పత్తి రైతు..చిత్తు

ABN , First Publish Date - 2022-08-14T05:24:53+05:30 IST

భారీ వర్షాలు పత్తి రైతును అతులాకుతులం చేస్తున్నాయి. చేసిన కష్టం, పెట్టుబడులు నీటి పాలవుతున్నాయి.

పత్తి రైతు..చిత్తు
కలుపు మొక్కలతో నిండిపోయిన పత్తి చేను

 వర్షాలకు 3,500ఎకరాల్లో నీటమునిగిన పంట 

 మొక్కల్లో నిలిచిపోయిన ఎదుగుదల

 పత్తి పంటను దున్ని, ప్రత్యామ్నాయ పంటలు  సాగు చేస్తున్న అన్నదాతలు 


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, ఆగస్టు 13: భారీ వర్షాలు పత్తి రైతును అతులాకుతులం చేస్తున్నాయి. చేసిన కష్టం, పెట్టుబడులు నీటి పాలవుతున్నాయి. పత్తి చేన్లు నీట మునిగి పాడవుతున్నాయి. మొక్క ఎదుగుదల దశలోనే పంటను కీటకాలు నాశనం చేస్తుండడంతో పత్తి రైతులు నష్టపోతున్నారు. పంట పూర్తిగా నష్టపోయిన రైతులు పత్తి పంటను దున్నేసి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటున్నారు. 


జిల్లాలో సాగైన పత్తి సగమే


మెదక్‌ జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో అన్ని రకాల పంటలు కలిపి 3.31 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఇందులో పత్తి సాగు అంచనా 92 వేల ఎకరాలు. కాగా జూలై నెలాఖరు నాటికి జిల్లా వ్యాప్తంగా 48,257 ఎకరాల్లో మాత్రమే రైతులు పత్తి పంటను విత్తారు. ఇందులో అత్యధికంగా అల్లాదుర్గం మండలంలో 14,442 ఎకరాలు, రేగోడ్‌లో 9,840 ఎకరాలు, టేక్మాల్‌ మండలంలో 7,160 ఎకరాలు, పెద్దశంకరంపేట మండలంలో 6,880 ఎకరాలు, చిల్‌పచెడ్‌ మండలంలో 1,500 ఎకరాలు, కొల్చారం మండలంలో 1,365 ఎకరాలు, కౌడిపల్లి మండలంలో 1,250 ఎకరాలు, చేగుంట మండలంలో 1,119 ఎకరాలు, నర్సాపూర్‌ మండలంలో 1,115 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. మొన్నటి భారీ వర్షాలకు 3,500ఎకరాల వరకు నీట మునిగి దెబ్బతిన్నది. వానలకు చేలలో నీరు నిలిచి పంట ఎదగడం లేదని, కలుపు తీయడం ఇబ్బందికరంగా మారిందని రైతులు చెబుతున్నారు. 



వరుస వర్షాలతో తగ్గిన పత్తిసాగు 


పత్తి పంట సాగు చేసిన రైతులకు మొదటి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరుసగా కురిసిన భారీ వర్షాలకు మొదట్లో వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో రెండోసారి విత్తగా అన్ని మొలకెత్తాయి. మొక్క ఎదుగుతున్న దశలోనే వర్షాలు పడడంతో మొక్క ఎదుగుదల నిలిచిపోయింది. పోయిన పంటకు పత్తికి మంచి ధర పలకడంతో ఈసారి చాలామంది రైతులు వరికి బదులు పత్తి సాగు చేయాలనుకున్నారు. వ్యవసాయ అధికారులు కూడా పత్తి సాగు పెరుగుతుందని అంచనా వేశారు. అయితే వరుసగా వానలు పడడంతో పత్తి సాగు తగ్గింది. జూలై నెలాఖరు నుంచి వరుసగా వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలో లక్ష్యం మేరకు పత్తి పంట సాగు చేయలేకపోయారు. ఇప్పుడు సాగు చేసిన పంటలో ఏ మేరకు చేతికి వస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే అవకాశం లేక పత్తి చేన్లను కొందరు వదిలేశారు. మరి కొందరు పొలాలను పూర్తిగా దున్ని, వరి, కంది వంటి పంటలను సాగు చేసుకుంటున్నారు. 


 

Updated Date - 2022-08-14T05:24:53+05:30 IST