వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన పత్తి
చేతిలో పంట ఉన్నప్పుడు క్వింటాల్ ధర రూ. 6 వేలు
పంట చివరలో రూ.11 వేలకు చేరిక
ముందుగా అమ్ముకున్న రైతుల్లో నిస్పృహ
సాగు విస్తీర్ణం, దిగబడులు తగ్గడమే కారణం
అంతర్జాతీయ మార్కెట్లోనూ పెరిగిన డిమాండ్
హనుమకొండ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది పత్తి రైతు పరిస్థితి నవ్వాలో ఏడ్వాలో తెలియని చందంగా తయారైంది. చేతికి వచ్చిన పత్తిని తక్కువ ధరకు అమ్మినవారు ఒక పక్క బాధపడుతుంటే, పంట చివరన మార్కెట్‌కు పత్తిని తెచ్చి ఎక్కువ ధరకు అమ్ముకున్నవారు సంతోషిస్తున్నారు. ఈ సీజన్లో క్వింటాలు పత్తి ధరలో సుమారు రూ. 5 వేల వ్యత్యాసం చోటుచేసుకోవడం సరికొత్త పరిణామం.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని ఇతర మార్కెట్లో కూడా క్వింటాలు పత్తి ధర గురువారం రూ.10,830 పలికింది. అంతకు ముందు రోజు ధర క్వింటాకు రూ.10,770 ఉంది. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ ధర మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇంకా కొద్ది రోజుల్లో సీజన్ ముగుస్తుందనగా మార్కెట్లో పత్తి ధర ఇంతగా పెరగడానికి కారణం గత సంవత్సరం కన్నా ఈ యేడు సాగు విస్తీర్ణం 2.30 లక్షల ఎకరాలు తగ్గడం ప్రధాన కారణంగా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. దీనికితోడు అధిక వర్షాల వల్ల దిగుబడులు కూడా గణనీయంగా తగ్గాయి. ఇది కూడా మరో కారణమంటున్నారు.
పెరిగిన డిమాండ్
పత్తి రైతుకు ఒక విధంగా ఈ యేడాది పండుగే అయింది. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో పత్తి తెల్లబంగారమే అయింది. ఈ సీజన్లో మొదటి నుంచి కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కంటే ఎక్కువే రైతులకు లభించింది. ఈ ఏడాది క్వింటాల్ పొడుగు పింజ పత్తి రూ. 6025, మధ్యస్థ పత్తి రూ. 5,726గా కనీస మద్దతు ధర నిర్ణయించారు. గత రెండేళ్లలో ఎమ్మెస్పీ లభించడకపోవడంతో ప్రస్తుతం పత్తి ఎమ్మెస్పీ క్వింటాల్‌కు రూ. 6,025. ఉండగా మార్కెట్లో రూ. 10,800 పలుకుతోంది.
తగ్గిన పత్తి విస్తీర్ణం
ఉమ్మడి జిల్లాలో ఈ ఖరీ్‌ఫలో పత్తిసాగు గణనీయంగా తగ్గింది. గత సంవత్సరం 7,39,591 ఎకరాల్లో పత్తి సాగుకాగా ఈ ఏడు 5,08,910 ఎకరాల్లో సాగు చేశారు. 2,30,681 ఎకరాలు తగ్గిపోయింది. పత్తిధర పెరగడానికి సాగు విస్తీర్ణం తగ్గడం ప్రధాన కారణంగా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం ఖరీఫ్ కన్నా ఈ సారి సుమారు 31 శాతం పత్తి సాగు తగ్గింది. జనగామ జిల్లాలో గత ఖరీ్‌ఫలో 1,83,441 ఎకరాల్లో పత్తిని సాగు చేయగా ఈ సారి 1,44,617 ఎకరాల్లోనే వేశారు. అంటే 38,824 ఎకరాలు తగ్గింది. హనుమకొండ జిల్లాలో గత సంవత్సరం ఖరీ్‌ఫలో 1,28,000 ఎకరాల్లో సాగు చేయగా ఈ సారి 79,030 ఎకరాలకే పరిమితం చేశారు. అంటే 48,970 ఎకరాలు తగ్గిపోయింది. వరంగల్ జిల్లాలో గత ఖరీ్‌ఫలో 1,58,000 ఎకరాల్లో పత్తిసాగు చేయగా ఈ సారి 1,09,000 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. 49,000 ఎకరాల మేరకు పత్తిసాగు పడిపోయింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా పత్తి సాగు తగ్గింది. ఈ జిల్లాలో గత ఖరీ్‌ఫలో 79,933 ఎకరాల్లో పత్తి సాగు చేస్తే ఈ సారి 48,802 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. 31,131 ఎకరాలు తగ్గింది. ములుగు జిల్లాలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ జిల్లాలో గత సంవ్సరం కన్నా ఈ ఏడు పత్తి సాగు 6వేల ఎకరాలు పెరిగింది. కిందటేడు 48,000 ఎకరాల్లో సాగు చేయగా ఈ సారి 54,000 ఎకరాల్లో పత్తి వేశారు. ఈ జిల్లాలో రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది. వరి సాగు విస్తీర్ణం తగ్గిం ది. పత్తితో పాటు కంది సాగు పెరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో ఈ సారి 13వేల ఎకరాల్లో కంది సాగవుతోంది. మహబూబాబాద్ జిల్లాలోనూ పత్తి సాగు తగ్గింది. గత ఖరీ్‌ఫలో 1,36217 ఎకరాల్లో పత్తి వేయగా ఈ సారి 73491 ఎకరాల్లో వేశారు. 62736 ఎకరాల మేరకు పత్తి సాగు తగ్గింది.
తగ్గిన దిగుబడి
ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో దిగుబడి పెరిగినప్పటికీ, అకాల వర్షాలతో కొన్ని చోట్ల దిగుబడి తగ్గింది. దీంతో డిమాండ్ పెరిగింది. దీనికి నాణ్యత కూడా తోడవడంతో పత్తి రైతుకు ఎక్కువ ధర లభిస్తోంది. కొవిడ్ నేపధ్యంలో అంతర్జాతీయంగా దూది వినియోగంతో పాటు, నూలు ధరలు కూడా పెరగడం కూడా పత్తి ధరల పెరుగుదలకు కారణాలుగా చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాటన్ సీడ్‌కు కూడా మంచి రేటు వస్తోంది. క్వింటాల్‌కు కనిష్ఠంగా రూ. 3180, గరిష్ఠంగా రూ. 3620 పలుకుతోంది.
వరిపైపే మొగ్గు
గత సంవత్సరం పత్తి ధరల్లో అనిశ్చితి నెలకొంది. అంతగా గిట్టుబాటు కాలేదు. ఎమ్మెస్పీరేటు కన్నా తక్కువ ధరకు అమ్మాల్సి వచ్చింది. గిట్టుబాటు ధర లభించకపోవడంలో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగిన సందర్భాలున్నాయి. పైగా ఈ సారిలా వాతావరణం కూడా అంతగా అనుకూలించలేదు. వీటన్నిటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఎంత వద్దంటున్నా రైతులు ఈ సారి వరిసాగువైపు ఎక్కువగా మొగ్గు చూపారు. వరిపండిస్తే గింజ కూడా కొనబోమని ఎంత చెప్పినా అన్నదాతలు పట్టించుకోలేదు. దీంతో గత సంవత్సరం కన్నా ఈ సారి ఉమ్మడి జిల్లాలో 20 శాతం వరి పెరిగింది. వర్షాలు పుష్కలంగా కురియడం, చెరువులు, కుంటలు, బావుల్లో పుష్కలంగా నీరు అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది రైతులు వరివైపు మొగ్గు చూపారు. దీంతో పత్తి సాగు తగ్గి సహజంగానే డిమాండ్ పెరిగింది.
మొదట్లో రైతులకు ఈ విషయం తెలియదు. పైగా మార్కెట్లోకి పెద్ద ఎత్తున పత్తివస్తే రేటు ఎక్కడ పడిపోతుందోనని రైతులు తొందరపడ్డారు. పత్తి ఏరగానే వెంటనే మార్కెట్‌కు తీసుకువచ్చారు. అదృష్టం కొద్ది ఎమ్మెస్పీ రేటుకే కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడంతో అమ్మేసుకున్నారు. డిమాండ్-సప్లయ్‌ని బట్టి రేటు మారడంతో చివరగా తీసుకువచ్చిన పత్తికి మంచి రేటు పలికింది. అయితే సీజన్ చివరలో ధరపెరగడం మామూలే. కానీ ఎమ్మెస్పీ కన్నా రూ. 4వేలకుపైగా పెరగడం ఇదే మొదటి సారి. దీంతో మొదట మార్కెట్‌కు పత్తిని తీసుకువచ్చి విక్రయించిన రైతులు ఇప్పుడు విచారిస్తున్నారు.
దిగుబడులు తగ్గడమే కారణం
- ఉషాదయాళ్, వరంగల్, హనుమకొండ వ్యవసాయాధికారి
గత సంవత్సరం కన్నా ఈ సారి పత్తి సాగు విస్తీర్ణం తగ్గడం ప్రధాన కారణం. దీంతో పాటు దిగుబడులు కూడా బాగా తగ్గాయి. ఫలితంగా మార్కెట్‌కు పత్తి రాక తగ్గింది. సీజన్ మొదట్లో రైతులు తమ ఉత్పత్తులను వెంటనే తీసుకువచ్చినా ఆ తర్వాత తగ్గిపోయింది. దీంతో సహజంగానే పత్తికి డిమాండ్ పెరిగింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఈసారి చైనా నుంచి పత్తి దిగుమతులు కూడా తగ్గాయి. ఇవన్నీ పత్తి ధర పెరగడానికి కారణమయ్యాయి.