పత్తితో సిరుల పంట

ABN , First Publish Date - 2020-10-10T05:58:48+05:30 IST

ప్రభుత్వం ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో టెక్స్‌టైల్‌ ప్రాసెసింగ్‌ పార్కు ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో రోజుకి సుమారు 40 లక్షల స్పిన్డేల్స్‌ నుంచి తయారయ్యే 20 లక్షల కేజీల...

పత్తితో సిరుల పంట

ప్రభుత్వం ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో టెక్స్‌టైల్‌ ప్రాసెసింగ్‌ పార్కు ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో రోజుకి సుమారు 40 లక్షల స్పిన్డేల్స్‌ నుంచి తయారయ్యే 20 లక్షల కేజీల దారాన్ని రకరకాల వస్త్రాలుగా మార్చగలిగితే ప్రత్యక్షంగా పరోక్షంగా 50 లక్షలమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వాలకు జి.ఎస్‌.టి. రూపంలో సుమారు 3500–-4000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది.


వ్యవసాయం తరువాత నైపుణ్యం లేని కార్మికులకు భారీగా ఉపాధి కల్పిస్తున్న ఏకైక పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. ఈ పరిశ్రమకు ముడిపదార్థమైన పత్తి ఉత్తతిలో మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌ దేశంలో అతి పెద్ద ఉత్పత్తిదారుగా గుర్తింపు పొందింది. ముడిపట్టు ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ఈ రంగంలో ప్రత్యక్షంగా 60 లక్షలమంది రైతులు, 5 కోట్ల మంది ప్రజలు జీవనోపాధి పొందుతున్నారు. మన రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కాటన్‌ మిల్లులున్నాయి.  


ప్రస్తుతం పత్తి పరిశ్రమ ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది. ముడి పదార్థాల ఖర్చు అనూహ్యంగా పెరిగింది. విద్యుత్ ఛార్జీలు కూడా భారీగానే పెరిగాయి. ఈ ధరల నిరంతర పెరుగుదల వల్ల పరిశ్రమలు తయారు చేసే నూలు ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతోంది. దానికి తగ్గటుగా అమ్మకపు ధర ఉండడం లేదు. నూలు కొనుగోలుదారులు కూడా దేశీయ ఉత్పత్తులను నిర్లక్ష్యం చేసి తక్కువ ధరలకు సరఫరా చేసే చైనా, పాకిస్థాన్‌, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల నుంచి దిగుమతులు చేసుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు. నూలు పరిశ్రమలలో పని చేయటానికి అవసరమైన నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, కార్మికుల కొరత కూడా ఈ మధ్య బాగా పెరిగింది. స్థానిక కార్మికుల కొరత ఎక్కువగా ఉన్నందున బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిషా రాష్ట్రాల కార్మికులపై ఆధారపడవలసి వస్తోంది. దానికి తోడు 75శాతం స్థానిక కార్మికులను పెట్టుకోవాలి అన్న ప్రభుత్వ నిబంధన ఈ పరిశ్రమపై మరింత ప్రభావం చూపుతోంది. 


పత్తిని పండించే రైతుల సమస్యలు మరోలా ఉన్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల రూపంలో ఉత్పత్తి వ్యయం నిరంతరం పెరుగుతోంది. ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధర ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగా ఉంటోంది. పైగా అనేక సంవత్సరాల పాటు నాణ్యత లేని పురుగుమందుల వాడకం వల్ల భూ సారం క్షీణించి దిగుబడులు తగ్గుతున్నాయి. నీటి వనరులను సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం, భూగర్భజలాలు తగ్గిపోవటం వంటి అంశాలు రైతులను మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పత్తి సాగులో నూతన సాంకేతికత తగినంతగా అందుబాటులోకి రాలేదు. పత్తి తీత అనేది మనదేశంలో పూర్తిగా మానవ వనరుల ద్వారానే జరుగుతోంది. ఒక కిలో పత్తి తీయటానికి రూ.15- ఖర్చు అవుతోంది. పత్తి తీతను యాంత్రీకరించగలిగితే ఈ ఖర్చు తగ్గుతుంది. 


రైతులకు ఆలంబనగా పత్తి పరిశ్రమకు ప్రభుత్వం కొంత చేయూత నివ్వాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలలో పరిశ్రమలు విద్యుత్‌ బిల్లులలోని రాయితీని మినహాయించుకుని బిల్లులు చెల్లిస్తున్నాయి. ఈ విధానాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేస్తే బాగుంటుంది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పరిశ్రమలకు సరఫరా చేసే పత్తి రేటును, మార్కెట్లో ఉన్న నూలు రేటు ఆధారంగా ఖరారు చేయాలి. పత్తి ధరలో అస్థిరత్వానికి కారణం, గడచిన సంవత్సరం చైనాకు ఎగుమతులు నిలిచిపోవటం. అవసరానికి మించి సరఫరా ఉన్నందున ధరలు పతనమై పరిశ్రమలు చాలా నష్టపోతున్నాయి. ధరల స్థిరీకరణకు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక నిధిని కేటాయించాలి. ఇందులో రైతులను, పరిశ్రమల ప్రతినిధులను, ప్రభుత్వాన్ని భాగస్వాముల్ని చేసి ఒక కొత్త ప్రక్రియను ప్రారంభించాలి. ఉత్పత్తుల ఆదాయాలు మిల్లులకు, రైతులకు ఒకే నిష్పత్తిలో ఉండేలా చూడాలి. 


గుంటూరు జిల్లా, చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉత్తత్తి అయ్యే పత్తి చాలా నాణ్యమైనది. కానీ రైతులు పరిశ్రమలకు పత్తిని తరలించేటప్పుడు పిపి బాగ్స్‌ ఉపయోగించటం వల్ల ప్రాసెసింగ్‌ చేసేటప్పుడు వాటి ముక్కలు పత్తిలో కలిసి నాణ్యమైన దారం రావటం లేదు. ఇలాంటి దారాన్ని వస్త్రపరిశ్రమకు విక్రయించినపుడు వస్త్రాల తయారీలో నాణ్యత లోపించి సరఫరా చేసిన వారికి జరిమానాలు పడుతున్నాయి. నూలు పరిశ్రమ నష్టాలు ఎదుర్కోవడానికి ఇదొక ప్రధాన కారణం. జిన్నింగ్‌ అసోసియేషన్‌ వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పత్తి ప్యాకింగ్‌ విధానంలో శిక్షణ ఇచ్చినప్పటికీ వారిలో మార్పు రావటం లేదు. కాబట్టి ప్రభుత్వం ప్యాకింగ్‌ విధానంపై కఠిన ఆంక్షలు విధించాలి. 


ఆంధ్రప్రదేశ్‌లో ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ లేదు. ప్రభుత్వం ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో టెక్స్‌టైల్‌ ప్రాసెసింగ్‌ పార్కు ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో రోజుకి సుమారు 40 లక్షల స్పిన్డేల్స్‌ నుంచి తయారయ్యే 20 లక్షల కేజీల దారాన్ని రకరకాల దుస్తులుగా మార్చగలిగితే రాష్ట్రంలోని గ్రామ సీమలలో మౌలిక వసతులు అభివృద్ధి చెంది, ప్రజల జీవన శైలి మారుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 50 లక్షలమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వాలకు జిఎస్‌టి రూపంలో సుమారు 3500–-4000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. గుంటూరు, దాని పరిసర ప్రాంతం రాష్ట్రానికి కేంద్ర బిందువుగా, ఇతర ముఖ్య పట్టణాలతో అనుసంధానమై ఉంది. ఇది టెక్స్‌టైల్‌ ప్రాసెసింగ్‌ పార్కులు ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతం. ఈ పార్కులు ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ ఈ రంగానికి సంబంధించి అనేక కళాశాలలు అభివృద్ధి చెందుతాయి. అలాగే వస్త్ర పరిశ్రమలలో 80శాతం మహిళలు పనిచేయడానికి అవకాశం ఉంది కాబట్టి మహిళా సాధికారత మెరుగుపడి కుటుంబాల తలసరి ఆదాయం పెరుగుతుంది. 


కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ) నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం ప్రభుత్వం రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలి. సిసిఐ క్వింటాల్‌కు రూ.5550 ధర నిర్ణయించగా, దళారులు రూ.4,000–-4500 మాత్రమే రైతులకు చెల్లించి క్వింటాలుపై రూ.1000 లాభం పొందుతున్నారు. ఈ దళారులు తామే రైతులమన్న ముసుగులో సిసిఐకి విక్రయిస్తున్నారు. దీన్ని నియంత్రించాలి. మార్కెటింగ్‌ యార్డులలో పత్తిని ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంచడానికి అవసరమైనన్ని గిడ్డంగులు నిర్మించాలి. వాడుకలో ఉన్న పత్తి తీత యంత్రాలను పరిశీలించి, అవి మన ప్రాంతానికి, నేలలకు అనువుగా ఉన్నాయో లేదో చూడాలి. ఆ సాంకేతికత ఆధారంగా మన నేలలకు అనువుగా ఉండే యంత్రాలను తయారు చేసి రైతులకు, రైతు ఉత్పత్తి సమాఖ్యలకు 75శాతం సబ్సిడీతో అందజేయాలి.


జి. వెంకటేశ్వరరావు, సి.ఇ.ఓ, కె.సి.పి. షుగర్స్

Updated Date - 2020-10-10T05:58:48+05:30 IST