఎకరాలు కరాబైంది. పత్తి నల్లగైంది. చేన్లనే వదిలితే మనుసు రావడం లేదు. కైకిళ్లు పెట్టి ఏరిద్దామంటే దిగుబడి రాదు. మా రెక్కల కష్టమంతా పోయింది. 3500 రూపాయలు కింటాల్‌కు పెడ్తామని అంటాండ్రు. గీ పైసలు దేనికి మొదలైతయి. పెట్టుబడి పైసలు కూడా దిక్కులేదు. అందుకే కైకిలి పెట్టకుండా మేమే పత్తి ఏరుతున్నం. 


ఎట్లున్నా పత్తి కొనాల్సిందే

- స్వామిరెడ్డి, రైతు, బండారుపల్లి, తొగుట

కష్టపడి పత్తిసాగు చేశాను. అన్ని రకాల మందులు కొట్టి మంచిగా చూసుకున్నా. అనుకోకుండా వర్షాలు పడ్డాయి. దానికి రైతులేం చేస్తారు. దేవుడు చేసిన అన్యాయానికి మమ్ములను బలిచేస్తారా. సీసీఐ వాళ్లు మా పత్తి కొనబోమని అంటున్నారు. ఇంటిదగ్గరే నిల్వ ఉంచుకున్న. ఇప్పటికైనా సర్కారోళ్లు స్పందించాలె. పెద్ద ధర పెట్టి పత్తి కొనాలి. ఇలాగైతే రైతుల పరిస్థితి ఆగమైతది. మక్కలు కూడా ఎక్కువ తక్కువ పండితే కొనరట. 




Updated Date - 2020-11-30T06:05:03+05:30 IST